logo

భద్రత.. ప్రశార్థకం!

హిందుస్థాన్‌ షిప్‌యార్డు దేశ రక్షణ ఉత్పత్తులు యూనిట్‌గా అవతరించినా...సరైన భద్రత ప్రమాణాలు లేకపోవడంతో తరచూ ప్రమాదాలకు నిలయంగా మారుతోంది. దేశ రక్షణ కోసం నౌకాదళానికి అవసరమయ్యే కీలక వెసల్స్‌

Updated : 20 May 2022 05:22 IST

షిప్‌యార్డులో తరచూ ప్రమాదాలు

హిందుస్థాన్‌ షిప్‌యార్డు దేశ రక్షణ ఉత్పత్తులు యూనిట్‌గా అవతరించినా...సరైన భద్రత ప్రమాణాలు లేకపోవడంతో తరచూ ప్రమాదాలకు నిలయంగా మారుతోంది. దేశ రక్షణ కోసం నౌకాదళానికి అవసరమయ్యే కీలక వెసల్స్‌ నిర్మాణంలో నిమగ్నమవుతూ.. దేశవ్యాప్తంగా ఇతర సంస్థలతో పోటీ పడి రూ.వేల కోట్ల ఆర్డర్లను చేజిక్కించుకుంటున్నా... భద్రత విషయంలో మాత్రం అంతంతమాత్రంగా ఉంటోందని కార్మిక వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

న్యూస్‌టుడే, సింధియా

అత్యంత ప్రతిష్ఠాత్మక నౌకా నిర్మాణ కేంద్రానికి భద్రత విభాగంలో ఒకే ఒక్క డీజీఎం పోస్టుతో నెట్టుకొస్తున్నారు. ఈ హోదా అధికారికి సహాయకులుగా భద్రత విభాగానికి ఏ మాత్రం సంబంధం లేని ఇతర విభాగాలకు చెందిన వ్యక్తులను నామమాత్రం నియమించుకుని విధులు కొనసాగిస్తున్నట్టు కార్మికుల ఆరోపణ.  బీ డీజీఎం కిందిస్థాయిలో పని చేస్తున్న ఓ వ్యక్తి నౌక డిజైన్‌ సెక్షన్‌లో ఉండేవారు. ఆయన నైపుణ్యానికి, భద్రతకు ఎలాంటి సంబంధం లేదని పలుమార్లు కార్మిక సంఘాలు యాజమాన్యానికి విన్నవించినా.. పట్టించుకునే వారు కరవయ్యారు. బీ భద్రత విభాగంలో పని చేస్తున్న మరో ఇద్దరిలో ఒకరు సొసైటీ మాజీ సిబ్బంది, మరొకరు ఎల్‌సీరీస్‌లో వెల్డర్‌గా పని చేసిన వ్యక్తి కావడం గమనార్హం.

ఓపెన్‌ డాక్‌లో వెల్డింగ్‌ పనులు జరుగుతున్న దృశ్యం

నియామకాల్లేవు... పరిశీలన లేదు..
సంస్థ నిబంధన ప్రకారం భద్రత విభాగంలో పూర్తిస్థాయి అధికారులు, సిబ్బంది ఉండాలి. నిత్యం యార్డులో కనీసం వందకుపైగా ప్రదేశాల్లో వెల్డింగ్‌, గ్యాస్‌ కట్టింగ్‌ వంటి పనులు జరుగుతుంటాయి. ఒక్కో పని ప్రదేశం వద్ద కచ్చితంగా అధికారుల పర్యవేక్షణలో సిబ్బంది నిశిత పరిశీలన, తనిఖీలు చేయాల్సి ఉంటుంది.
* ఏడాదిన్నర కిందట భారీ క్రేను ప్రమాదం జరిగి, పది మంది ప్రాణాలు పోయినా... యాజమాన్యం తీరులో ఏ మాత్రం మార్పు రాలేదని కార్మికులు విమర్శిస్తున్నారు.
* ప్రమాదాలు జరిగిన తర్వాత ప్రాథమిక, అంతర్గత విచారణ కమిటీల నియామకం, నామమాత్రపు నివేదికలు అందజేత.... తప్పితే భద్రత ప్రమాణాల పెంపునకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని కార్మికులు గగ్గోలు పెడుతున్నారు.
* భద్రత విభాగంలో ఆడిట్‌ కమిటీలు, కార్మిక సంఘాల గుర్తించిన లోపాలను సరి చేయడంలో యాజమాన్యం పూర్తిగా విఫలమవుతుండడంతో యార్డులో తరచూ ప్రమాదాలకు ఆస్కారం ఏర్పడుతుందని కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా సంస్థ యాజమాన్యం స్పందించి... భద్రత ప్రమాణాలు పెంచాలని వారు కోరుతున్నారు.
అగ్నిప్రమాదంపై ఆరా
సింధియా, న్యూస్‌టుడే : హిందుస్థాన్‌ షిప్‌యార్డులో ఈనెల 18న జరిగిన అగ్నిప్రమాదంపై గురువారం ఫ్యాక్టరీస్‌ ఆఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ సుధాకర్‌ ఆరా తీశారు.  తొలుత ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు అప్పారావుని పరామర్శించి ప్రమాదం జరిగిన తీరు, ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. అనంతరం యార్డులో యాజమాన్య ప్రతినిధులను కలిసి ప్రమాదం ఘటనపై వివరాలు సేకరించారు. ఆ తర్వాత అగ్నిప్రమాదం జరిగిన డైవింగ్‌ సపోర్టు వెసల్‌ ట్యాంక్‌ను పరిశీలించారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని