logo

భవన యజమానుల గగ్గోలు

మహా విశాఖ నగరపాలక సంస్థ(జీవీఎంసీ) పరిధిలోని పలు ప్రైవేటు భవనాల్లో  రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వార్డు సచివాలయాలకు ప్రతి నెలా అద్దె చెల్లించడం లేదు. బకాయిలు దాదాపు   రూ.3.33 కోట్లకు చేరాయి.చెల్లించాలని

Published : 20 May 2022 04:54 IST

సచివాలయాల అద్దె బకాయిలు రూ.3.33 కోట్లు

వార్డు సచివాలయ భవనం

కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: మహా విశాఖ నగరపాలక సంస్థ(జీవీఎంసీ) పరిధిలోని పలు ప్రైవేటు భవనాల్లో  రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వార్డు సచివాలయాలకు ప్రతి నెలా అద్దె చెల్లించడం లేదు. బకాయిలు దాదాపు   రూ.3.33 కోట్లకు చేరాయి.చెల్లించాలని భవనాల యజమానులు అనేక సార్లు జీవీఎంసీˆకి వినతులు సమర్పించగా...మూడు నెలల మొత్తం ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తోంది. గతంలో ఆయా భవనాలకు జీవీఎంసీˆ చెల్లించిన అద్దె నిధులు నేటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదల కాకపోవడంతో సాధారణ నిధుల నుంచే ఇవ్వాల్సిన పరిస్థితి ఎదురవుతోంది.
ఏడాదిగా ఇంతే: జీవీఎంసీ పరిధిలో 578 వార్డు సచివాలయాలున్నాయి. విశాఖ జిల్లాలో 545, అనకాపల్లి జిల్లాలో మరో 33 సచివాలయాలున్నాయి. మొత్తంగా 189 భవనాలను అద్దెకు తీసుకుని వాటిలో కొన్ని ఏర్పాటు చేశారు. మిగిలిన వాటికి జీవీఎంసీˆకి చెందిన వార్డు కార్యాలయాలు, సామాజిక భవనాలు, అంగన్‌వాడీ కేంద్రాలలో ఏర్పాటు చేశారు. అద్దె భవనాలకు మాత్రం చదరపు అడుగుకు అద్దె రూ.15లుగా ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కొక్క భవనానికి రూ.23వేలు నుంచి రూ.28 వేలు వరకు విస్తీర్ణం ప్రకారం చెల్లించాల్సి ఉంటుంది. గత ఏడాది మే నెల వరకు  అద్దె చెల్లించిన జీవీఎంసీˆ తరువాత వాటిపై దృష్టి కేంద్రీకరించలేదు. యజమానుల నుంచి విజ్ఞప్తులు రావడంతో కమిషనర్‌ లక్ష్మీశ మూడు నెలల అద్దె రూ. 83.25 లక్షలు చెల్లించడానికి దస్త్రాన్ని తయారు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. నెల రోజుల క్రితం వార్డు సచివాలయాల బాధ్యతలను చూస్తున్న జీవీఎంసీˆ కార్యదర్శి ఎంవీడీ ఫణిరాం జోనల్‌ కార్యాలయాలకు లేఖలు రాశారు. జోన్‌లో ఉన్న ప్రయివేటు భవనాల వివరాలు, వారికి చెల్లించాల్సిన అద్దె వివరాలు తెలియజేయాలని కోరారు. ఇప్పటి వరకు రెండు జోన్ల నుంచి వివరాలు అందలేదు. వాటన్నింటినీ క్రోడీకరించి మూడు నెలల బకాయిలు చెల్లించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ తరువాత మరో మూడు నెలలవి చెల్లించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.  
భారం జీవీఎంసీపైనే: వార్డు సచివాలయాల నిర్వహణ భారం జీవీఎంసీˆపై పడుతోంది. 2019 అక్టోబరులో ఏర్పాటు తరువాత ఏటా రూ.3.33 కోట్లు జీవీఎంసీˆ సొంత నిధులనే అద్దెకు చెల్లిస్తుంది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడంలేదు. భవనాలు అద్దెకిచ్చిన యజమానులు ఖాళీ చేయాలని తరచూ వార్డు కార్యదర్శులను కోరుతుండటం కనిపిస్తుంది. ప్రతి నెలా అద్దె చెల్లించాలంటున్నారు. 12 నెలల పాటు అద్దె ఇవ్వకపోతే భవనాల నిర్వహణ భారంగా మారుతుందని వివరిస్తున్నారు. తమ భవనాలను వాణిజ్య సముదాయాలకు అద్దెకు ఇస్తే ప్రతి నెలా అద్దె వచ్చేదన్న భావన యజమానుల్లో కనిపిస్తుంది. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలోనూ పలువురు ఈ అంశాన్ని నేతల వద్ద ప్రస్తావిస్తున్నారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని