logo

కండలు చూపి.. కొలువులు పట్టి...

నిత్య వ్యాయామంతో ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాకుండా.. కండలు పెంచి ప్రతిభ చూపితే... భవిష్యత్తు ఉపాధికి అవసరమైన కొలువులు సాధించొచ్చని నిరూపిస్తున్నారీ పారిశ్రామిక ప్రాంత యువత.

Published : 28 Jan 2022 04:51 IST

శరీరసౌష్ఠవ పోటీల్లో రాణిస్తున్న యువత
-న్యూస్‌టుడే, సింధియా


బౌన్సర్లుగా పని చేస్తున్న బాడీబిల్డర్స్‌

నిత్య వ్యాయామంతో ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాకుండా.. కండలు పెంచి ప్రతిభ చూపితే... భవిష్యత్తు ఉపాధికి అవసరమైన కొలువులు సాధించొచ్చని నిరూపిస్తున్నారీ పారిశ్రామిక ప్రాంత యువత.

స్థానిక బర్మాకాలనీలో నివాసం ఉంటున్న జి.శ్రీనివాస్‌ 25 ఏళ్ల కిందటే ఉపాధి కోసం ఓ వెల్డింగ్‌ దుకాణంలో చేరి పనిలో మెలకువలు నేర్చుకుని నైపుణ్యం సాధించారు. అదే సమయంలో రోజూ వ్యాయామం చేసి కండలు పెంచి... ఆర్మీ రిక్రూట్‌మెంట్‌కు వెళ్లగా పొడవు సరిపోక అవకాశాన్ని చేజార్చుకున్నారు. తనలా సాధన చేసే వారికి బాసటగా నిలవాలని సొంతంగా వ్యాయామ పరికరాలను తయారు చేసి శ్రీహరిపురం, మల్కాపురం ప్రాంత యువకులకు ఉచితంగా శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. అయితే శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసిన గదులకు చెల్లించాల్సి అద్దె రుసుము కోసం స్థానిక యువకులు తలో చేయి వేస్తుంటారు.

జిమ్‌లో సాధన చేస్తూ..

20 ఏళ్ల నుంచి...
శ్రీహరిపురంలో ఏర్పాటు చేసిన దుర్గా వ్యాయామశాలలో 20 ఏళ్ల నుంచి వందలాది మంది యువకులకు తర్ఫీదునిచ్చారు. వారిలో చాలా మంది శరీరసౌష్ఠవ పోటీల్లో రాణించి... ఆ ప్రతిభతో ప్రభుత్వ కొలువులు సాధించగా, మరొకొందరు బౌన్సర్లుగా తాత్కాలిక ఉపాధి అవకాశాలు చేజిక్కించుకుని ముందుకు సాగుతున్నారు.


బౌన్సర్లుగా పంపిస్తున్నాం..
-జి.శ్రీనివాస్‌, జిమ్‌ నిర్వాహకులు

వ్యాయామం చేసేందుకు వచ్చే ప్రతి యువకుడు ఏదైనా కోర్సు చదువుతూ ఉండాలి. లేకపోతే ఏదైనా సంస్థలో పని చేస్తూ ఉండాలి. ఖాళీగా ఉండే వాళ్లకు అనుమతి ఇవ్వడం లేదు. ఇప్పటికే పలువురు వివిధ కొలువులు సాధించి.. జీవితంలో స్థిరపడ్డారు. ప్రస్తుతం శిక్షణ పొందుతున్న యువకుల్లో కొందరిని ప్రైవేటు బౌన్సర్లుగా పంపిస్తూ... ఉపాధి చూపుతున్నాం. అందరి సమన్వయంతో ఉచిత శిక్షణను కొనసాగించడం ఎంతో ఆనందంగా ఉంది.


డాక్‌యార్డులో కొలువు..
-జి.శ్రీధర్‌, శ్రీహరిపురం

గత పదేళ్ల నుంచి ఇక్కడి వ్యాయామశాలకు వస్తున్నా. చేరిన తొలి మూడేళ్లలోనే స్థానిక, జిల్లాస్థాయి శరీర సౌష్ఠవ పోటీల్లో పాల్గొనడం ప్రారంభించా. ఏడేళ్ల కిందట రాష్ట్రస్థాయి పోటీలో ఉత్తమ ప్రతిభ చూపా. నేవల్‌ డాక్‌యార్డులో ప్రభుత్వ కొలువు సాధనకు ఆ పురస్కారం, ప్రశంసాపత్రం ఉపకరించాయి.


రైల్వే శాఖలో...
-సతీష్‌, రైల్వే ఉద్యోగి

గత అయిదేళ్లుగా వ్యాయమం చేస్తూ... జాతీయ స్థాయి శరీర సౌష్ఠవ పోటీల్లో రాణించా. అక్కడ సాధించిన ధ్రువీకరణ పత్రాలు రైల్వేలో కొలువు సాధనకు ఉపయోగపడ్డాయి. ఖాళీ సమయంలో కసరత్తు చేస్తున్నా. భవిష్యత్తులో మరిన్ని పోటీల్లో పాల్గొంటా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని