logo

గాజువాకలో శిలాశాసనం!

విశాఖ జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలకు సరికొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. ఇప్పటి వరకూ తక్కువ నిధులతో చేపట్టిన పనైనా శిలాఫలకం ప్రారంభించి...దానిపై తమ పేరు చూసుకునేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు వెళ్లాలంటే ఆలోచిస్తున్నారు. తప్పదనుకున్నప్పుడు శిలా ఫలకం లేకుండానే కొబ్బరికాయ కొట్టి, పనులు ప్రారంభించి వెళ్లిపోతున్నారు.

Published : 20 May 2022 04:54 IST

 శిలాఫలకాలపై తన పేరుండాలన్న మంత్రి అమర్‌నాథ్‌

సందిగ్ధంలో ప్రజాప్రతినిధులు, అధికారులు

పనులకు కొబ్బరికాయలు కొట్టి  ప్రారంభోత్సవాలు

లంకెలపాలెంలో రూ. 20 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణానికి శిలాఫలకం

లేకుండానే సాగిన ప్రారంభోత్సవంలో పాల్గొన్న పెందుర్తి ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌

గాజువాక, న్యూస్‌టుడే: విశాఖ జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలకు సరికొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. ఇప్పటి వరకూ తక్కువ నిధులతో చేపట్టిన పనైనా శిలాఫలకం ప్రారంభించి...దానిపై తమ పేరు చూసుకునేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు వెళ్లాలంటే ఆలోచిస్తున్నారు. తప్పదనుకున్నప్పుడు శిలా ఫలకం లేకుండానే కొబ్బరికాయ కొట్టి, పనులు ప్రారంభించి వెళ్లిపోతున్నారు. ఇందుకు కారణం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి అమర్‌నాథ్‌ వ్యవహారమేననే చర్చ సాగుతోంది. జీవీఎంసీ పరిధిలోని గాజువాక జోన్‌లో ఏర్పాటు చేస్తున్న శిలాఫలకాల్లో తనపేరు లేకపోవడంపై విశాఖ కలెక్టరు, జీవీఎంసీ అధికారులనూ మంత్రి ప్రశ్నించినట్లు సమాచారం. తనకు గాజువాకతో నిత్యసంబంధాలు ఉన్నాయని, తనపేరు లేకుండా ఏర్పాటు చేయడం ఏమిటని అభ్యంతరం చెప్పడంతో ప్రొటోకాల్‌ వివాదం తెరపైకి వచ్చింది. మంత్రి వ్యవహారం అటు వైకాపా ఎమ్మెల్యేలకు, ఇటు జీవీఎంసీ అధికారులకు సైతం పరీక్షగా మారింది.

గాజువాక జోన్‌ 65 వార్డులో రూ. 19.75 లక్షలతో సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణానికి సిద్ధం చేసిన శిలాఫలకం.

వివాదం నేపథ్యంలో అతికించక ఇలా ఉంచేశారు. తరువాత  ఆ పనులనుఎమ్మెల్యే నాగిరెడ్డి  ప్రారంభించారు

ఉండాల్సిందేననడంతో: ఇటీవల జీవీఎంసీ సాధారణ నిధుల నుంచి వార్డుకు రూ.1.50 కోట్లు మంజూరు కావడంతో రోడ్లు, డ్రైనేజీ పనులు చేపట్టడానికి ఇంజినీరింగ్‌ అధికారులు టెండర్లు పిలిచారు. గుత్తేదారులు ముందుకు వచ్చిన చోట వాటిని ప్రారంభిస్తూ వస్తున్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలు 42 పనులకు సంబంధించి శిలాఫలకాలు ఆవిష్కరించారు. మరో 50 పనులకు వర్కు ఆర్డర్లు ఇచ్చి శిలాఫలకాలు ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్న సమయంలో మంత్రి అమర్‌నాథ్‌ అభ్యంతరం తెరపైకి వచ్చింది. ఇప్పటి వరకూ ఏర్పాటైన శిలాఫలకాల్లో ఎక్కడా మంత్రి పేరు పొందుపరచలేదు. ప్రొటోకాల్‌ ప్రకారం జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి విడదల రజని, రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి, విశాఖ పార్లమెంటు సభ్యుడు ఎంవీవీ సత్యనారాయణ, జీవీఎంసీ మేయరు గొలగాని హరి వెంకటకుమారి, డిప్యూటీ మేయర్లు జియ్యాని శ్రీధర్‌, కటుమూరి సతీష్‌, కార్పొరేటర్లు, జీవీఎంసీ కమిషనర్‌ లక్ష్మీశ, జిల్లా కలెక్టరు మల్లికార్జున పేర్లు శిలాఫలకాల్లో చేర్చారు. మంత్రి అమర్‌నాథ్‌ పొరుగు జిల్లా(అనకాపల్లి) నుంచి ఎన్నికైనందున శిలాఫలకంలో ఆయన పేరు వేయలేదంటూ జీవీఎంసీ అధికారులు వివరిస్తున్నారు. అయితే మంత్రి మాత్రం ఎట్టిపరిస్థితుల్లో తనపేరు ఉండాల్సిందేనని పట్టుపట్టి,  తాను ఎన్నికైన అనకాపల్లి నియోజకవర్గ కేంద్రం కూడా జీవీఎంసీ పరిధిలో ఉందంటూ జిల్లా కలెక్టరు, జీవీఎంసీ కమిషనర్‌తో మాట్లాడినట్లు తెలిసింది. దీంతో మరో మార్గం లేక  అమరావతిలోని పురపాలకశాఖ ఉన్నతాధికారుల దృష్టికి ఈ వ్యవహారాన్ని ఉన్నతాధికారులు తీసుకెళ్లినట్లు తెలిసింది.అక్కడి నుంచి అనుమతి వస్తే శిలాఫలకంలో పేరువేస్తామనడంతో ఎమ్మెల్యేలు నాగిరెడ్డి, అదీప్‌రాజ్‌లు శిలాఫలకాలు లేకుండానే కొన్ని చోట్ల కొబ్బరికాయలు కొట్టి సరిపెట్టుకుంటున్నారు.

గాజువాక కణితిరోడ్డులోరూ. 20 లక్షలతో సీసీ రోడ్డు పనులకు శిలాఫలకం దిమ్మెఏర్పాటు చేసినా...

ఫలకం ఏర్పాటు చేయలేదు. ఎమ్మెల్యే నాగిరెడ్డి కొబ్బరికాయ కొట్టి పనులు  ప్రారంభించారు(చిత్రంలో).

ఇలా మొదలైంది: విశాఖ నగరంలో ఇరవై వార్డులతో విస్తరించి ఉన్న జోన్‌-6(గాజువాక) పరిధిలో ఇద్దరు ఎమ్మెల్యేలు నాగిరెడ్డి(గాజువాక), అదీప్‌రాజ్‌(పెందుర్తి) ఉన్నారు. పొరుగునే ఉన్న జిల్లా కేంద్రం అనకాపల్లి శాసనసభా స్థానం నుంచి ఎమ్మెల్యేగా అమర్‌నాథ్‌ ఎన్నికై...ఇటీవల మంత్రి పదవి పొందారు. ఆయన నివాసం మాత్రం గాజువాక సమీపంలోని మిందిలో ఉంది. గత నెల 16న మింది నుంచి జింక్‌ గేటు వరకూ రూ.39.15లక్షలతో రెండు పనులకు ఎమ్మెల్యే నాగిరెడ్డి శంకుస్థాపన చేసి శిలాఫలకం ఆవిష్కరించారు. మంత్రి నివాసం ఉన్న చోట ఏర్పాటు చేసిన శిలాఫలకంపై ఆయన పేరు లేకపోవడాన్ని చిన్నతనంగా భావించిన అనుచరులు అమర్‌నాథ్‌పై ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది. దీంతో తనపేరు లేకుండా శిలాఫలకాలు వేయవద్దని మంత్రి చెప్పినట్లు సమాచారం. ఈ పరిస్థితితో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఎమ్మెల్యేలూ ఏమీ మాట్లాడలేకపోతున్నారు. కొన్ని చోట్ల శిలాఫలకాలు వేయకుండా కొబ్బరికాయలు కొట్టి పనులు ప్రారంభిస్తున్నారు. 

అప్పటి వరకూ ఇలాగే..

ఈ పరిస్థితిపై జోనల్‌ కమిషనర్‌ శ్రీధర్‌ను సంప్రదించగా... ‘శిలాఫలకాల ఆకృతులు ఎలా ఉండాలి...ఎవరి పేర్లు ఉండాలో జిల్లా కలెక్టరు కార్యాలయం నుంచి సూచిస్తారు. ఆ ప్రకారం నడుచుకుంటున్నాం. ప్రభుత్వం నుంచి తగిన ఆదేశాలు వచ్చాక మంత్రి పేరు ఉండాలో, లేదో స్పష్టత వస్తుంది. ఈలోపు ఎమ్మెల్యేలు కొబ్బరికాయలు కొట్టిన చోట్ల ఆయా పనులు ప్రారంభిస్తున్నాం’ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు