logo

ఎన్‌జీటీ ఆదేశాలొస్తేనే... కదులుతున్నారు!

పర్యావరణ పరిరక్షణకు, కాలుష్య నియంత్రణకు పరిశ్రమలు పాటించాల్సిన నిబంధనలను విశాఖ నగరంలోని కొన్ని పారిశ్రామిక సంస్థలు ఉల్లంఘిస్తున్నాయి. చట్ట నిబంధనలు స్పష్టంగా ఉన్నప్పటికీ వాటిని పాటిస్తున్నాయా? లేదా? అన్న విషయాల పరిశీలన

Published : 28 Jan 2022 04:51 IST

విశాఖ పరిశ్రమలపై వరుస విచారణలు
కాలుష్య నిబంధనలు పట్టించుకోని సంస్థలు

హెచ్‌.పి.సి.ఎల్‌.లో తొమ్మిదిన్నరేళ్లపాటు ఉల్లంఘనల పర్వం
ఈనాడు, విశాఖపట్నం

ఇటీవల ఎన్టీపీసీ సమీప ప్రాంతాల్లో విచారణ చేస్తున్న విశాఖ జేసీ వేణుగోపాలరెడ్డి ఆధ్వర్యంలోని అధికారుల బృందం

పర్యావరణ పరిరక్షణకు, కాలుష్య నియంత్రణకు పరిశ్రమలు పాటించాల్సిన నిబంధనలను విశాఖ నగరంలోని కొన్ని పారిశ్రామిక సంస్థలు ఉల్లంఘిస్తున్నాయి. చట్ట నిబంధనలు స్పష్టంగా ఉన్నప్పటికీ వాటిని పాటిస్తున్నాయా? లేదా? అన్న విషయాల పరిశీలన పూరిస్థాయిలో జరగటం లేదనే ఆరోపణలున్నాయి. హెచ్‌.పి.సి.ఎల్‌. దాదాపు తొమ్మిదిన్నరేళ్లుగా నిబంధనలను ఉల్లంఘించినట్లు అధికారుల ప్రాథమిక విచారణలో నిర్దరణ కావడం గమనార్హం.

గరంలోని పలు అంశాలపై పరిశీలనకు జాతీయ హరిత ట్రైబ్యునల్‌(ఎన్‌.జి.టి.) నుంచి వరుసగా ఆదేశాలు వస్తుండటం గమనార్హం. విశాఖ, చుట్టుపక్కల ప్రాంతల్లోని కొన్ని పరిశ్రమల నుంచి కొన్నిసార్లు వివిధ రసాయనాల తాలూకు తీవ్రమైన దుర్వాసనలు ఆయా ప్రాంతాల్లో ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కొన్నిచోట్ల ప్రజలు ఆందోళనలూ చేశారు. ఆ వాసనల తీవ్రతను గుర్తించడానికి కాలుష్యనియంత్రణ మండలికి ప్రత్యేక బృందాలు లేవు.

నౌకాశ్రయంలో: విశాఖ నౌకాశ్రయంలోని స్టాక్‌యార్డుల కాలుష్యాన్ని నియంత్రించడంలో అధికారులు విఫలమవుతున్నాయని చైతన్య స్రవంతి స్వచ్ఛందసంస్థ వ్యవస్థాపకురాలు షిరీన్‌రెహమాన్‌ జాతీయ హరిత ట్రైబ్యునల్‌ను ఆశ్రయించగా...వచ్చిన ఆదేశాలతో నౌకాశ్రయంలో కాలుష్య నివారణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. గత కొంత కాలం నుంచి కాలుష్యకారకాల స్థాయిని హరిత ట్రైబ్యునల్‌ పర్యవేక్షిస్తూనే ఉంది. కొద్దికాలం కిందట మళ్లీ కాలుష్యస్థాయి పెరగడంతో సంస్థపై సుమారు రూ. 98 లక్షల అపరాధరుసుం విధించింది.

ఎన్‌టీపీసీలో: నగర శివారులోని ఎన్‌.టి.పి.సి. పరిధిలోని ‘సింహాద్రి థర్మల్‌ విద్యుదుత్పత్తి’ సంస్థ గ్రీన్‌బెల్ట్‌ను నిబంధనల ప్రకారం అభివృద్ధి చేయలేదు. విశాఖ నగరంలోనూ, పాడేరులోనూ మొక్కలు నాటినట్లు చెప్పింది. ఇక్కడ ప్రజలను ఇబ్బందులకు గురి చేసే అంశాలు ఉన్నాయనే అంశం ఎన్‌జీటీ దృష్టికి వెళ్లింది.. అక్కడి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు విశాఖ జిల్లా సంయుక్త కలెక్టరు వేణుగోపాల్‌రెడ్డి, కాలుష్య నియంత్రణమండలి అధికారుల సంయుక్త కమిటీ ఎన్‌.టి.పి.సి. పరిసర గ్రామాల్లో పర్యటించి కాలుష్యం ఉందని ప్రాథమికంగా నిర్దరించారు. ఈ నేపథ్యంలో పీసీబీ అధికారులు ఆ సంస్థ నుంచి రూ.1.28కోట్ల బ్యాంకు గ్యారెంటీ కూడా తీసుకున్నారు.

హెచ్‌.పి.సి.ఎల్‌.లో: నగరంలోని కీలక పరిశ్రమల్లో హెచ్‌పీసీఎల్‌ ఒకటి. ఈ సంస్థ కాలుష్యంపై ఎన్‌.జి.టి.  కొరడా ఝుళిపించింది. ఆ సంస్థ కాలుష్య నియంత్రణమండలి నిబంధనలను 2011 నుంచి ఉల్లంఘిస్తోందని పీసీబీ అధికారుల నివేదిక ఆధారంగా నిర్దరించింది. నీటి కాలుష్య నిబంధనలు, వాయు కాలుష్య నిబంధనల ఉల్లంఘనలకు గానూ మొత్తం రూ.8.35 కోట్ల అపరాధరుసుం చెల్లించాల్సి వస్తుందని అంచనా వేసింది. దాదాపు 3480 రోజులుగా హెచ్‌పీసీఎల్‌ లోపాలను సరిదిద్దుకోలేదనేది ప్రధాన ఆరోపణ. ఎన్‌.జి.టి. వచ్చే నెలలో  జరిపే విచారణలో అపరాధరుసుంపై ఓ నిర్ణయం తీసుకోనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని