logo

అటు యాత్ర.. ఇటు యాతన!

విశాఖ నగరంలోని ఎన్‌ఏడీ కూడలి నుంచి గాజువాక వరకూ శుక్రవారం ఉదయం పలువురు ట్రాఫిక్‌ ఇక్కట్లు ఎదుర్కొన్నారు. గాజువాక ప్రాంతం ఆంక్షల గుప్పిట్లో చిక్కుకుంది. వైకాపా ఆధ్వర్యంలో చేపట్టిన ‘సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర’ సందర్భంగా పాతగాజువాక కూడలిలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. దుకాణాలు తెరవకూడదని ముందుగానే స్పష్టం చేశారు. పరిసర ప్రాంతాల ప్రజలు రోడ్లపైకి రాకుండా కట్టుదిట్టం

Published : 28 May 2022 04:14 IST

ఆంక్షల గుప్పిట్లో గాజువాక

సభలో మాట్లాడుతున్న ఉపముఖ్యమంత్రి ముత్యాలనాయుడు, వేదికపై మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు

గాజువాక, న్యూస్‌టుడే: విశాఖ నగరంలోని ఎన్‌ఏడీ కూడలి నుంచి గాజువాక వరకూ శుక్రవారం ఉదయం పలువురు ట్రాఫిక్‌ ఇక్కట్లు ఎదుర్కొన్నారు. గాజువాక ప్రాంతం ఆంక్షల గుప్పిట్లో చిక్కుకుంది. వైకాపా ఆధ్వర్యంలో చేపట్టిన ‘సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర’ సందర్భంగా పాతగాజువాక కూడలిలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. దుకాణాలు తెరవకూడదని ముందుగానే స్పష్టం చేశారు. పరిసర ప్రాంతాల ప్రజలు రోడ్లపైకి రాకుండా కట్టుదిట్టం చేశారు. కేవలం సభా వేదిక ముందు ఏర్పాటు చేసిన కుర్చీల వైపు వచ్చే వారినే అనుమతించారు. తెల్లవారుజాము నుంచి సభ ముగిసే వరకూ ఆంక్షలు అమలు చేయడంతో ఈ ప్రాంత ప్రజలు సరికొత్త కష్టాలను ఎదుర్కొన్నారు.

కణితిరోడ్డు వంటిల్లు కూడలిలో ఏర్పాటు చేసిన బారికేడ్లు


ట్రాఫిక్‌లో చిక్కుకున్న తితిదే ఛైర్మన్‌ సుబ్బారెడ్డి కారు

కొత్తగాజువాక, సినిమాహాలు కూడలి, పాతగాజువాక కూడళ్లలో బారికేడ్లు, పోలీసు పికెట్లు ఏర్పాటు చేసి ఎవర్నీ అనుమతించలేదు. కణితిరోడ్డు వంటిల్లు కూడలి, పాతగాజువాక పంతులుగారి మేడ వద్ద సీఐ స్థాయి అధికారులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటలకు పాత గాజువాక వుడారోడ్డులో బహిరంగ సభ ప్రారంభమైనా, తెల్లవారు జాము నుంచే అన్ని రహదారులను మూసేశారు.  ప్రజలు కాలనీ అంతర్గతమార్గాల్లోనుంచి ప్రధాన రహదారుల్లోకి చేరుకోవాల్సి వచ్చింది.


గాజువాకతో పాటు, ఎన్‌ఏడీకూడలిలో ఎక్కడిక్కడ ట్రాఫిక్‌ స్తంభించడంతో ఇటు సింధియా మీదుగా నగరంలోకి వెళ్లాల్సిన ప్రయాణికులు, అటు కూర్మన్నపాలెం నుంచి అనకాపల్లి, రాజమహేంద్రవరం వెళ్లే ప్రయాణికులు దాదాపు మూడు, నాలుగు గంటల పాటు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సభలో పాల్గొనేందుకు వచ్చిన తితిదే ఛైర్మన్‌ వైవీ.సుబ్బారెడ్డి ఎన్‌ఏడీకూడలి పైవంతెన వద్ద ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. ఆ తర్వాత వాహనాలను క్రమబద్ధీకరించడంతో సభాస్థలికి చేరుకున్నారు.


జీవీఎంసీ యూసీడీ విభాగం అధికారులు, వైకాపా కార్పొరేటర్లు, నాయకుల సమన్వయంతో ఎక్కడికక్కడ మినీ బస్సులు, ఆటోలు ఏర్పాటు చేసి డ్వాక్రా గ్రూపు సభ్యులను స్థానిక లంకా మైదానానికి తరలించారు. అక్కడ వాహనాల్లోంచి దించేసి సభాస్థలికి వరకు నడిపించారు. తిరుగు ప్రయాణంలో తమను తీసుకువెళ్లేందుకు సరిగా ఏర్పాట్లు చేయలేదని పలువురు మహిళలు ఇక్కడ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.


బస్సులో వస్తున్న మహిళా సంఘాల సభ్యులు

గాజువాకలో జరిగిన సభకు ఎమ్మెల్యే నాగిరెడ్డి అధ్యక్షత వహించారు. స్పీకర్‌ సీతారాం, ఉపముఖ్యమంత్రులు బూడి ముత్యాలనాయుడు, అంజాద్‌బాషా,  మంత్రులు విడదల రజని, వనిత మాట్లాడారు. కార్యక్రమానికి మొత్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మంత్రులు, మేయర్‌ హరివెంకటకుమారి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తితిదే ఛైర్మన్‌ సుబ్బారెడ్డి, మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. సామాజిక న్యాయాన్ని శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ప్రజలందరికీ వివరించడమే బస్సుయాత్ర ముఖ్య ఉద్దేశమని వారు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని