‘జగనన్న లేఅవుట్లలో భారీ అక్రమాలు’

వడ్డాదిలో జగనన్న లేఅవుట్లలో భారీగా అక్రమాలు జరిగాయని, భూసేకరణ కోసం చేసిన పరిహారం చెల్లింపుల దగ్గర నుంచి పట్టాల పంపిణీ వరకు అంతా అవినీతి పుట్ట అని తెదేపా నాయకులు ఆరోపించారు.

Published : 04 Jun 2022 05:17 IST

బుచ్చెయ్యపేట, న్యూస్‌టుడే: వడ్డాదిలో జగనన్న లేఅవుట్లలో భారీగా అక్రమాలు జరిగాయని, భూసేకరణ కోసం చేసిన పరిహారం చెల్లింపుల దగ్గర నుంచి పట్టాల పంపిణీ వరకు అంతా అవినీతి పుట్ట అని తెదేపా నాయకులు ఆరోపించారు. అనర్హుల వివరాలతో కూడిన జాబితాను పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు దొండా నరేష్‌ తదితరులు శుక్రవారం విలేకరులకు అందజేశారు. దీనిపై సమగ్రంగా విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. ఈ వ్యవహారంపై సోమవారం కలెక్టరేట్‌లో జరిగే స్పందన కార్యక్రమంలోనూ ఫిర్యాదు చేస్తామన్నారు. మూడు లేవుట్లలో కలిపి 287 మంది లబ్ధిదారులను గుర్తించి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారని, వీటిలో సుమారు 150 మంది వరకు అనర్హులు ఉన్నారని, ఇళ్ల స్థలాలు, పక్కా ఇళ్లు ఉన్నవారికే  పట్టాలిచ్చారని ఆరోపించారు. స్వయంగా గృహనిర్మాణ సంస్థ అధికారులే 26 మంది అనర్హులను గుర్తించి వారికి ఇళ్లు మంజూరు చెయ్యకుండా నిలిపివేశారన్నారు. గతంలో వీరందరూ కాలనీ ఇళ్లు తీసుకున్నట్లు ఆధారాలు ఉన్నాయన్నారు. వీరికి మళ్లీ ఇళ్ల పట్టాలు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. భారీగా సొమ్ములు చేతులు మారాయని, కొందరు అధికార పార్టీ నాయకులు, రెవెన్యూ అధికారులు కుమ్మక్కై డబ్బులు తీసుకుని అనర్హులకు పట్టాలిచ్చారని ఆరోపించారు. వీరిలో చాలామంది పట్టాలను అమ్మేసుకుంటున్నారని తెలిపారు. నిజమైన లబ్ధిదారులకు పట్టాలిస్తే ఎవరూ అమ్ముకునే పరిస్థితి ఉండదని పేర్కొన్నారు. బినామీల పేరిట పట్టాలు మంజూరు చేయించుకుని అమ్ముకుంటున్నారని చెప్పారు. అర్హులు చాలామంది ఉన్నా వారికి అన్యాయం జరిగిందన్నారు. అనర్హులకు ఇచ్చిన పట్టాలను రద్దు చేసి అర్హులకు పంపిణీ చెయ్యాలని డిమాండ్‌ చేశారు. మూడు లేఅవుట్లకు చెందిన భూసేకరణకు సంబంధించిన పరిహారం మంజూరులోనూ అక్రమాలు జరిగాయని ఆరోపించారు. నాయకులు దొండా గిరిబాబు, తలారి శంకర్, అక్కిరెడ్డి కనక, సూరిబాబు, రమేష్, గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు.  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని