logo

సమస్యలు తీర్చకుంటే..సమ్మె తప్పదు

అత్యవసర సేవలు అందించే 108 వాహన సిబ్బంది సమ్మెకు సిద్ధమవుతున్నారు. ఏళ్లతరబడి సమస్యలను పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేయడంతో పాటు గడిచిన రెండు నెలలుగా జీతాలు కూడా

Published : 22 May 2022 03:44 IST

‘108’ ఉద్యోగుల సంఘం స్పష్టీకరణ

ఈనాడు డిజిటల్, విశాఖపట్నం: అత్యవసర సేవలు అందించే 108 వాహన సిబ్బంది సమ్మెకు సిద్ధమవుతున్నారు. ఏళ్లతరబడి సమస్యలను పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేయడంతో పాటు గడిచిన రెండు నెలలుగా జీతాలు కూడా ఇవ్వకపోవడంతో మడిపడుతున్నారు. కరోనా వంటి ఆపత్కాల సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించిన తమ శ్రమను గుర్తించకపోవడాన్ని తప్పుపడుతున్నారు. తక్షణం తమ సమస్యలను పరిష్కరించాలని లేకుంటే సమ్మెలోకి వెళ్లక తప్పదని రెండు రోజుల క్రితమే సంబంధిత అధికారులకు, నిర్వహణ సంస్థకు నోటీసులు కూడా ఇచ్చినట్లు ఏపీ 108 సర్వీసెస్‌ కాంట్రాక్ట్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు మళ్ల శ్రీనివాసరావు చెబుతున్నారు.

ఉమ్మడి జిల్లాలో ‘108’ సేవల వాహనాలు 52.. ‘104’ వాహనాలు 42 ఉన్నాయి. వీటిలో సుమారు 500 మందికి పైగా సిబ్బంది పనిచేస్తున్నారు. వీరికి అరబిందో ఎమర్జెన్సీ మెడికల్‌ సర్వీసెస్‌ (ఏఈఎంఎస్‌) సంస్థ జీతాలు ఇవ్వాల్సి ఉంటుంది. మార్చి, ఏప్రిల్‌ జీతాలు ఇంకా అందలేదు. దీంతో సిబ్బంది తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జీతాలు సకాలంలో అందజేయడంతో పాటు మరికొన్ని డిమాండ్లను ఏఈఎంఎస్, ప్రభుత్వం ముందు ఉంచారు. వాటి పరిష్కారంలో సానుకూలంగా వ్యవహరించాలని సమ్మె వరకు వెళ్లే అవసరం లేకుండా చూడాలని సంఘం ప్రతినిధులు కోరుతున్నారు.  నోటీసిచ్చిన 14వ రోజు నుంచి ఏ క్షణమైనా విధులకు గైర్హాజరవుతామని సిబ్బంది సమ్మె నోటీసులో పేర్కొన్నారు. ఈ విషయమై నిర్వహణ సంస్థ జిల్లా ప్రతినిధుల వద్ద ప్రస్తావించగా జీతాలు ఈ వారంలో జమవుతాయని చెబుతున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని