logo

కళ్లాల్లో ధాన్యం.. కళ్లలో దైన్యం

ఖరీఫ్‌ పంటలను మద్దతు ధరకు కొంటాం. కళ్లానికే వచ్చి తీసుకువెళతాం.. 21 రోజుల్లో సొమ్ములు రైతుల ఖాతాల్లో జమచేస్తామని సర్కారు చెబుతోంది. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా కనిపిస్తోంది. రైతుల చెంతకు వచ్చి ఆరా తీసేవారు లేరు.

Published : 28 Jan 2022 04:51 IST

ఈ-క్రాప్‌ నిబంధనతో దళారులకే పంట

-ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం న్యూస్‌టుడే బృందం

ఖరీఫ్‌ పంటలను మద్దతు ధరకు కొంటాం. కళ్లానికే వచ్చి తీసుకువెళతాం.. 21 రోజుల్లో సొమ్ములు రైతుల ఖాతాల్లో జమచేస్తామని సర్కారు చెబుతోంది. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా కనిపిస్తోంది. రైతుల చెంతకు వచ్చి ఆరా తీసేవారు లేరు. పోనీ ఆర్‌బీకేలకు వెళితే సాంకేతిక సమస్యలంటూ తిప్పుతున్నారు.. మిల్లర్ల దగ్గరకు వెళితే గోదాములు ఖాళీ లేవంటున్నారు. చేతిలో ధాన్యమున్నా అమ్ముకోవడానికి అగచాట్లు పడాల్సివస్తోందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేసేదిలేక వ్యాపారులకే పంటను అప్పగించి నష్టాన్ని మూటగట్టుకుంటున్నారు.

సీరియల్‌ నంబర్‌ వచ్చేవరకు ఆగాల్సిందే..
ఆర్బీకేలకు ధాన్యం తీసుకువస్తామని రైతులు ముందుగా సమచారం ఇస్తే వారికి ఒక నంబర్‌ రాసి ఇస్తున్నారు. అంతకంటే ముందున్నవారంతా అయిపోయిన తరువాత ఆ రైతు దగ్గర నుంచి ధాన్యం తీసుకుంటామంటున్నారు. మునగపాకలోని రైతు బొడ్డేడ ఈశ్వరరావు పంట నూర్చి 90 బస్తాలు వారం రోజులుగా కళ్లంలోనే పెట్టుకుని నిరీక్షిస్తున్నాడు. ఆర్బీకేలో అమ్మడానికి వెళితే నీది 42వ నంబర్‌, నీ ముందున్నవారు అయిపోతే మీవే తీసుకుంటాం ఆగండంటున్నారు. ఇప్పటికి ఆరు రోజులవుతున్నా ధాన్యం తీసుకునే దిక్కులేకుండా పోయిందని రైతు ఆవేదన వ్యక్తంచేశారు.

ఈ-క్రాప్‌ తంటాలు..
ఈ-క్రాప్‌లో నమోదైన రైతుల నుంచే ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. ఏజెన్సీలో చాలామంది ఈ-క్రాప్‌పై అవగాహన లేక నమోదు చేయించుకోలేకపోయారు. కొంతమంది ప్రయత్నించినా నెట్‌వర్క్‌ సమస్యలతో సాధ్యం కాలేదు. దీంతో మన్యంలో ధాన్యం కొనుగోళ్లు సాగ[డం లేదు. ఇటీవల కొయ్యూరు మండలం జడ్పీటీసీ సభ్యుడు నూకరాజు గట్టిగా నిలదీయడంతో ఆ మండలంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మమ అనిపించేశారు. మిగతాచోట్ల ఇప్పుడిప్పుడు కొనుగోలు కేంద్రాలు తెరవడానికి చర్యలు తీసుకుంటున్నారు.

గాలిపోత పోస్తున్న  కూలీలు

అడ్డగోలుగా వసూళ్లు..
నర్సీపట్నానికి చెందిన లాలం అప్పారావు మాట్లాడుతూ గోనె సంచులు ఆర్‌బీకేలో రాలేదన్నారు. ఒక్కో గోనె సంచిని రూ.18 చొప్పున కొనుక్కున్నాం. మిల్లు యజమాని ఆ సంచులకు రూ.10 చొప్పున తిరిగి ఇచ్చాడు. కాటా ఖర్చులంటూ ఓ వంద రూపాయలు తీసుకున్నారు. మళ్లీ నమూనాలు పరీక్షించాలంటూ బస్తాకి వందగ్రాముల ధాన్యం తీసుకున్నారు. ఇష్టం ఉంటే ఇవ్వండి లేదంటే ధాన్యం పట్టుకుపోండి అని తెగేసి చెప్పారని ఆవేదన వ్యక్తంచేశారు.  


ఈ ఏడాది భారీ వర్షాలు నమోదైనా వరి దిగుబడి ఆశాజనకంగానే వచ్చింది. 1.30 లక్షల టన్నులు కొనుగోలు చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు. దీనికోసం 175 రైతు భరోసా కేంద్రాల పరిధిలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. రైతుల చెంతకే ఇచ్చి కొనుగోలు చేస్తారని ప్రచారం చేశారు. ఎక్కడా ఆ పరిస్థితి లేదు. రైతులే సొంత ఖర్చులతో ఆటోలు, వ్యాన్‌లు ఏర్పాటు చేసుకుని కొనుగోలు కేంద్రాలైన పీఏసీఎస్‌లు, రైతు భరోసా కేంద్రాలకు బస్తాలలో తీసుకెళుతున్నారు.


కాగితలో ఈ చిన్న గదే ఆర్‌బీకే

నష్టపోతున్నారిలా..
సాధారణ రకం క్వింటాలు రూ.1940, ఏ గ్రేడు రకానికి రూ.1960 మద్దతు ధర చెల్లించాలి. రైతు బయట అమ్ముకున్నా ఇదే ధర దక్కాలి. దళారులు 80 కేజీల బస్తాకు రూ.1250 నుంచి రూ.1300 మాత్రమే ఇస్తున్నారు. మట్టి బెడ్డలుంటున్నాయని నాలుగైదు కేజీలు అదనంగా తీసుకుంటున్నారు. దీంతో ఒక్కో బస్తా దగ్గర రూ.300 వరకు నష్టపోతున్నాడు. ధరలోనే కాకుండా తూకంలోనూ మోసగిస్తున్నారు. గతంలో ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల నుంచి వారంలో సొమ్ము ఇచ్చేవారు.  ఈ ఏడాది 21 రోజులైతేగానీ ఇవ్వలేమని ముందే చెప్పేశారు. ఇప్పటి వరకు కేవలం తొమ్మిది వేల టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. దీంతో చాలామంది ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల కంటే సరకు తీసుకున్న వెంటనే సొమ్ములు చెల్లించే దళారులనే ఆశ్రయిస్తున్నారు. ధర తగ్గినా.. తూకంలో మోసం చేసినా వెంటనే డబ్బులందుతున్నాయని రైతులంటున్నారు. పైగా హమాలీ ఛార్జీలు, రవాణా ఖర్చులు ఇవేవీ ఉండడం లేదని అందుకే ప్రైవేటు వర్తకుల వైపే మొగ్గుచూపుతున్నారు.


సర్వర్‌ సమస్య వల్లే..
-రాజేశ్వరి, జిల్లా పౌరసరఫరాల మేనేజర్‌

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సర్వర్‌ సమస్య ఉంది. అయినా ధాన్యం కొనుగోళ్లు చేపడుతున్నాం. జిల్లాలో పండగ తరువాతే ఎక్కువ మంది ధాన్యం తెస్తుంటారు. లక్ష్యం మేరకు అందరి దగ్గర పంట కొనుగోలు చేస్తాం. రైతుల ఖాతాలకు సొమ్ములు కూడా జమవుతున్నాయి. దళారులను ఆశ్రయించి మోసపోవద్దు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని