logo

ద్వాదశ జ్యోతిర్లింగాల వైభవం చూసొద్దాం..!

కేదారనాథ్‌ లింగం ప్రత్యేక ఆకర్షణ: ఆలయానికి ఇరువైపులా ఉన్న పన్నెండు ఆలయాల్లో సోమనాథుడు, శ్రీశైల మల్లికార్జునుడు, మహా కాళేశ్వరుడు, ఓంకారేశ్వరుడు, వైద్యనాథుడు, భీమశంకరుడు, రామేశ్వరుడు, నాగేశ్వరుడు,

Published : 19 May 2022 04:32 IST

వేంకటాద్రి మార్గంలో కొలువుదీరిన ఆలయం


ద్వాదశ జ్యోతిర్లింగ సహిత మహాకామేశ్వరీ అమ్మవారి ఆలయం

కేదారనాథ్‌ లింగం ప్రత్యేక ఆకర్షణ: ఆలయానికి ఇరువైపులా ఉన్న పన్నెండు ఆలయాల్లో సోమనాథుడు, శ్రీశైల మల్లికార్జునుడు, మహా కాళేశ్వరుడు, ఓంకారేశ్వరుడు, వైద్యనాథుడు, భీమశంకరుడు, రామేశ్వరుడు, నాగేశ్వరుడు, కాశీ విశ్వేశ్వరుడు, త్రయంబకేశ్వరుడు, కేదారనాథుడు, ఘృష్ణేశ్వర శివలింగాలను ప్రతిష్ఠించారు. వాటి కోసం కాశీ నుంచి ప్రత్యేకంగా బాణలింగాలను తెప్పించారు. కేదారనాథ లింగాన్ని మాత్రం కర్నూలు జిల్లాలో తయారు చేయించారు.

12 ఆలయాలు.. రూ.7కోట్ల వ్యయం: మహా కామేశ్వరీ సహిత ద్వాదశ జ్యోతిర్లింగాలయాల నిర్మాణానికి 2017లో ఆలయ కమిటీ శ్రీకారం చుట్టింది. తొలుత మహాకామేశ్వరీ అమ్మవారి ఆలయం నిర్మించి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. తర్వాత సుమారు ఎకరం స్థలంలో ఆలయం చేట్టూ 12 పవిత్ర శైవ క్షేత్రాల నిర్మాణం చేపట్టారు. ఒక్కో ఆలయానికి 60 టన్నుల నల్లరాయిని వినియోగించారు. కాశీ విశ్వేశ్వరుడి ఆలయాన్ని గోధుమవర్ణం రాయితో నిర్మించారు. దేశ విదేశాలకు చెందిన వందలాది మంది భక్తులు విరాళాలు అందించారు. ఆలయాల నిర్మాణానికి వినియోగించిన నల్ల శిలలను కర్నూలు జిల్లా నుంచి తెప్పించారు. శిల్పులు కూడా అక్కడి నుంచే వచ్చారు. ఆలయ నిర్మాణానికి సుమారు రూ.7కోట్లు ఖర్చు చేశారు.


ద్వాదశ జ్యోతిర్లింగాల ఆలయాలు

చినముషిడివాడ (పెందుర్తి), న్యూస్‌టుడే: దేశంలోని పన్నెండు పవిత్ర క్షేత్రాల్లో కొలువైన ద్వాదశ జ్యోతిర్లింగ దేవాలయాలను దర్శించుకోవాలని ప్రతి శివ భక్తుడు కోరుకుంటాడు. అలాంటి క్షేత్రాలన్నీ జీవీఎంసీ 97వ వార్డు చినముషిడివాడ వేంకటాద్రికి వెళ్లే మార్గంలోని మహాకామేశ్వరీ సహిత జ్యోతిర్లింగాల దేవాలయంలో కొలువుదీరాయి. ఈ ఆలయం అనేక విశిష్టతలను సొంతం చేసుకుంది. ఆయా విశేషాలను ధర్మకర్త దవళ యజ్ఞేశ్వర చేనులు వివరించారు.


ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన కేదారనాథ లింగం

ఆలయం విశేషాలు ఇలా: ● మహాకామేశ్వరి అమ్మవారి విగ్రహం పైన శ్రీచక్రం ఉంటుంది. ప్రవేశ ద్వారం వద్ద రాతితో చెక్కిన అష్టలక్ష్మీ అమ్మవార్లు ఉంటారు. ముఖ మండపంలో సీలింగ్‌కు ద్వాదశ రాశులను ఏర్పాటు చేశారు.

* ఆలయ ప్రాకార శాలహారంపై అష్టాదశ శక్తిపీఠాల్లోని అమ్మవార్లు కొలువయ్యారు. క్షేత్రపాలకుడిగా గణపతి పూజలందు కుంటున్నాడు. ఆ పక్కనే శూలాయుధుడైన షణ్ముఖుడు భక్తులను అనుగ్రహిస్తున్నాడు. అందమైన శిల్పాలు, ఆకట్టుకునే వర్ణాలతో ఆలయాన్ని చూడముచ్చటగా నిర్మించారు.


మహా కామేశ్వరీ అమ్మవారు

భక్తులు స్వహస్తాలతో అభిషేకాలు: ఈ ఆలయంలోని శివలింగాలకు భక్తులు స్వహస్తాలతో అభిషేకం చేసుకునే అవకాశం కల్పించారు. ప్రతి పౌర్ణమి రోజున అమ్మవారికి విశేష అభిషేకాలు, శ్రీచక్ర నవావర్ణార్చన, కుంకుమార్చనలు నిర్వహిస్తున్నారు. ఆలయాన్ని ఆనుకుని ఉన్న కల్యాణ మండపంలో శుభకార్యాలు, ఉపనయనాలు తక్కువ వ్యయంతో జరిపించుకునే వెసులుబాటు కల్పించారు. త్వరలో వేద పాఠశాలను నిర్మించనున్నట్లు ధర్మకర్త చేనులు తెలిపారు. ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 8గంటల వరకు ఆలయం తెరిచి ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని