logo

ధరలింతే.. గుత్తేదారులు చెప్పినంతే!!

మహా విశాఖ నగరపాలక సంస్థ స్థాయీ సంఘ సమావేశాన్ని శుక్రవారం  నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రారంభంకానున్న సమావేశంలో 19 అంశాలపై సభ్యులు చర్చించనున్నారు. అజెండా కాపీలను సభ్యులకు కార్యదర్శి ఎంవీడీ ఫణిరాం అందజేశారు. మధురవాడ మార్కెట

Published : 24 Jun 2022 04:55 IST

ఆమోదిస్తారా... చర్చిస్తారా?

19 అంశాలతో నేడు స్థాయీ సంఘ సమావేశం

కార్పొరేషన్‌, న్యూస్‌టుడే

మహా విశాఖ నగరపాలక సంస్థ స్థాయీ సంఘ సమావేశాన్ని శుక్రవారం  నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రారంభంకానున్న సమావేశంలో 19 అంశాలపై సభ్యులు చర్చించనున్నారు. అజెండా కాపీలను సభ్యులకు కార్యదర్శి ఎంవీడీ ఫణిరాం అందజేశారు. మధురవాడ మార్కెట శనివారం సంతలో ఆశీలు వసూలు గుత్తను రూ.28 లక్షలకు దక్కించుకున్న గుత్తేదారు...తరువాత ముందుకు రాకపోవడంతో తిరిగి వేలం నిర్వహించేలా మొదటి అంశాన్ని చేర్చారు. పోర్టు పైవంతెన కింద కాన్వెంట కూడలిలో ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ, పార్కింగ్‌ సౌకర్యం కోసం  అవసరమైన సిమెంట దిమ్మెల ఏర్పాటుకు రూ.27.20లక్షలు కేటాయించారు. ఆయా నిధుల విడుదలకు అనుమతి కోరారు. వీటితో పాటు అజెండాలో పలు కీలక అంశాలు ఉన్నాయి. వాటిపై సభ్యులు ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

అంశం: 9వ వార్డులో ఒక అసెస్‌మెంటకు అర్ధ  సంవత్సరం పన్ను రూ.1183గా నిర్ణయించడంతో భవన యజమాని 2010లో కోర్టును ఆశ్రయించారు. పన్ను రూ.352లుగా ఉంటే ఒక్కసారిగా పెంచారని, దానిని తగ్గించాలని కోరారు. పాత విధానంలో రూ.352లు వసూలు చేయాలని 2014లో  కోర్టు తెలిపింది. దానిని అమలు చేయాలని స్థాయీ సభ్యుల ముందు ఉంచారు.

ఇదీ సంగతి: ఎనిమిదేళ్ల క్రితం కోర్టు ఉత్తర్వులు విడుదల చేస్తే ఇన్నేళ్లు ఎందుకు అమలు చేయలేదన్నది కీలకంగా మారింది. ప్రస్తుతం వార్షిక అద్దె విలువ ఆధారిత ఆస్తి పన్ను నుంచి మూలధన విలువ ఆధారిత పన్ను విధానంలో వసూలు చేస్తున్నారు. కోర్టు తీర్పును ఇప్పుడు ఏ తరహాలో అమలు చేస్తారన్నది ఆసక్తిరేపుతోంది.

అంశం: డైమండ్‌ పార్కులో జీవీఎంసీ వాణిజ్య సముదాయంలో నాలుగో నెంబరు దుకాణం అద్దెను రూ.85,308గా నిర్ణయిస్తే రూ.90 వేలకు గుత్తేదారు దక్కించుకున్నారు. 5వ దుకాణం రూ. 61 వేలకు నిర్ణయిస్తే రూ.65 వేలకు దక్కించుకున్నారు. 6వ దుకాణం రూ. 72,300లకు నిర్ణయిస్తే రూ.78,300, 7వ నెంబరు దుకాణం రూ.46,200లకు నిర్ణయిస్తే రూ.52,200లకు గుత్తేదారులు పాడుకున్నారు. గుత్తేదారులకు దుకాణాలు అప్పగించేలా అనుమతించాలని అజెండాలో చేర్చారు.  

ఇదీ సంగతి: 4వ దుకాణం కంటే 5,6,7 దుకాణాల ప్రారంభ ధర ఎందుకు తగ్గించారనే అంశంపై ఆరోపణలు వస్తున్నాయి. ఒకే సముదాయంలో దుకాణాల అద్దెల మధ్య అంత వ్యత్యాసం ఎలా వచ్చిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక్కడే ఓ మూడు దుకాణాల్లో హోటల్‌ నడపగా.. రూ.1.20కోట్లు బకాయిలు పాత గుత్తేదారు చెల్లించాల్సి ఉంది. వాటిని చెల్లించాలని కోర్టు ఉత్తర్వులున్నా, అధికారులు ఇంకా వసూలు చేయలేదని సమాచారం.

అంశం: లుంబని పార్కు పార్కింగ్‌, ప్రవేశ రుసుముల గుత్తను మూడేళ్లకు బదులుగా పది నెలలకు వేలం వేశారు. ప్రభుత్వ పాట నిర్ణయించినా...రూ.9.10లక్షలకు గుత్తేదారు దక్కించుకున్నారు. దానిని ఆమోదించాలని సభ్యుల ముందుంచారు.

ఇదీ సంగతి: గత మార్చిలో లుంబిని పార్కు పార్కింగ్‌, ప్రవేశ రుసుములకు సంబంధించి వేలం నిర్వహించారు. ఏడాదికి రూ. 20 లక్షలకు గుత్తేదారు దక్కించుకున్నారు. నలభై రోజులు వసూలు చేసిన తరువాత అంత మొత్తం చెల్లించలేమని వేలం రద్దు చేయాలని కోరారు. తాజాగా తిరిగి వేలం వేశారు. ప్రస్తుతం తొమ్మిది నెలలకు రూ.9.10లక్షలు మాత్రమే రావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అంశం: మద్దిలపాలెంలో మార్కెట, ఆశీలు వసూలుకు సంబంధించి తొమ్మిది నెలల కాలానికి రూ.2.89లక్షలకు గుత్తేదారు దక్కించుకున్నారు. ఆశీలు అప్పగించడానికి అనుమతించాలని అజెండాలో చేర్చారు.

ఇదీ సంగతి: ఈ ఏడాది మార్చిలో ఆశీలుకు వేలం పాట నిర్వహించారు. 2023 మార్చి వరకు రూ.4.39 లక్షలకు గుత్తేదారు దక్కించుకున్నారు. దానిని రద్దు చేసి తిరిగి మళ్లీ వేలం ఎందుకు నిర్వహించాల్సి వచ్చిందన్న విషయం కీలకంగా మారింది. గత ఏడాది రూ.4.15లక్షలకు దక్కించుకోగా, ఈ ఏడాది తొమ్మిది నెలలకు జీవీఎంసీ రూ.2,80,500లుగా నిర్ణయిస్తే,  ఇద్దరు గుత్తేదారులు పాల్గొని రూ.2.89లక్షలకు దక్కించుకున్నారు. ఇద్దరే వచ్చినా...తక్కువకే పాడినా ఎలా అప్పగిస్తున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

అంశం: జీవీఎంసీలో ప్రధాన, జోనల్‌ కార్యాలయాల్లో ఈ ఏడాది ఏప్రిల్‌, మే నెలల్లో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌కు రూ.5.99లక్షలు వ్యయమైందని, నిధులు విడుదల చేయాలని కోరుతూ అంశాన్ని చేర్చారు.

ఇదీ సంగతి: రెండు నెలల కాలానికి టెలీకాన్ఫరెన్స్‌లకు రూ.5.99 లక్షలు చెల్లించాలని కోరడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఇదే అంశాన్ని స్థాయీ సభ్యులు తిరస్కరించగా, మళ్లీ అదే అంశాన్ని వారి ముందుంచారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని