logo
Published : 22 May 2022 03:44 IST

కాలుష్య రహిత నగరంగా విశాఖ

పరిశ్రమల్లో తనిఖీలు చేయండి

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

రాష్ట్రంలో విశాఖ నగరం పెద్దది. ఇక్కడ ఏ రకమైన కాలుష్యం లేకుండా చూడాలి. 24 గంటలూ విద్యుత్తు సరఫరా ఉండాలి. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయాలి. ఆ దిశగా అధికారులు దృష్టిసారించాలి’ అని పర్యావరణ, విద్యుత్తు, గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. కలెక్టరేట్‌లో శనివారం అధికారులతో వివిధ శాఖలపై సమీక్షించారు.

ఈనాడు డిజిటల్, విశాఖపట్నం: ఎక్కువ కాలుష్యకారక పరిశ్రమలు విశాఖ నగరం చుట్టే ఉన్నాయని, వాటిని తరచూ తనిఖీ చేసి నిబంధనలు మీరిన వాటిపై చర్యలు తీసుకోవాలని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు. తాడి గ్రామాన్ని త్వరలో మరొక ప్రాంతానికి తరలించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఫ్యాక్టరీస్‌ అధికారులతో సమన్వయం ఉంటే మెరుగైన ఫలితాలు వస్తాయన్నారు. మాజీ మంత్రి ముత్తంశెట్టి స్పందిస్తూ పరిశ్రమలు సామాజిక బాధ్యతగా మొక్కల పెంపకం విరివిగా చేపట్టేలా చూడాలన్నారు. ఈ విషయంలో కొన్ని పరిశ్రమలు అస్సలు పట్టించుకోవడం లేదని దీనివల్లే కాలుష్యం పెరుగుతుందన్నారు. 

తుది దశలో.. భూగర్భ విద్యుత్తు పనులు: తుపాను ప్రభావిత ప్రాంతాలైన విశాఖపట్నం, శ్రీకాకుళం ప్రాంతాల్లో భూగర్భ విద్యుత్తు ప్రాజెక్టు పనులకు రూ.1,165 కోట్లు మంజూరైనట్లు ఈపీడీసీఎల్‌ సీఎండీ సంతోషరావు తెలిపారు. ఇప్పటికే 130 కిలోమీటర్ల పరిధిలో 80 శాతం పూర్తిచేసినట్లు తెలిపారు. గ్రిడ్‌ డైరెక్టర్‌ భాస్కరరావు మాట్లాడుతూ లోయర్‌ సీలేరు ప్రాజెక్టుకు అటవీశాఖ నుంచి అనుమతులు రావాల్సి ఉందని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు .అనంతరం అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సం సందర్భంగా రూపొందించిన  గోడపత్రికను మంత్రి పెద్దిరెడ్డి, తదితరులు ఆవిష్కరించారు.  పౌరసరఫరాలశాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, కలెక్టర్‌ మల్లికార్జున, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

జంతు ప్రదర్శనశాల తరలించేస్తే..

అటవీశాఖ ప్రగతిపై సమీక్షిస్తున్న క్రమంలో ‘జూ’ తరలించాలని, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించాలనే వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. 

అధికారులు: ‘జూ’కు వస్తున్న సందర్శకులతో ఏటా రూ.4 నుంచి 5 కోట్ల ఆదాయం వస్తుంది. అదే సమయంలో అన్ని ఖర్చులు కలిపి రూ.10 కోట్లు అవుతున్నాయి. ఆదాయం పెంచుకునేందుకు ఇతర మార్గాలను అన్వేషిస్తున్నాం. 

మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి: నేను రెండు సూచనలు చేస్తా. 1. జూ ఉన్న ప్రాంతం నగరానికి గుండెకాయలాంటిది.. అక్కడి నుంచి వేరేచోటకు తరలిస్తే మీకు అంతకంటే ఎక్కువ స్థలమే కలెక్టర్‌ ఇస్తారు. ఈ భూములు అభివృద్ది చేసుకోవచ్చు. 2. జూ తరలించకపోతే సింగపూర్‌లో మాదిరిగా ‘నైట్‌ సఫారీ’ దిశగా అభివృద్ధి చేస్తే మంచి ఆదాయం వస్తుంది. 

క్యూరేటర్‌ నందనీ సలారియా: ‘నైట్‌ సఫారీ’ అంటే మాకు తగినంత బడ్జెట్‌ ఇవ్వాలి. జూ తరలింపుపై మంత్రి పెద్దిరెడ్డిని విలేకర్లు ప్రశ్నించగా: ‘జూ’ను ఎక్కడికీ తరలించేది లేదు. మరింత అభివృద్ధి చేయడానికి తగినట్లు క్యూరేటర్‌ ప్రణాళికలు తయారుచేశారు. మిగతా రాష్ట్రాలు, దేశాల్లో అమలు చేసే అంశాలను పరిశీలించి ప్రపంచ స్థాయి జంతు ప్రదర్శనశాలగా మార్చడానికి చర్యలు తీసుకోవాలి. అవసరమైతే ప్రవేశ రుసుం పెంచడానికి అవకాశాలను పరిశీలించాలి. జూ అభివృద్ధికి గతంలో రూ.230 కోట్ల ప్రతిపాదనలకు మంజూరు లభించగా రూ.137 కోట్లకు ఉత్తర్వులు కూడా జారీచేసినట్లు అధికారులు చెప్పారు. 

Read latest Visakhapatnam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని