logo

చేతన్‌కు ఎంత కష్టమొచ్చింది..!

ఆటపాటలతో గడపాల్సిన నాలుగేళ్ల వయస్సులో బాలుడు చేతన్‌కు పెద్ద కష్టం వచ్చింది. కొద్ది నెలలుగా అరుదైన వ్యాధితో పోరాడుతున్నాడు. కంటికి రెప్పలా, అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కుమారుడ్ని కాపాడుకోవడానికి ఆ తల్లిదండ్రులు ఎంతో ఆరాట పడుతున్నారు. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం కావడం..

Updated : 19 May 2022 11:53 IST

నాలుగేళ్ల వయస్సులో అరుదైన వ్యాధితో విలవిల


చేతన్‌తో తల్లిదండ్రులు శ్రావణి, రాజకుమార్‌

ఆటపాటలతో గడపాల్సిన నాలుగేళ్ల వయస్సులో బాలుడు చేతన్‌కు పెద్ద కష్టం వచ్చింది. కొద్ది నెలలుగా అరుదైన వ్యాధితో పోరాడుతున్నాడు. కంటికి రెప్పలా, అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కుమారుడ్ని కాపాడుకోవడానికి ఆ తల్లిదండ్రులు ఎంతో ఆరాట పడుతున్నారు. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం కావడం.. కుమారుడికి ఖరీదైన వైద్యం చేయించే ఆర్థిక స్తోమత లేకపోవడంతో తల్లడిల్లిపోతున్నారు. విషయం తెలుసుకున్న పలువురు దాతలు మానవతా దృక్పథంతో ముందుకొచ్చి బాలుడి వైద్యం నిమిత్తం ఆర్థి.క సాయం అందిస్తున్నారు.

పరవాడ, న్యూస్‌టుడే

పెదగంట్యాడ మండలం 77వ వార్డు పరిధి యలమంచిలిదొడ్డి గ్రామానికి చెందిన నమ్మి రాజకుమార్‌, శ్రావణి దంపతులకు కుమారుడు చేతన్‌ (4), 9 నెలల చిన్నారి హేమవర్షిణి ఉన్నారు. రాజకుమార్‌ స్టీలుప్లాంటులో ఒప్పంద కార్మికునిగా పని చేస్తున్నాడు. శ్రావణి గృహిణి. పేద కుటుంబం కావడంతో చిన్నషెడ్‌ నిర్మించుకుని జీవనం సాగిస్తున్నారు.

* చేతన్‌కు ఆరు నెలల కిందట జ్వరం రాగా, ఎంతకీ తగ్గకపోవడంతో తల్లిదండ్రులు గోపాలపట్నంలోని ఓ చిన్నపిల్లల వైద్యుడ్ని సంప్రదించారు. ఆయన రక్త పరీక్షలు చేసి బాలుడికి అరుదైన వ్యాధి సోకిందని చెప్పి నగరంలోని ఓ ప్రయివేట్‌ క్యాన్సర్‌ ఆసుపత్రికి వెళ్లమని సూచించారు. అక్కడి వైద్యులు పరీక్షలు చేసి బాలుడు చేతన్‌ చెడియాక్‌ - హిగాషి సిండ్రోమ్‌ (సీహెచ్‌ఎస్‌)తో బాధ పడుతున్నాడని వెల్లడించారు. కడుపు ఉబ్బిపోవడం, చేతులు, కాళ్లు లాగేయడం, జ్వరం రావడం, ఒళ్లంతా పాలిపోవడం ఈ వ్యాధి లక్షణాలని తెలిపారు. ‘హప్లో-ఐడెంటికల్‌ స్టెమ్‌సెల్‌ మార్పిడి‘ చేయాలని, దానికి రూ.20 లక్షల వరకు ఖర్చు అవుతుందని, మందులు ఇతర ఖర్చులు మరో రూ.6 లక్షలు అవుతాయని వైద్యులు చెప్పడంతో తల్లిదండ్రులు హతాశులయ్యారు. అంతటి ఖరీదైన వైద్యం ఇప్పించే స్తోమత లేకపోవడంతో కుమిలిపోతున్నారు.

పరిమళించిన మానవత్వం

బాలుడి అనారోగ్యం గురించి తెలుసుకున్న పరిసర గ్రామాల యువత, ఇతర ప్రాంతాలకు చెందిన దాతలు చేయూత ఇవ్వడానికి ముందుకొస్తున్నారు. పెదపాలెం సహాయిత ఫౌండేషన్‌ రూ.45,500, 77వ వార్డు అంగన్‌వాడీ సిబ్బంది రూ.43,500, సింగపూర్‌కు చెందిన శివమిత్ర బృందం రూ.60 వేలు, ఇస్లాంపేట పాఠశాల 2013-14, 1992-93, 2004-05, 1996-97, 2002-03 బ్యాచ్‌లకు చెందిన విద్యార్థులు రూ.62,500, రూ.20 వేలు, రూ.14వేలు, రూ.11,500, రూ.11,500 చొప్పున, గాజువాకకు చెందిన మణియాదవ్‌ వెల్‌విషర్స్‌ బృందం రూ.30వేలు, దేవాడ పీహెచ్‌సీ సిబ్బంది రూ.20,150, యలమంచిలిదొడ్డికి చెందిన వై.రాజేశ్‌ రూ.20వేలు, దుబాయికి చెందిన బాబూరావు రూ.15వేలు, కూర్మన్నపాలెం ఐస్టడీస్‌ యాజమాన్యం రూ.15వేలు, పెదగంట్యాడ ప్రాథమిక పాఠశాల సిబ్బంది రూ.75వేలు అందజేశారు.

66మంది రూ. 6.42 లక్షలు

ఇప్పటి వరకు చేతన్‌ వైద్యం నిమిత్తం నెల రోజుల్లో 66 మంది దాతలు రూ.6.42 లక్షలు సమకూర్చారని తల్లిదండ్రులు తెలిపారు. కులమతాలకు అతీతంగా ఆర్థిక సాయం చేస్తున్న వారందరికీ కృతజ్ఞతలు చెబుతున్నారు. ఈ వ్యాధికి వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ పథకం వర్తించదని వైద్యులు చెబుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం, మరికొంత మంది దాతలు చేయూత ఇస్తే కుమారుడికి వైద్యం అందించి బతికించుకుంటామని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని