logo

భూములిచ్చిన కర్షకులకు.. స్థలాలెక్కడ!

విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో భూసమీరణ కింద తీసుకున్న భూములకు పరిహారంగా అభివృద్ధి చేసిన ప్లాట్ల కోసం వందలాది మంది ఎదురు చూస్తున్నారు.మూడేళ్ల కిందట రెవెన్యూ అధికారులు రైతుల భూములను స్వాధీనం చేసుకున్నారు. గాజువాక, పెదగంట్యాడ

Published : 22 May 2022 03:44 IST

‘సమీకరణ’ పరిహారానికి రైతుల ఎదురుచూపులు

ఈనాడు, విశాఖపట్నం: విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో భూసమీరణ కింద తీసుకున్న భూములకు పరిహారంగా అభివృద్ధి చేసిన ప్లాట్ల కోసం వందలాది మంది ఎదురు చూస్తున్నారు.మూడేళ్ల కిందట రెవెన్యూ అధికారులు రైతుల భూములను స్వాధీనం చేసుకున్నారు. గాజువాక, పెదగంట్యాడ మండలాల్లో తక్కువమంది రైతులు ఉండడంతో వారికి ఇటీవల ‘పరిహారం’గా ప్లాట్లు అందజేశారు. మిగిలిన మండలాల్లో ఇంకా ఇవ్వలేదు. జీవనాధారం కోల్పోయినా ఇచ్చే ప్లాట్లతో ఆర్థిక సమస్యలు తీరుతాయనుకుంటే... ఆ ప్రక్రియ పూర్తి కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నిరీక్షణవిశాఖ నగర పరిధిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు  శివారు మండలాల్లో భూసమీకరణకు ప్రభుత్వం గతంలో అనుమతి ఇచ్చింది. దీంతో కొన్ని ప్రాంతాల్లో ఫలసాయం వచ్చే భూములను సమీకరించారు. చాలా మంది రైతులు వాటినే ఆధారంగా చేసుకొని బతుకుతున్నారు. అసైన్డ్‌ భూములకు ఎకరాకు 900 గజాలు, ఆక్రమణదారులకు ఎకరాకు 450 గజాలు చొప్పున అభివృద్ధి చేసిన ప్లాట్లను పరిహారంగా ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. 2020లో గ్రామ సభలు నిర్వహించి ప్రజల నుంచి అంగీకారం తీసుకున్నారు. ఆ తరువాత కోర్టు కేసు కారణంగా పనులు నిలిచిపోయాయి. ఇటు పరిహారం అందకపోగా... అటు ఉపాధి కూడా పోయినట్లయింది. ఇటీవల ప్రభుత్వానికి అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ఒక సెంటు ప్లాట్లు ఏర్పాటు చేసి ఇళ్ల పట్టాల పంపిణీకు శ్రీకారం చుట్టారు. రైతులకు మాత్రం ‘పరిహారం’ అందలేదు. ఒక సెంటు ప్లాట్లకు సుమారు 4 వేల ఎకరాలకుపైగా అవసరమయింది. రైతులకు, ఈ పనులు చేసినందుకు వీఎంఆర్‌డీఏకు ఇచ్చేందుకు దాదాపు మరో రెండు వేల ఎకరాలు కావాలని సమాచారం.

అలా ఎలా ఇచ్చేస్తారంటూ..

తమకు జీవనాధారమైన భూములు తీసుకొని ఇస్తామని చెప్పిన పరిహారం అందకపోవడంపై పలు గ్రామాలకు చెందిన రైతులు ఆగ్రహంవ్యక్తం చేస్తున్నారు. ఒక సెంటు ప్లాట్లను పూర్తిస్థాయిలో తయారు చేసినప్పటికీ అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భూములు స్వాధీనం చేసుకున్న సమయంలో ఆయా గ్రామాల్లో స్థానికంగానే పరిహారం ఇస్తామని హామీ ఇచ్చిన అధికారులు పట్టించుకోవడం లేదంటున్నారు. భూసమీకరణ కింద తీసుకున్న భూమికి పరిహారంగా కేటాయించిన స్థలాన్ని మొదట తమకు చూపించకుండా లబ్ధిదారులకు పట్టాలు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు.

* సబ్బవరం మండలంలో డీపట్టా, ఆక్రమణదారులు కలిపి వంద ఎకరాలకుపైగా అభివృద్ధి చేసిన ప్లాట్లు పరిహారంగా ఇవ్వాలి. పద్మనాభం మండలంలో 260 మంది రైతులకు, ఆనందపురం మండలంలో 200 మంది రైతులకు ఇవ్వాలి. అలాగే అనకాపల్లి, పరవాడ, పెందుర్తిలో వందల మంది రైతుల ఈ ప్లాట్ల కోసం ఎదురు చూస్తున్నారు.

త్వరగా ఇవ్వాలి

ఏళ్లుగా ఉపాధి చూపిన తోటను తీసుకొని పరిహారంగా అభివృద్ధి చేసిన ప్లాటు ఇస్తామన్నారు. మా కుటుంబంలో పది మంది తోట మీదే ఆధారపడ్డాం. అదీ లేక... ప్లాటు ఇవ్వకపోవడంతో ఆధారం లేకుండా పోయింది. మా దగ్గర 5 ఎకరాలు తీసుకున్నారు. ఇటీవల ఇళ్ల పట్టాల పంపిణీ ప్రక్రియ ప్రారంభించినా మాకు స్థలాలు ఎక్కడ ఇస్తారనేది చెప్పలేదు. త్వరగా పరిహారంగా ఇవ్వాలి.

- చిన్ననాయుడు, పైడివాడ అగ్రహారం

ప్రణాళిక ప్రకారం..

రైతులకు పరిహారంగా అభివృద్ధి చేసిన ప్లాట్ల ఇచ్చేందుకు చర్యలు ప్రారంభించాం. వీటిని అందజేసే విషయంలో ఎటువంటి వివాదాలు తలెత్తకుండా ఉండేందుకు ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తున్నాం. జేసీ ఆధ్వర్యంలో ఒక షెడ్యూల్‌ తయారు చేసి తహశీల్దార్లకు ఇప్పటికే పంపారు. గడువులో ఆయా గ్రామాల్లో ప్రక్రియ పూర్తిచేస్తాం. 

-హుస్సేన్, ఆర్డీవో 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని