logo

మహిళలు.. చిన్నారుల్లో రక్తహీనత గండం!!

విశాఖలో పోషకాహార లోపం.. రక్తహీనతతో బాధపడుతున్న వారి సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. 2019-20లో ‘నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌ సర్వే’ ప్రకారం విశాఖ నగరంలో మహిళలు, 0-6 చిన్నారులు 72 శాతం మేర రక్తహీనతతో బాధపడుతున్నట్లు గుర్తించారు.

Published : 19 May 2022 04:32 IST

న్యూస్‌టుడే, ఎంవీపీకాలనీ


ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తున్న ఐసీడీఎస్‌ సిబ్బంది

విశాఖలో పోషకాహార లోపం.. రక్తహీనతతో బాధపడుతున్న వారి సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. 2019-20లో ‘నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌ సర్వే’ ప్రకారం విశాఖ నగరంలో మహిళలు, 0-6 చిన్నారులు 72 శాతం మేర రక్తహీనతతో బాధపడుతున్నట్లు గుర్తించారు.

పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు అంగన్‌వాడీల ద్వారా విస్తృత స్థాయిలో అవగాహన కల్పించే పనిలో యంత్రాంగం నిమగ్నమైంది. అంగన్‌వాడీ కార్యకర్తలు వారి పరిధిలోని లబ్ధిదారుల గృహాలను సందర్శించి ప్రాథమిక ఆరోగ్య అంశాలతోపాటు పోషకాహారంపై అవగాహన కల్పించే కార్యాచరణ చేపట్టారు.

అలా...ఆహారం అందిస్తూ..

మహిళా శిశు సంక్షేమ శాఖకు చెందిన ఐసీడీఎస్‌ల పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, 0-6 సంవత్సరాల బాలలకు పోషకాహారం అందిస్తారు. గతంలో గర్భిణులు, బాలింతలకు కేంద్రాల్లోనే ప్రభుత్వం సూచించిన మెనూ ప్రకారం వండి వడ్డించేవారు. కొవిడ్‌ నేపథ్యంలో టీహెచ్‌ఆర్‌(టేక్‌ హోమ్‌ రేషన్‌) విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. అంగన్‌వాడీ కేంద్రం ద్వారా ఆహారం అందించకుండా రేషన్‌ (బియ్యం, పప్పు, నూనె)తోపాటు పాలు, గుడ్లు కూడా ఒకేసారి లబ్ధిదారు ఇంటికి అందిస్తున్నారు.

* గర్భిణులు, బాలింతలకు ఒకేసారి ఇంటికి రేషన్‌, పాలు, గుడ్లు అందించటం ఎంత వరకు ప్రయోజనం చేకూరుస్తుందనే అంశంపై స్పష్టత లేదు.మరో వైపు గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య స్థితి గతులను తెలుసుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

* కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పోషణ అభియాన్‌లో భాగంగా ‘ప్రతి అంగన్‌వాడీ కార్యకర్త వినియోగించేలా పోషణ ట్రాకర్‌’ పేరిట యాప్‌ను రూపొందించింది. ప్రతి గర్భిణి ఇంటిని కనీసం నాలుగు సార్లు సందర్శించి, ఆమె ఆరోగ్యస్థితి, ఎత్తుకు తగిన బరువు, వయసుకు తగిన ఎత్తు వంటివి పొందుపరచాలి. కేంద్రం పరిధిలో తప్పనిసరిగా 60 శాతం గృహాలను సందర్శించాలి.  90 శాతం చిన్నారుల ఎత్తు, బరువును నమోదు చేయాలని నిబంధన విధించారు. అంగన్‌వాడీ కార్యకర్త, ఎ.ఎన్‌.ఎం., ఆశా కార్యకర్తలు మహిళల రక్తంలో హిమోగ్లోబిన్‌ శాతం మెరుగుపడేలా అవగాహన పెంచాలి.

జిల్లాలో ఐసీడీఎస్‌ ప్రాజెక్టులు: అర్బన్‌-1, అర్బన్‌-2, పెందుర్తి, భీమిలి
అంగన్‌వాడీ కేంద్రాలు:776
గర్భిణులు: 10,800
బాలింతలు: 8,500
3-6 సంవత్సరాల చిన్నారులు: 17,353
7 నెలల నుంచి 3 సంవత్సరాలు పిల్లలు: 39,900

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని