logo
Updated : 26 May 2022 06:50 IST

విశాఖ ‘జూ’కు..ఇటలీ కళ

పరస్పర ఒప్పందంతో ప్రయోజనాలపై ఆశలు

జంతువుల సంక్షేమం, ఆరోగ్య పరిరక్షణ, సమాచార, సాంకేతిక పరిజ్ఞాన అంశాల్లో అంతర్జాతీయ ప్రమాణాల అమలుకు విశాఖ ఇందిరాగాంధీ జంతుప్రదర్శనశాల మరో అడుగు ముందుకేసింది.

ఈనాడు, విశాఖపట్నం: ఇటలీలోని ‘పార్కో నేచుర వివా’ జంతు ప్రదర్శనశాలతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్న నేపథ్యంలో ఈ రెండు ‘జూ’ల అధికారులు ఆన్‌లైన్‌లో నిర్వహించిన  కార్యక్రమాల్లో సంయుక్తంగా పాల్గొన్నారు. విశాఖ ప్రత్యేకతలపై క్యూరేటర్‌ నందనీ సలారియా వారికి వివరించారు. జంతువుల మార్పిడికి, నిపుణులు పరస్పర పరిశీలనలకు ఒప్పందంతో అవకాశం కలుగుతోంది.

‘రాబందుల’ సంరక్షణ కేంద్రం: ఎరుపురంగు తల కలిగిన రాబందులు అంతరించిపోతున్నాయి. మన దేశంలో వీటి సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఇటలీ జూలో ఈ జాతి వృద్ధికి విశేష కృషి చేస్తున్నారు. వారి సాయంతో విశాఖ జంతు ప్రదర్శనశాలలో ‘రెడ్‌ హెడ్డెడ్‌ వల్చర్‌ కన్జర్వేషన్‌ ప్రాజెక్టు’కు ప్రతిపాదన చేశారు. ఇందుకు అవసరమైన నిధులు ఇటలీ జూనే అందించనుంది. కేంద్ర ప్రభుత్వ అనుమతికి ప్రతిపాదనలు పంపారు. అడవుల్లో పెరిగే జంతువులకు, జూలలో పెరిగే వాటికి చాలా తేడా ఉంటుంది. ప్రదర్శనశాలల్లో వాటికి ఏ రకమైన ఆహారం అందిస్తే ఆరోగ్యంగా ఉంటాయి, ఏ చికిత్సకు త్వరగా కోలుకుంటాయి వంటి విషయాల్లో పూర్తిస్థాయి అవగాహన ఉంటే వాటి సంరక్షణలో చాలా వరకూ విజయం సాధించినట్లే. అందుకే విశాఖ జూలో వివిధ జాతుల కోతుల సంరక్షణకు ఉమ్మడి పరిశోధనకు ‘గట్‌ మైక్రో ఫ్లోరా రీసెర్చ్‌’ ప్రాజెక్టు ప్రతిపాదనలు సిద్ధం చేసి కేంద్ర అటవీ శాఖకు పంపారు.

అనుమతించిన వెంటనే..: నందనీ సలారియా, క్యూరేటర్,  ఇందిరాగాంధీ జంతుప్రదర్శనశాల 

ఐరోపా జంతు ప్రదర్శనశాలల్లో అత్యాధునిక ప్రమాణాలు అనుసరిస్తారు. వాటిని తెలుసుకొని ఇక్కడ అమలు చేస్తే మెరుగైన ఫలితాలు సాధించొచ్చు. అందుకే ఒప్పందం కుదుర్చుకున్నాం. సమాచారం, సాంకేతిక అంశాలను పంచుకుంటాం. విశాఖ జూలో రాబందులు లేకున్నా వాటి సంరక్షణకు ఇక్కడి జూలో ఓ సెంటర్‌ ఏర్పాటు చేసేలా ఆలోచన చేశాం. దీంతో దేశంలో వాటి సంతానోత్పత్తి పెంచొచ్చు. అలాగే కోతుల సంక్షేమం, ఆరోగ్య విషయానికి సంబంధించిన పరిశోధన ప్రాజెక్టుపై ఇటలీ జూతో కలిసి పనిచేసేందుకు అనుమతించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాం.

Read latest Visakhapatnam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని