logo

పోక్సో కేసులో తల్లీ, ఇద్దరు కుమారులకు పదేళ్ల జైలు

మైనరు బాలికను అపహరించి, వివాహం జరిపించి, బలవంతంగా కాపురం చేయించిన నేరం రుజువు కావడంతో ఇద్దరు కుమారుల సహా తల్లికి, ఒక్కొక్కరికి పదేళ్ల చొప్పున కఠిన కారాగార శిక్షతోపాటు ఒక్కొక్కరు రూ.20వేల చొప్పున

Published : 24 May 2022 05:37 IST

విశాఖ లీగల్‌, గాజువాక, న్యూస్‌టుడే: మైనరు బాలికను అపహరించి, వివాహం జరిపించి, బలవంతంగా కాపురం చేయించిన నేరం రుజువు కావడంతో ఇద్దరు కుమారుల సహా తల్లికి, ఒక్కొక్కరికి పదేళ్ల చొప్పున కఠిన కారాగార శిక్షతోపాటు ఒక్కొక్కరు రూ.20వేల చొప్పున జరిమానా చెల్లించాలని పోక్సో కేసుల ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి తీర్పునిచ్చారు. పోక్సో కేసుల ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కరణం కృష్ణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గాజువాక నియోజకవర్గం పెదగంట్యాడ ప్రాంతానికి చెందిన ఓ మహిళ 2015 ఏప్రిల్‌ 30న విజయనగరం జిల్లా చీపురుపల్లిలో తమ బంధువుల వివాహానికి మైనరు కుమార్తె(15)తో హాజరైంది. అదే వివాహానికి విజయనగరం జిల్లా జియ్యమ్మవలస, గంగమ్మపేట గ్రామానికి చెందిన పుల్లఖండం గిరిజ, ఆమె కుమారులు సతీష్‌కుమార్‌, సంతోష్‌కుమార్‌ కూడా వచ్చారు. సతీష్‌కుమార్‌ వృత్తిరీత్యా పురోహితుడు. వివాహంలో బాలికపై కన్నువేశాడు. ఆమెతో పరిచయం పెంచుకుని ఛాటింగ్‌ చేసేవాడు. 25రోజుల స్నేహంలో పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. 2015 మే 25న బాలికకు ఫోను చేసి, ఇంటి నుంచి బయటకు పిలిచి, కారులో విజయనగరం డాల్ఫిన్‌ హైట్స్‌లో గల సోదరుడు సంతోష్‌కుమార్‌ ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడే ఉన్న తల్లి గిరిజ, సోదరుడు సంతోష్‌కుమార్‌ బాలికకు సతీష్‌కుమార్‌తో వివాహం జరిపించి, కాపురం కూడా చేయించారు. కుమార్తె కనిపించకపోవడంతో తల్లి న్యూపోర్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల విచారణలో గిరిజ, సతీష్‌కుమార్‌, సంతోష్‌కుమార్‌ బాలికను తీసుకెళ్లినట్లు గుర్తించారు. పోలీసులు తమ కోసం వస్తున్నారని తెలుసుకున్న నిందితులు బాలికను గాజువాక దరి దయాల్‌నగర్‌ సమీపంలో విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఆమె ఇంటికి చేరుకుని తల్లికి జరిగిన విషయం తెలిపింది. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేశారు. అనంతరం భారతీయ శిక్షా స్మృతిలోని పలు సెక్షన్లతోపాటు, పోక్సో చట్టం కింద కేసును నమోదు చేసి నిందితులను న్యాయస్థానంలో హాజరు పరిచారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి నిందితులకు పైవిధంగా శిక్ష విధించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని