logo

వధువు మృతి అనుమానాస్పదం కాదు.. ఆత్మహత్యే!

పెళ్లి పీటలపై నవవధువు కుప్పకూలి ఆ తర్వాత మృతి చెందిన ఘటన ఇటీవల చోటుచేసుకుంది. ఈ కేసును పీఎంపాలెం పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. సీఐ ఎ.రవికుమార్‌ సోమవారం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

Published : 24 May 2022 05:37 IST

ఫోన్‌కాల్‌ డేటా ఆధారంగా ఛేదించిన పోలీసులు

పీఎంపాలెం, న్యూస్‌టుడే: పెళ్లి పీటలపై నవవధువు కుప్పకూలి ఆ తర్వాత మృతి చెందిన ఘటన ఇటీవల చోటుచేసుకుంది. ఈ కేసును పీఎంపాలెం పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. సీఐ ఎ.రవికుమార్‌ సోమవారం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 11వ తేదీన మధురవాడలో వివాహం జరుగుతున్న సమయంలో వరుడు జీలకర్ర, బెల్లం పెట్టే సందర్భంలో అకస్మాత్తుగా వధువు స్పృహ తప్పి పడిపోయింది. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఆమె విష పదార్థం తిని ఆత్మహత్యకు పాల్పడిందనే అనుమానాలు తలెత్తగా.. చికిత్స అందించిన వైద్యులు దాన్ని ధ్రువీకరించారు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి.. పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేశారు. మృతి చెందిన వధువు ఫోన్‌ కాల్‌ డేటా, వాట్సాప్‌ చాటింగ్‌ తదితర ఆధారాలను సేకరించారు. పెళ్లికి ముందే మరో వ్యక్తితో ఆమెకు ప్రేమ వ్యవహారం ఉన్నట్లు గుర్తించారు. ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారనే బాధతోనే బలవన్మరణానికి పాల్పడినట్లు ప్రాథమికంగా తేల్చారు. ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో సంబంధిత డేటాను పోలీసులు లోతుగా పరిశీలించి వాస్తవాలు బయటకు తీశారు. పెళ్లికి ముందు వరకు ఆమె ప్రియుడితో చాటింగ్‌ చేయడాన్ని గుర్తించి ఆ దిశగా విచారణ జరిపారు. ఈ నేపథ్యంలోనే పెద్దలు కుదిర్చిన పెళ్లి ఇష్టం లేక ఆత్మహత్యకు పాల్పడినట్లు తేలిందని సీఐ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని