logo

Crime News: చీటీల వ్యాపారంలో నష్టపోయి..యూట్యూబ్‌లో దొంగతనాలు నేర్చి..

కుటుంబం చీటీల వ్యాపారంలో ఆర్థికంగా నష్టపోవడంతో దాన్ని పూడ్చుకోడానికి చోరీల బాట ఎంచుకున్నాడో వ్యక్తి. యూట్యూబ్‌లో చూసి గొలుసు దొంగతనాలు ఎలా చేయాలో నేర్చుకున్నాడు. చివరికి దొంగతనం చేస్తూనే స్థానికులకు

Updated : 25 May 2022 10:37 IST

స్వాధీనం చేసుకున్న గొలుసులు, కత్తి, బొమ్మ తుపాకీ వివరాలు వెల్లడిస్తున్న  పోలీసులు

ఎం.వి.పి.కాలనీ, న్యూస్‌టుడే : కుటుంబం చీటీల వ్యాపారంలో ఆర్థికంగా నష్టపోవడంతో దాన్ని పూడ్చుకోడానికి చోరీల బాట ఎంచుకున్నాడో వ్యక్తి. యూట్యూబ్‌లో చూసి గొలుసు దొంగతనాలు ఎలా చేయాలో నేర్చుకున్నాడు. చివరికి దొంగతనం చేస్తూనే స్థానికులకు చిక్కాడు. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.  విశాఖలోని నాతయ్యపాలెంకు చెందిన ఆర్‌.ఆదినారాయణ అలియాస్‌ అశోక్‌(30) పది వరకు చదివాడు. ఆటోనగర్‌లో వెల్డింగ్‌ పనులు చేస్తుంటాడు. అతని తల్లి చీటీల వ్యాపారం చేసి ఆర్థికంగా నష్టపోయింది. దీంతో ఆ నష్టాన్ని పూడ్చుకోవాలనే ఉద్దేశంతో సులభంగా డబ్బులు సంపాదించాలనుకున్నాడు. యూట్యూబ్‌లో చూసి గొలుసు దొంగతనాలు ఎలా చేయాలో నేర్చుకున్నాడు. ఆన్‌లైన్‌లో కత్తి, తుపాకీ నమూనాలో ఉన్న లైటర్‌ను కొనుగోలు చేశాడు.  స్టీల్‌ప్లాంట్‌ పరిసరాల్లో ఇటీవల రెండు గొలుసు దొంగతనాలకు పాల్పడ్డాడు. సోమవారం రాత్రి స్టీల్‌ప్లాంట్‌ సెక్టారు-5లో ఓ మహిళ శివాలయానికి వెళ్లి వస్తుండగా  వెనుక నుంచి వచ్చి కత్తి, బొమ్మ తుపాకి చూపించి మెడలో ఉన్న పుస్తెల తాడు ఇవ్వమని బెదిరించాడు. ఆమె బెదరకుండా గట్టిగా అరవటంతో కత్తితో చేతిపై గాయపరిచాడు. మెడలోని గొలుసు తెంచేశాడు. దీనిని స్టీల్‌ప్లాంట్‌ అధికారి అడ్డుకునే ప్రయత్నం చేయగా, అతనిపై కూడా కత్తితో దాడిచేశాడు. చుట్టుపక్కల వారంతా వచ్చి నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఆదినారాయణ గొలుసు దొంగతనానికి వెళ్లే సమయంలో తన వాహనాన్ని దూరంగా ఉంచి, అందరితో పాటు నడుస్తున్నట్లుగా నటిస్తూ, నిర్మానుష్య ప్రాంతానికి వచ్చిన తర్వాత ముందు వెళ్తున్న మహిళను బెదిరించి మెడలోని గొలుసు తెంపు కెళ్తుంటాడు. ఎట్టకేలకు స్థానికులకు చిక్కడంతో అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని