logo

ప్రయాణం.. విషాదం

అనకాపల్లి జిల్లాలో రహదారులు రక్తసిక్తమయ్యాయి. నర్సీపట్నం, నక్కపల్లి పరిధిలో శుక్రవారం మూడు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు దుర్మరణం చెందగా.. ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు.

Published : 28 May 2022 04:14 IST

వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు దుర్మరణం

ఎనిమిది మందికి తీవ్రగాయాలు

న్యూస్‌టుడే, నర్సీపట్నం అర్బన్‌, నక్కపల్లి

నర్సీపట్నం: ప్రమాదంలో నుజ్జయిన కారు
 

అనకాపల్లి జిల్లాలో రహదారులు రక్తసిక్తమయ్యాయి. నర్సీపట్నం, నక్కపల్లి పరిధిలో శుక్రవారం మూడు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు దుర్మరణం చెందగా.. ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు.

నర్సీపట్నం మున్సిపాలిటీ అప్పన్నదొరపాలెం కూడలికి సమీపంలో ఉదయం 5.16 గంటలకు ఓ కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడికే మరణించారు. వీరంతా మాకవరపాలెం మండల కేంద్రానికి చెందిన రాచూరి దుర్గాప్రసాద్‌ (22), ఎల్లపు నాగేంద్ర (28),కన్నూరి రోహిత్‌ (25)గా గుర్తించారు. సీటుబెల్టు పెట్టుకోవడంతో బెలూన్లు తెరుచుకుని డ్రైవర్‌ మైచర్ల గౌరీనాథ్‌, గెడ్డం లక్ష్మణ్‌ తీవ్రగాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. స్నేహితులైన వీరంతా తూర్పుగోదావరి జిల్లా తునిలో ఓ వివాహానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో ప్రమాదానికి గురయ్యారు. వర్షం పడుతుండటంతో రోడ్డు సరిగా కనిపించకపోవడం, త్వరగా ఇంటికి చేరాలన్న ఆతృతతో కారు వేగంగా, అజాగ్రత్తగా నడపడంతో ఈ ప్రమాదం జరిగిందని ట్రాఫిక్‌ ఎస్సై దివాకర్‌ పేర్కొన్నారు.

జాతీయ రహదారిపై నక్కపల్లి మండలం ఒడ్డిమెట్ట వద్ద తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో కృష్ణాజిల్లా ఉంగుటూరుకు చెందిన మరడా రమేష్‌బాబు (37), తలారి వెంకటేశ్వరమ్మ (41) అక్కడికక్కడే మరణించగా ఐదుగురు గాయపడ్డారు. వీరంతా సింహాచలం అప్పన్నస్వామి దర్శనానికి ఆటోలో వస్తూ ఒడ్డిమెట్ట వద్ద ఆగివున్న లారీని ఢీకొన్నారు.

నక్కపల్లి వద్ద జరిగిన ప్రమాదంలో యానాం పట్టణానికి చెందిన జె.ఆనంద్‌ జయశేఖరరెడ్డి (20) మరణించగా, రాజశేఖర్‌ గాయపడ్డాడు. వీరిద్దరూ బైకుపై విశాఖపట్నం నుంచి యానాం వెళ్తూ ఆగి ఉన్న కారును ఢీకొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని