logo

లారీలు ఇద్దర్ని చిదిమేశాయి..

లారీ ప్రమాదాలు రెండు నిండు ప్రాణాల్ని బలిగొన్నాయి. రెండు వేర్వేరు సంఘటనలకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి..

Published : 23 May 2022 05:38 IST

పెదవాల్తేరు, పీఎంపాలెం - న్యూస్‌టుడే: లారీ ప్రమాదాలు రెండు నిండు ప్రాణాల్ని బలిగొన్నాయి. రెండు వేర్వేరు సంఘటనలకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి..

 నడచుకుని వెళ్తున్న వ్యక్తి పైనుంచి..

ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో సి.బి.ఐ. డౌన్‌ కనకదుర్గ ఆర్చి నుంచి చినవాల్తేరు వైపు వెళ్తున్న ఓ లారీకి బ్రేకులు పనిచేయక ఆ దారిలో నడుచుకుంటూ వెళ్తున్న పీతలతోటకు చెందిన అత్తోట రామారావు(28)ను వెనుక నుంచి ఢీకొని అతని మీద నుంచి వెళ్లిపోయింది. దీంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. మరో వ్యక్తిని స్వల్పంగా ఢీకొంది. ఇంకో వ్యక్తి తప్పించుకున్నాడు. లారీని అదుపు చేసే క్రమంలో డ్రైవర్‌ సమీపంలోనే ఉన్న ఓ సెలూన్‌షాపువైపు పోనిచ్చాడు. అక్కడ చిన్న గోడను ఢీకొని ఆగిపోయింది. గాయపడిన వ్యక్తిని కేజీహెచ్‌కు తరలించారు. మృతుడు భవానీ మాలలో ఉన్నాడు. భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తూ తల్లితో కలిసి ఉంటున్నాడు. సమాచారం అందుకున్న మూడో పట్టణ సి.ఐ. కోరాడ రామారావు, ఎస్సై ధర్మేందర్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మట్టిని తీసుకురావడానికి వెళ్తున్న ఈ లారీలను పగటిపూట ఈ రోడ్లపై తిరిగేందుకు అనుమతి ఎవరిచ్చారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.


ద్విచక్ర వాహనంపై వెళుతుండగా..: వీఎంఆర్డీఏ అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగినిగా పని చేస్తున్న వివాహిత మారికవలస వద్ద లారీ ఢీకొన్న ఘటనలో మృతి చెందింది. సీఐ ఎ.రవికుమార్‌ తెలిపిన వివరాలిలా.. విజయనగరానికి చెందిన జి.అర్జునరావు సబ్బవరంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఒప్పంద ఉద్యోగిగా పని చేస్తున్నారు. నగరంలోని వుడా పార్కులోని టికెట్‌ కౌంటర్‌లో వీఎంఆర్డీఏ అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగినిగా పని చేస్తున్న అతని భార్య జి.స్వర్ణ(30), ఇద్దరు పిల్లలతో కలిసి శనివారం ద్విచక్రవాహనంపై విజయనగరం వెళ్లారు. ఆదివారం తిరిగి వస్తుండగా మారికవలస వద్ద వీరి వాహనాన్ని లారీ ఢీకొంది. భార్య అక్కడికక్కడే మృతి చెందగా అర్జునరావు, పిల్లలు స్వల్ప గాయాలతో బయట పడ్డారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని