logo

టోకరా వేసి.. కిడ్నాప్‌ కేసులో ఇరికించి..

ఉద్యోగాల పేరిట మోసపోయిన నిరుద్యోగులు తమ డబ్బు రాబట్టుకునే ప్రయత్నంలో కిడ్నాప్‌ కేసులో చిక్కుకుపోయారు. యువకుల కుటుంబసభ్యుల కథనం ప్రకారం... బుచ్చెయ్యపేట మండలం తైపురం గ్రామానికి చెందిన యలమంచిలి శ్రీనివాసరావు,

Updated : 24 Jun 2022 05:26 IST

మోసగాడి నిర్వాకానికి కోల్‌కతా పోలీసుల అదుపులో నిరుద్యోగులు

బుచ్చెయ్యపేట, న్యూస్‌టుడే: ఉద్యోగాల పేరిట మోసపోయిన నిరుద్యోగులు తమ డబ్బు రాబట్టుకునే ప్రయత్నంలో కిడ్నాప్‌ కేసులో చిక్కుకుపోయారు. యువకుల కుటుంబసభ్యుల కథనం ప్రకారం... బుచ్చెయ్యపేట మండలం తైపురం గ్రామానికి చెందిన యలమంచిలి శ్రీనివాసరావు, డేగల రాజు, కంఠంరెడ్డి గణేష్‌, బుచ్చెయ్యపేటకు చెందిన అనిల్‌తోపాటు పోలేపల్లి, చోడవరం మండలం కన్నంపాలెం, రావికమతం మండలం మరుపాక పంచాయతీ శివారు రాయవరం, గాజువాక తదితర ప్రాంతాలకు చెందిన యువకులు ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారు. వీరికి ఆర్మీలో ఉద్యోగాలు ఇప్పిస్తానని ఆశ చూపించి పశ్చిమ బంగ రాష్ట్రంలోని కోల్‌కతాకి చెందిన రాఖీ, సందీప్‌, మరో మహిళ కలిసి డబ్బులు వసూలు చేశారు. దాదాపు 13 మంది యువకులు తెలిసిన వ్యక్తి ద్వారా సుమారు రూ. 70 లక్షలు చెల్లించారు. నెలలు గడిచిపోతున్నా ఉద్యోగాలు రాలేదు. దాంతో తమ డబ్బులు తిరిగి ఇచ్చేయాలని బాధిత యువకులు కోల్‌కతాలో ఉన్న రాఖీకి పలుమార్లు ఫోన్లు చేసి అడిగారు. ఎన్నిసార్లు అడిగినా ఫలితం లేకపోవడంతో కొంతమంది యువకులు కోల్‌కతా వెళ్లి అక్కడి నుంచి రాఖీని పట్టుకుని విశాఖపట్నం తీసుకొచ్చారు. తమ డబ్బులు తిరిగి ఇస్తేనే వదిలిపెడతామని అతడిని విడిచిపెడతామని చెప్పారు. దాంతో కోల్‌కత్తాలో ఉన్న మిగిలిన వ్యక్తులు యువకుల బ్యాంక్‌ ఖాతాకు రూ. 5 లక్షలు పంపించారు. మిగిలిన సొమ్ము నేరుగా వచ్చి ఇస్తామని నమ్మబలికారు. ఈలోగా రాఖీని తీసుకువచ్చిన యువకులపై కోల్‌కతాలో కిడ్నాప్‌ కేసు పెట్టారు. పశ్చిమ బంగ పోలీసులతో కలిసి బుధవారం రాత్రి విశాఖపట్నం చేరుకున్నారు. విశాఖ నగర పోలీసుల సాయంతో యువకులు ఉన్న హోటల్‌కి వెళ్లి వారిని అదుపులోకి తీసుకున్నారు. తైపురానికి చెందిన శ్రీనివాసరావు, రాజు, బుచ్చెయ్యపేటకు చెందిన అనిల్‌తోపాటు మరో ఇద్దరు యువకులను గురువారం కోల్‌కతా తీసుకెళ్ల్లారు. ఇచ్చిన డబ్బులు తిరిగి వసూలు చేసుకునే ప్రయత్నం చేస్తే, తమనే కిడ్నాప్‌ కేసులో ఇరికించారంటూ బాధిత యువకులు లబోదిబోమంటున్నారు. తమవారిని ఆదుకోవాలంటూ రాజు తండ్రి సన్యాసిరావు, శ్రీనివాసరావు తండ్రి అప్పారావు తదితరులు కోరుతున్నారు. దీనిపై బుచ్చెయ్యపేట ఎస్సై రామకృష్ణను వివరణ కోరగా ఈ వ్యవహారంపై తమకు ఎలాంటి ఫిర్యాదూ అందలేదని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని