logo
Updated : 23 May 2022 04:30 IST

రైతులను వేధిస్తే సహించం

బెల్లం తయారీదారులకు అండగా ఉంటాం

మినీ మహానాడులో తెదేపా భరోసా

వేదికపై అయ్యన్న, బండారు, అనిత, పీలా, కుమార్‌ తదితరులు

అనకాపల్లి, న్యూస్‌టుడే: నల్లబెల్లం పేరుతో రైతులను వేధిస్తే సహించేది లేదని తెదేపా నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆదివారం అనకాపల్లిలో నియోజకవర్గ మినీ మహానాడు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ, జిల్లా తెదేపా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు మాట్లాడుతూ చెరకు రైతులకు తెదేపా అండగా ఉంటుందని తెలిపారు. తెదేపా ప్రభుత్వ హయాంలో నల్లబెల్లాన్ని మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుమన్నామని, ఇప్పుడు కూడా అదేవిధంగా చేయాలన్నారు. తుమ్మపాల కర్మాగారానికి రూ. 300 కోట్లు విలువైన ఆస్తులు ఉన్నాయని, వాటిని స్వాహా చేయడానికే మంత్రి అమర్‌ కర్మాగారాన్ని శాశ్వతంగా మూసివేయించారన్నారు. మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనకు చరమగీతం పాడాలన్నారు. వైకాపా బీసీలకు అన్యాయం చేస్తోందని విమర్శించారు. సభకు అధ్యక్షత వహించిన మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ మాట్లాడుతూ అమర్‌నాథ్‌ అనకాపల్లి, కశింకోట మండలాల్లో భూ కబ్జాలకు పాల్పడుతూ కబ్జాల మంత్రిగా తయారయ్యారని ఆరోపించారు. మూడేళ్లలో ఉద్యాన పరిశోధన కేంద్రాన్ని ఇక్కడ నుంచి తరలించారని, ఎన్టీఆర్‌ ఆసుపత్రిని నిర్వీర్యం చేశారని, తుమ్మపాల కర్మాగారాన్ని శాశ్వతంగా మూయించేశారని మండిపడ్డారు. తెదేపా పాలనలో తుమ్మపాల కర్మాగారాన్ని తెరిపించామని, నల్లబెల్లంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ ఉత్తర్వులు ఇచ్చామని, ఉద్యాన పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఎన్టీఆర్‌ ఆసుపత్రిని రాష్ట్రంలోనే ఉత్తమంగా తీర్చిదిద్దామని తెలిపారు. ఇంతవరకు ఇక్కడ ఏ నేత కుల రాజకీయాలు చేయలేదన్నారు. అమర్‌ మాత్రం కులాల మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను కార్యకర్తలు ప్రజలకు వివరించాలన్నారు. విశాఖ జిల్లా తెదేపా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారన్నారు. సంక్షేమం పేరుతో రూపాయి ఇచ్చి పన్నుల రూపంలో పది రూపాయలు దోచేస్తున్నారని ఆరోపించారు. సభలో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు అనిత, మాజీ ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, మాజీ ఎమ్మెల్యే కె.ఎస్‌.ఎన్‌.ఎస్‌.రాజు, మాడుగుల నియోజకవర్గం ఇన్‌ఛార్జి పి.వి.జె.కుమార్‌, కార్పొరేటర్‌ మాదంశెట్టి చినతల్లి, పార్టీ నాయకులు కాయల మురళి, డాక్టరు కె.కె.వి.నారాయణరావు, బొలిశెట్టి శ్రీను, కోట్ని బాలాజీ, మళ్ల సురేంద్ర, బి.ఎస్‌.ఎం.కె.జోగినాయుడు, కొణతాల శ్రీనివాసరావు, ఆడారి మంజు, పచ్చికూరి రాము, గుడాల సత్యనారాయణ ముదిరాజ్‌, ధనాల విష్ణుచౌదరి పాల్గొన్నారు.

Read latest Visakhapatnam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని