logo

ఆ ‘స్టే’షన్లలో అంతే!!

విశాఖ పోలీసు కమిషనర్‌ సీహెచ్‌.శ్రీకాంత్‌ నగరంలోని కొన్ని పోలీసు స్టేషన్లను ఇటీవల తనిఖీ చేశారు. అలా వెళ్లిన పలు స్టేషన్లో కొన్ని పాత కేసులు పెండింగులో ఉన్నట్లు గుర్తించారు. కారణాలేమిటని ఆరా తీయగా... ఆసక్తికర అంశం గుర్తించారు.

Updated : 24 May 2022 05:49 IST

20 ఏళ్లుగా పురోగతి లేని కేసులెన్నో

-ఈనాడు, విశాఖపట్నం

నగర పరిధిలో కొన్ని కీలక కేసుల్లో దర్యాప్తును పోలీసులు పక్కన పడేస్తున్నారు. దాదాపు 20 ఏళ్లుగా ఇలా ఉంచేసిన కేసులూ ఉండటం గమనార్హం.

విశాఖ పోలీసు కమిషనర్‌ సీహెచ్‌.శ్రీకాంత్‌ నగరంలోని కొన్ని పోలీసు స్టేషన్లను ఇటీవల తనిఖీ చేశారు. అలా వెళ్లిన పలు స్టేషన్లో కొన్ని పాత కేసులు పెండింగులో ఉన్నట్లు గుర్తించారు. కారణాలేమిటని ఆరా తీయగా... ఆసక్తికర అంశం గుర్తించారు. న్యాయస్థానంలో ‘స్టే’ ఉన్నట్లు పోలీసులు తమ కంప్యూటర్లలో నమోదు చేసిన విషయం పరిశీలించారు. అలా ‘స్టే’ సాకుగా చూపి స్టేషన్‌ స్థాయిలో ఏ ఒక్క అధికారి కూడా ఆ కేసుల దర్యాప్తులు/విచారణల వైపు దృష్టిసారించకపోవడం గమనార్హం. మొత్తంగా 200 వరకు అలాంటి కేసులున్నట్లు అంచనా.

వదిలేశారలా: న్యాయస్థానం ఆదేశాలు ఏమైనా ఉంటే వాటి ప్రకారం పోలీసు అధికారులు తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశంపై ఒక ప్రణాళిక రచించుకోవాలి. బాధితులకు న్యాయం దక్కేలా అన్ని రకాల చర్యలను చేపట్టాలి. అవసరమైతే పోలీసు న్యాయ సలహాదారులను సంప్రదించాలి. అందుకోసం ఒక న్యాయ నిపుణుడిని కూడా కమిషనరేట్‌ పరిధిలో అందుబాటులో ఉంచారు. పలువురు అధికారులు వారికి దృష్టికీ ఈ కేసుల అంశాలు తీసుకువెళ్లలేదని గుర్తించారు.

ఏళ్లుగా అదే కారణం: ఏదైనా కేసులో న్యాయస్థానం నుంచి ‘యథాతథ స్థితి(స్టే)’ అమలు చేయాలన్న స్టేషన్‌ స్థాయి అధికారులకు ఆదేశాలు వస్తే.... ఆ ఉత్తర్వులున్నాయంటూ ‘కట్‌.. కాపీ... పేస్ట్‌’ తరహాలో ప్రతిసారి అవే కారణాలను చూపుతూ ఏళ్ల తరబడి కాలం వెళ్లదీస్తున్నారు. సాధారణంగా న్యాయస్థానం ఆదేశాలున్నాయంటే పోలీసు ఉన్నతాధికారులు కూడా వాటి జోలికి వెళ్లరన్న అభిప్రాయంతో పలువురు ఎస్‌.హెచ్‌.ఒ.లు ఉన్నతాధికారులకు కూడా పూర్తిస్థాయి సమాచారం చెప్పడం లేదని తెలుస్తోంది. నిర్ణీతకాలం స్టే కొనసాగించాలని పేర్కొన్నప్పటికీ న్యాయస్థానికి తగిన కారణాలు చూపించి ‘స్టే’ తొలగింపు ఉత్తర్వులు తెచ్చుకోవచ్ఛు ఇందుకుగాను తగిన ఆధారాలు సేకరించి, సమగ్ర నివేదికను రూపొందించి న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి చాలా మంది ఆసక్తి చూపడం లేదని తేలింది. ఫలితంగా పలు కేసులు, విచారణలు పూర్తికాని దుస్థితి నెలకొంది.


నెలరోజులు సమయం ఇచ్చాం...

కమిషనరేట్‌ పరిధిలో 20 ఏళ్ల నుంచి కొన్ని కేసులు పెండింగులో ఉన్న విషయం వాస్తవమే. ఆ పరిస్థితికి కారణాలు, తీసుకోవాల్సిన చర్యలపై నెలరోజుల్లో నివేదిక ఇవ్వాలని చెప్పాం. 2015 సంవత్సరానికి ముందు నాటి అన్ని కేసుల దర్యాప్తులు, విచారణలు వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలిచ్చాం. పర్యవేక్షక అధికారులు కూడా ఆ విషయాలను పట్టించుకోలేదని గుర్తించాం. ప్రతి ఒక్క అధికారి ‘పోలీసు మాన్యువల్‌’ ప్రకారం బాధ్యతలను నిర్వర్తించాల్సిందే.

-సీహెచ్‌.శ్రీకాంత్‌, సీపీ, విశాఖపట్నం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని