logo

మద్యం తాగడానికి పిలిచి చంపేశారు

చిన్న చిన్న గొడవల కారణంగా విడిపోయిన స్నేహితులు కక్షలు పెంచుకొని అదును చూసి ఓ స్నేహితుడ్ని కర్కశంగా చంపేశారు. నగరంలో సంచలనం సృష్టించిన ఈ సంఘటన  మర్రిపాలెం రైల్వే క్వార్టర్స్‌ వద్ద ఈ సంఘటన జరిగింది. పోలీసులు, కుటుంబ

Published : 28 May 2022 04:14 IST

మర్రిపాలెంలో యువకుడిపై కర్కశ దాడి

మాధవధార, న్యూస్‌టుడే

చిన్న చిన్న గొడవల కారణంగా విడిపోయిన స్నేహితులు కక్షలు పెంచుకొని అదును చూసి ఓ స్నేహితుడ్ని కర్కశంగా చంపేశారు. నగరంలో సంచలనం సృష్టించిన ఈ సంఘటన  మర్రిపాలెం రైల్వే క్వార్టర్స్‌ వద్ద ఈ సంఘటన జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. 51వ వార్డు గాంధీనగర్‌ ప్రాంతానికి చెందిన రేబాక సాయితేజ (22) ఫొటోగ్రఫీ చేస్తుంటాడు. ఇదే ప్రాంతంలోని మహత్‌కాలనీకి చెందిన అతడి స్నేహితుడు మోహన్‌ గురువారం రాత్రి ఒంటి గంట సమయంలో ఫోన్‌ చేసి, రైల్వే క్వార్టర్స్‌ గ్రౌండ్స్‌ వద్ద పాత స్నేహితులు ఉన్నారని, మద్యం తాగుదాం రమ్మని పిలిచాడు. దీంతో తేజ మరో ముగ్గురు స్నేహితులతో వెళ్లాడు. అక్కడ మద్యం మత్తులో ఉన్న గ్రీన్‌గార్డెన్స్‌కు చెందిన బంగారు రాజు బ్యాచ్‌కు, తేజకు మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. దీంతో బంగారు రాజు బ్యాచ్‌కు సంబంధించిన యువకులు కత్తులు, రాడ్లు, కర్రలతో తేజపై దాడి చేశారు. వారి నుంచి తప్పించుకునేందుకు అతడు రైల్వే క్వార్టర్స్‌ వైపు పరుగులు తీశాడు. క్వార్టర్స్‌ పైకి వెళ్లిన అతడిని కిందకు తీసుకువచ్చి కొబ్బరిబొండాలు కొట్టే కత్తితో తలపై, వీపుపై నరుకుతూ, రాడ్లతో కొట్టడంతో మళ్లీ పరుగెత్తాడు. అతడిని వెంబడించి రైల్వేక్వార్టర్స్‌ నీటి ట్యాంకర్‌ వద్ద కొట్టి చంపేశారు.

చంపేసి.. తప్పుదోవ పట్టించేలా: హత్య అనంతరం నిందితులు తమకేమీ తెలియదన్నట్లుగా.. తేజ తన స్నేహితులతో కలసి తమపై దాడికి పాల్పడ్డాడంటూ అర్థరాత్రి 2.30 గంటల సమయంలో ఎయిర్‌పోర్టు స్టేషన్‌కి వచ్చి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో నిందితులైన బంగారురాజు, రవి, మరో ముగ్గురు ఉన్నారు. వీరంతా పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు ఇలా స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. స్టేషన్‌లో ఫిర్యాదు తీసుకున్న కానిస్టేబుల్‌ తెల్లవారాక వచ్చి విచారిస్తామని చెప్పడంతో వెళ్లిపోయారు.

పోలీసుల పరిశీలన: శుక్రవారం తెల్లవారుజామున క్వార్టర్స్‌ ఎదురుగా ఉన్న గ్రౌండ్‌లో ఆడుకునేందుకు వచ్చిన పలువురు యువకులు అచేతనంగా పడిఉన్న తేజను చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎయిర్‌పోర్టు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలించి, హత్యకు గల కారణాలను నమోదు చేశారు. క్రైం ఏసీపీ పెంటారావు, ఎయిర్‌పోర్టు సీఐ ఉమాకాంత్‌తో పాటు ఆర్పీఎఫ్‌ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. క్లూస్‌ టీం ఆ ప్రాంతానికి చేరుకొని పలు ఆధారాలను సేకరించింది.

ముందుగానే హెచ్చరించి: వారం రోజుల క్రితం తేజ స్నేహితుడు ఒకరు బిర్లాకూడలి వద్ద ప్రమాదంలో గాయాలపాలై నాలుగు రోజులు ఆసుపత్రిలో చికిత్స పొంది మరణించాడు. అతడి అంతిమయాత్ర సమయంలో తేజకు, మిగతా యువకులకు మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఆ సమయంలోనే... ‘నెల రోజుల్లో నిన్ను చంపేస్తామం’టూ తేజను వారు హెచ్చరించారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. దీంతో అప్పటి నుంచి సమయం కోసం వేచి చూసి, స్నేహితుడితో ఫోన్‌ చేయించి రప్పించి హత్య చేశారని ఆరోపించారు.

ఇది వారి పనే: రైల్వే క్వార్టర్స్‌కి ఆనుకొని ఉన్న గ్రీన్‌గార్డెన్స్‌కు చెందిన బంగారు రాజు అనే వ్యక్తి జీవీఎంసీలో కాంట్రాక్ట్‌ వర్కర్‌గా పనిచేస్తుంటాడు. ఇతనిపై దొంగతనం కేసులు కూడా ఉన్నాయి. ఇతడి బ్యాచ్‌కి, తేజకు గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతుండటంతో వారే హత్య చేశారని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రాథమికంగా హత్య వారి పనేనని పోలీసులు తేల్చి 10 మందిపై కేసు నమోదు చేశారు. హత్యకు సంబంధించిన దృశ్యాలు సమీపంలో ఉన్న సీసీ టీవీలో నమోదవడంతో దాని ఆధారంగా నిందితులను గుర్తిస్తున్నారు. బంగారురాజు, రవి, మోహన్‌, యూసఫ్‌ ఖాన్‌, సురేష్‌, నాని, బాలు, హరి.. మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మృత దేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు.

స్థానికుల్లో అలజడి: అర్థరాత్రి సమయంలో యువకులు కేకలు వేస్తూ.. కత్తులు, రాడ్లతో క్వార్టర్స్‌లో అలజడి సృష్టించి హత్య చేయడంతో స్థానిక నివాసితులు భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రాంగణంలోని మైదానంలో ప్రతి రోజు ఆకతాయిలు మద్యం, గంజాయి తాగుతూ గొడవలు చేస్తున్నారని పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వారు వాపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని