logo

వైకాపా కార్యాలయానికి 2 ఎకరాలు

జిల్లా వైకాపా కార్యాలయం నిర్మాణానికి అవసరమైన 2 ఎకరాల స్థలాన్ని కేటాయించే ప్రతిపాదనకు మేయర్‌ ముందస్తు అనుమతి ఇవ్వగా, దాన్ని పాలకవర్గం దృష్టికి తీసుకొస్తున్నారు. ఈనెల 26న జీవీఎంసీలో జరగనున్న పాలకవర్గం

Published : 20 May 2022 04:54 IST

 ఎన్‌ఏడీ పైవంతెనకు వైఎస్‌ఆర్‌ పేరు
 కౌన్సిల్‌ సమావేశంలో ఆమోదానికి కసరత్తు

కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: జిల్లా వైకాపా కార్యాలయం నిర్మాణానికి అవసరమైన 2 ఎకరాల స్థలాన్ని కేటాయించే ప్రతిపాదనకు మేయర్‌ ముందస్తు అనుమతి ఇవ్వగా, దాన్ని పాలకవర్గం దృష్టికి తీసుకొస్తున్నారు. ఈనెల 26న జీవీఎంసీలో జరగనున్న పాలకవర్గం సమావేశంలో 63 అంశాలపై చర్చించనున్నారు. అజెండా కాపీలను బుధవారం సభ్యులకు అందజేశారు.

అజెండాలో ఏముందంటే: ఎండాడలోని ప్రభుత్వ స్థలాన్ని వైకాపా కార్యాలయం నిర్మాణానికి కేటాయించనున్నారు. వీఎంఆర్‌డీఏ నిర్మించిన ఎన్‌ఏడీ పైవంతెనకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పేరు పెట్టాలన్న ప్రతిపాదనలపై మేయరుకు వీఎంఆర్‌డీఏ కమిషనర్‌ లేఖ రాయగా  ఆమోదించడానికి పాలకవర్గ సమావేశం అజెండాలో పొందుపరిచారు. జీవీఎంసీకి చెందిన మల్కాపురం, ఆరిలోవ డిస్పెన్సరీలను ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించడానికి అనువుగా అజెండాలో చేర్చారు. ఇందుకు రూ.2.10 కోట్లను కేటాయించ నున్నారు. జీవీఎంసీకి చెందిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలన్నీ జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు అప్పగించగా, రెండు ఎఫ్‌ఆర్‌యూ (ఫస్ట్‌ రిఫరల్‌ యూనిట)లు జీవీఎంసీ నిర్వహణలోనే ఉన్నాయి. ప్రభుత్వం కొత్తగా 42 యూపీహెచ్‌సీలను అందుబాటులోకి తీసుకొస్తుండటంతో ఎఫ్‌ఆర్‌యూలపై ఒత్తిడి తగ్గే అవకాశం ఉన్నా, గత సంవత్సరం నిర్వహణ ఛార్జీలను ఈ ఏడాది పొందుపరచడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్కూల్‌ అసిస్టెంట్లుగా విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు ఎనిమిది మందికి ప్రధానోపాధ్యాయులుగా ఉద్యోగోన్నతి అంశాన్నీ చేర్చారు. జీవీఎంసీకి చెందిన 10 పాఠశాలలకు సీబీఎస్‌ఈ గుర్తింపు తీసుకొచ్చేలా అవసరమైన రూ.5 లక్షల వ్యయం చేసేలా పాలకవర్గం దృష్టికి తీసుకురానున్నారు. వార్డు సచివాలయాలకు రూ.57.92 లక్షలతో ఏడాది పాటు ఇంటర్‌నెట్‌ సౌకర్యం కల్పించడానికి, రూ.9 కోట్ల వ్యయంతో ముడసర్లోవ పరిసరాల పరిరక్షణకు రక్షణ గోడ నిర్మాణాన్ని పొందుపరిచారు. ఎండాడలో కాపు భవనం, ఏపీఐఐసీ ద్వారా ఆసుపత్రి నిర్మాణానికి స్థల కేటాయింపు చేసిన ప్రతిపాదనలూ ఇందులో ఉన్నాయి. తెలుపు రేషన్‌కార్డుదారుల నుంచి చెత్త సేకరణ సేవా రుసుము రూ.60 వసూలకు ప్రతిపాదన చేశారు. గతంలో వివాదాస్పదంగా మారిన చెత్త తరలింపు కేంద్రాలలో సీసీఎస్‌ (క్లోజ్డ్‌ కాంపాక్షన్‌ సిస్టం) నిర్వహణ, వాహనాల మరమ్మతులూ ఇందులో ఉన్నాయి.

మరోసారి తిత్లీ పంచాయితీ: 2018లో తిత్లీ తుపాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలోని పలు ప్రాంతాలలో నీటి సరఫరా చేయడానికి రూ.72.65 లక్షలు వెచ్చించినట్లు మంచినీటి సరఫరా ఇంజినీర్లు ప్రతిపాదనలు సమర్పించారు. గతంలో ఈ అంశాన్ని సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. మళ్లీ ఈ సమావేశంలో  ఆ అంశాన్ని ఆమోదించేలా అధికార పక్ష కార్పొరేటర్లకు ఆదేశాలు వెళ్లినట్లు సమాచారం. దీని వెనుక ఏం జరిగిందనే అంశంపై చర్చనీయాంశమవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని