logo

పెట్రోలు సీసాతో స్పందన కొచ్చిన మహిళ

విశాఖ కలెక్టరేట్‌ కార్యాలయంలో సోమవారం జరిగిన స్పందన కార్యక్రమానికి ఓ మహిళ పెట్రోలు సీసాతో రావడం కలకలం సృష్టించింది. తనకు న్యాయం చేయకపోతే పెట్రోలు పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించింది.

Published : 24 May 2022 05:37 IST

మృతి చెందిన కుమారుడి ఫొటోతో మల్ల దేవి

విశాఖపట్నం (వన్‌టౌన్‌), న్యూస్‌టుడే: విశాఖ కలెక్టరేట్‌ కార్యాలయంలో సోమవారం జరిగిన స్పందన కార్యక్రమానికి ఓ మహిళ పెట్రోలు సీసాతో రావడం కలకలం సృష్టించింది. తనకు న్యాయం చేయకపోతే పెట్రోలు పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించింది. పోలీసులు వెంటనే స్పందించి ఆమె నుంచి పెట్రోలు సీసాను స్వాధీనం చేసుకుని, పోలీసు అధికారి బాబూజీతో మాట్లాడించారు. విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటానని హామీ ఇవ్వడంతో ఆమె శాంతించారు. విశాఖ నగరం బుచ్చిరాజుపాలేనికి చెందిన బాధితురాలు మల్ల దేవి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ‘2019లో నా కుమారుడు ఎం.శివసత్యనారాయణ అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా, ఎయిర్‌పోర్టు పోలీసులకు అప్పట్లో ఫిర్యాదు చేశా. నిందితులపై ఇంత వరకు చర్యలు తీసుకోలేదు. ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతున్నారు. అందులో వాస్తవం లేదు. నా కుమారుడు మౌనిక అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోగా, కొద్ది రోజుల తర్వాత ఆమె మృతి చెందింది. దీనికి బాధ్యుడ్ని చేస్తూ నా కుమారుడ్ని ఎయిర్‌పోర్టు పోలీసులు తీసుకెళ్లారు. బంధువులైన అశోక్‌, సురేష్‌ అనే వ్యక్తులు జామీనుపై విడుదల చేయించి తమ ఇంట్లో ఉంచుకున్నారు. తర్వాత రోజే కుమారుడు మృతి చెందాడు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నాకు న్యాయం చేయాలి. లేకుంటే ఆత్మహత్య చేసుకుంటాన’ని మల్ల దేవి తెలిపారు. కుమారుడి ఫొటోతో ఆమె కొద్దిసేపు కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలిపారు. పోలీసులు ఇచ్చిన హామీతో వెనుదిరిగారు.


‘వీఎంఆర్‌డీఏ’లో 13 ఫిర్యాదులు


స్పందనలో పాల్గొన్న కలెక్టర్‌ మల్లికార్జున, వీఎంఆర్‌డీఏ ఛైర్‌పర్సన్‌ విజయనిర్మల

పెదవాల్తేరు, న్యూస్‌టుడే : వి.ఎం.ఆర్‌.డి.ఎ. భవనంలో సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించారు. వి.ఎం.ఆర్‌.డి.ఎ. ఛైర్‌పర్సన్‌ అక్కరమాని విజయనిర్మల, ఇన్‌ఛార్జి కమిషనర్‌ పాల్గొని ఫిర్యాదులు స్వీకరించారు. వివిధ సమస్యలకు సంబంధించి 13 వినతులు వచ్చినట్లు తెలిపారు. సెక్రటరీ రఘునాథరెడ్డి, జేసీ రవీంద్ర, సిబ్బంది పాల్గొన్నారు.

* కలెక్టరేట్‌లో నిర్వహించిన స్పందనలో...ఎన్‌ఏడీ సమీపంలోని శాంతిపురంలో కమర్షియల్‌ ఫ్లాట్‌ ఇస్తానని ఓ బిల్డరు తన నుంచి రూ.1.05కోట్లు తీసుకొని రెసిడెన్షియల్‌ ఫ్లాటు అప్పగించారని ఓ మహిళ ఫిర్యాదు చేశారు. ఆ బిల్డర్‌కు స్థానిక ప్రజా ప్రజాప్రతినిధి సహకరిస్తున్నారని, తనకు న్యాయం చేయాలని కలెక్టర్‌మల్లికార్జునను కోరారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని