logo

లారీ ఢీకొని దంపతుల దుర్మరణం

కలిసిమెలిసి పనిచేసుకుంటూ అన్యోన్యంగా జీవించే భార్యాభర్తలు... వారికి ఇద్దరు కుమారులు. ఆ కుటుంబాన్ని చూసి విధికి కన్ను కుట్టింది. రోడ్డు ప్రమాదం రూపంలో దంపతులను బలితీసుకుంది.

Published : 28 Jan 2022 04:51 IST

ఘటనా స్థలంలో మృతదేహాలు

అనకాపల్లి పట్టణం, బుచ్చెయ్యపేట, న్యూస్‌టుడే: కలిసిమెలిసి పనిచేసుకుంటూ అన్యోన్యంగా జీవించే భార్యాభర్తలు... వారికి ఇద్దరు కుమారులు. ఆ కుటుంబాన్ని చూసి విధికి కన్ను కుట్టింది. రోడ్డు ప్రమాదం రూపంలో దంపతులను బలితీసుకుంది. పిల్లలిద్దరినీ అనాథలను చేసింది. ఈ హృదయ విదారక ఘటన గురువారం రాత్రి అనకాపల్లి పట్టణం సమీపంలోని ఉమ్మలాడ కూడలిలో చోటుచేసుకుంది. ట్రాఫిక్‌ సీఐ ప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం... బుచ్చెయ్యపేట మండలం పెదమదీనా గ్రామానికి చెందిన యర్రంశెట్టి నాగేశ్వరరావు (45), ఆయన భార్య రామలక్ష్మి అలియాస్‌ రాము (40) భవన నిర్మాణ కూలీలుగా పని చేస్తున్నారు. పనికోసం బైక్‌పై రోజూ ఇతరప్రాంతాలకు వెళ్లి సాయంత్రం తిరిగి వస్తుడేవారు. మునగపాక మండలం నాగులాపల్లిలో పని చేసేందుకు స్వగ్రామం నుంచి గురువారం ఉదయం వచ్చారు. సాయంత్రం పనులు పూర్తి చేసుకుని ఇంటికి బయలుదేరారు. ఉమ్మలాడ కూడలికి చేరుకునేసరికి 16వ నంబరు జాతీయ రహదారిపై వస్తున్న ట్రాలీ లారీ వీరు వెళ్తున్న బైక్‌ను ఢీకొట్టింది. లారీ వెనక చక్రం భార్యాభర్తలిద్దరిపై నుంచి వెళ్లిపోవడంతో అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదంలో మృతిచెందిన నాగేశ్వరరావు, రాము దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు శేఖర్‌ డిగ్రీ చివరి సంవత్సరం, చిన్న కుమారుడు ఆనంద్‌ ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. తల్లిదండ్రులిద్దరూ ఒకేసారి మృతి చెందడంతో వీరిద్దరూ అనాథలయ్యారు. తమ ఆలనాపాలనా చూసే అమ్మానాన్నలు ఇక లేరన్న చేదునిజాన్ని జీర్ణించుకోలేక వారి మృతదేహాల వద్ద కన్నీరుమున్నీరుగా విలపించిన తీరు చూపరులను కలచివేసింది. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ట్రాఫిక్‌ సీఐ ప్రసాద్‌ తెలిపారు.

ఇద్దరు కుమారులతో నాగేశ్వరరావు, రాము (పాత చిత్రం)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని