logo

పడకేసిన పర్యాటక బోట్లు

ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) పూర్తిస్థాయిలో బోట్లను నిర్వహించలేకపోవడంతో భారీగా ఆదాయం కోల్పోతోంది. వేసవి సెలవులు కావడంతో అధిక సంఖ్యలో పర్యాటకులు సముద్రంలో జల విహారం

Published : 23 May 2022 05:38 IST

మరమ్మతుకు గురైనా పట్టించుకోని వైనం

ఈనాడు, విశాఖపట్నం: ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) పూర్తిస్థాయిలో బోట్లను నిర్వహించలేకపోవడంతో భారీగా ఆదాయం కోల్పోతోంది. వేసవి సెలవులు కావడంతో అధిక సంఖ్యలో పర్యాటకులు సముద్రంలో జల విహారం చేసేందుకు ఆసక్తి చూపుతారు. అటువంటిది డిమాండున్న సమయంలో నడపక పోవడంతో ఆదాయానికి గండి పడుతోంది. దీన్ని ప్రైవేటు నిర్వాహకులు సొమ్ము చేసుకుంటున్నారు. కావాలని కొందరికి లబ్ధి చేకూర్చాలనే పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.

హార్బరు వద్ద నిలిచిపోయిన బోటు

ఏపీటీడీసీ విశాఖలో రుషికొండ, హార్బరు వద్ద జల విహార సందర్శన చేపడుతోంది. పర్యాటకుల్ని కాసేపు సముద్రంలో విహరింపజేస్తారు. దీనికి టిక్కెట్‌ ఒక్కరికి రూ.200 వసూలు చేస్తారు. ప్రస్తుతానికి రుషికొండ వద్ద రెండు స్పీడు బోట్లు, రెండు జెట్‌స్కీలను నడుపుతుండగా వీటిల్లో ఒక జెట్‌స్కీ పూర్తిగా మరమ్మతులకు చేరుకుంది.  మరొకటి విడి భాగాలు దెబ్బతిన్నందున పనిచేయడం లేదు. దీన్ని బాగుచేస్తే తిరిగి పనిచేస్తుంది. అలాగే హార్బరు వద్ద 8 సీట్లతో నడిచే ఒక బోటు తిప్పుతుండగా వారం రోజులుగా అది నిలిచిపోయింది. దాని ఇంజిన్‌ పాడవడంతో ఆగిపోయింది. విడి భాగాలు లభ్యమవ్వకపోవడంతో బాగు చేయలేకపోతున్నారు. దీంతో హార్బరు వద్దకు వచ్చే పర్యాటకులు బోటు షికారు లేకపోవడంపై తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారు. గతంలో 50 మందితో తిప్పేలా ఒక షిప్‌ను 2017కు ముందు నడిపేవారు. అది మరమ్మతుకు చేరుకోవడంతో మూలనపడింది. దాని స్థానంలో కొత్తది కొనుగోలు చేయాలని గత కొంతకాలంగా ప్రయత్నిస్తున్నప్పటికీ ఫలించడం లేదు. 

నిరుపయోగంగా ఒక బోటు!

గతంలో పార్వతీపురం మన్యం జిల్లా తోటపల్లి జలాశయంలో నడిపిన బోటును విశాఖలో తిప్పేందుకు ఇక్కడకు తీసుకొచ్చారు. అది భారీగా ఉండడంతో సముద్రంలో దాన్ని నిర్వహించడం కష్టమవుతోంది. సముద్రం లోపలి నుంచి తీరానికి తీసుకురావడం, లోపలికి తీసుకువెళ్లడం కష్టంగా ఉంటోంది. దీంతో దీన్ని నడపడం మానేశారు. కనీసం దీని ఇంజిన్‌ భాగాన్ని అయినా హార్బర్‌లో పాడైన బోటుకైనా వినియోగించడం లేదు.

దానికి అనుమతి ఉందా?

రుషికొండ బీచ్‌లో కొన్ని పడవలను అనుమతి లేకుండా నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వాస్తవంగా టెండరు ప్రక్రియ ద్వారా నిర్వాహకులను ఎంపిక చేయాలి. అలాకాకుండా ఓ అధికారి ఇచ్చిన లేఖ ఆధారంగా బోటు నడపడంపై విమర్శలు వస్తున్నాయి. జల విహారానికి సంబంధించి ప్రైవేటు నిర్వాహకుల నుంచి సరైన లెక్కాపత్రం ఉండడం లేదన్న ఆరోపణలున్నాయి. జీఎస్టీ చెల్లింపులు సక్రమంగా చేయకుండా పన్ను ఎగవేస్తున్నారంటున్నారు. ముఖ్యంగా అధిక వసూళ్లకు పాల్పడుతున్నారని కొందరు పర్యాటకులు ఆరోపిస్తున్నారు. 

* హార్బర్‌ వద్ద మరమ్మతుకు గురైన బోటు స్థానంలో కొత్తది ఏర్పాటు చేస్తామని అది పర్యాటకానికి వీలుకాదని సంబంధిత శాఖ అధికారులు పేర్కొంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని