logo

కౌలు రైతుకు హక్కుల చిక్కు

ఈయన పేరు కాండ్రేగుల కోటిబాబు. మునగపాక మండలంలో 1.5 ఎకరాల భూమి కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. కౌలురైతు గుర్తింపు కార్డు మాత్రం పొందలేకపోయాడు. గతంలో సహాకార సంఘంలో నేరుగా డబ్బులు చెల్లించి విత్తనాలు తెచ్చుకునేవాడు..

Updated : 24 Jun 2022 05:04 IST

గుర్తింపు కార్డులకు దూరం.. అందని సర్కారు సాయం

ఈనాడు డిజిటల్‌, అనకాపల్లి, న్యూస్‌టుడే, అనకాపల్లి

ఈయన పేరు కాండ్రేగుల కోటిబాబు. మునగపాక మండలంలో 1.5 ఎకరాల భూమి కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. కౌలురైతు గుర్తింపు కార్డు మాత్రం పొందలేకపోయాడు. గతంలో సహాకార సంఘంలో నేరుగా డబ్బులు చెల్లించి విత్తనాలు తెచ్చుకునేవాడు.. ఇప్పడు రైతుభరోసా కేంద్రంలో ముందుగా పేరు నమోదు చేసుకోవాలి. ఈయన వద్ద పట్టాదారు పాసుపుస్తకం లేదు.. కౌలు గుర్తింపు కార్డు లేదు. దీంతో విత్తనాలే కాదు ప్రభుత్వపరంగా ఏ సాయం కూడా అందడం లేదు.


ఈయన పేరు బుద్ద దాసు. 12 ఎకరాల భూమి కౌలుకు తీసుకొని తీపి మొక్కజొన్న, వరి, టమోటా, ఆనప వంటి కూరగాయల పంటలను సాగు చేస్తున్నాడు. ఈయనకు కౌలు రైతుగా ఎటువంటి గుర్తింపు కార్డు లేదు. ఇలాంటి కార్డు ఒకటి ఇస్తారనే విషయమే ఈయనకు తెలీదు. అందరూ రాయితీ విత్తనాలు తెచ్చుకుంటే నేను మాత్రం ప్రైవేటు డీలర్ల వద్ద అధిక ధరలకు విత్తనాలు కొనుగోలు చేసుకోవాల్సి వస్తోందని చెబుతున్నాడు..


మునగపాకలో రైతులతో మాట్లాడుతున్న రైతు స్వరాజ్యవేదిక సభ్యులు

ప్రస్తుతం పంటల సాగులో కౌలు రైతులే ముఖ్యభూమిక పోషిస్తున్నారు. చిన్న చిన్న కమతాలు సాగుకు గిట్టుబాటు కాక రైతులు కౌలుకిచ్చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో సుమారు 31 వేల మంది కౌలు రైతులు ఉంటారని వ్యవసాయ శాఖ అంచనా. వీరికి గతంలో విత్తనాల సరఫరా నుంచి పంటల కొనుగోలు వరకు ఎలాంటి బంధనాలు ఉండేవి కావు.. నేరుగా వెళ్లి రాయితీ విత్తనాలు తెచ్చుకునేవారు.. ధాన్యం కొనుగోలు కేంద్రంలో అమ్ముకునేవారు. గత మూడేళ్లుగా కౌలుదారుల గుర్తింపు మొదలుకొని వారికి అందించాల్సిన సాయం వరకు అన్నింటా నిబంధనలు అమలు చేస్తున్నారు. దీంతో వారికి సాగుపరంగానే కాదు.. సర్కారు సాయం పరంగాను ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విసిగిపోయి వీరూ కాడి వదిలేసే పరిస్థితి వస్తోంది.

కొత్తచట్టం అమలు వల్లే..

రాష్ట్ర ప్రభుత్వం 2019లో కౌలు రైతులకు తీసుకువచ్చిన కొత్త చట్టంతో అనేక చిక్కులు ఏర్పడ్డాయి. భూ యజమాని ఆధార్‌, సంతకం ఉంటేనే కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇస్తామని చట్టంలో పేర్కొన్నారు. దీనివల్ల 95 శాతం మంది కౌలు రైతులకు పంటల సాగుదారు హక్కుల కార్డులు (సీసీఆర్సీ) నోచుకోలేకపోతున్నారు. గతంలో ఈ నిబంధన ఉండేది కాదు. కౌలుకు చేస్తున్నట్లు దరఖాస్తు చేస్తే వీఆర్వో ధ్రువీకరించి ఎల్‌ఈసీ కార్డులు ఇచ్చేవారు. ప్రస్తుత చట్టంలో భూయజమాని సమ్మతి తప్పనిసరి చేయడంతో ఎవరూ కౌలు గుర్తింపు కార్డులకు నోచుకోలేకపోతున్నారు.

అంచనాలు తారుమారు..

జిల్లాలో 2015లో 40 వేల మంది కౌలు రైతులున్నట్లు రెవెన్యూ శాఖ అంచనా వేసింది. 2021కి వచ్చేసరికి 31,802 మంది ఉంటారని అంచనా వేసిన వ్యవసాయ శాఖ సీసీఆర్సీ కార్డులను మాత్రం 7,500 మందికే ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది.   ఈ ఏడాదికి వచ్చేసరికి 4,115   మంది మాత్రమే కౌలు రైతులున్నట్లు వ్యవసాయ శాఖ చెబుతోంది. పోనీ వారికైనా సీసీఆర్సీ కార్డులు ఇచ్చారంటే కేవలం 546 మందికే ఇచ్చారు. ఇలా నిబంధనల పేరుతో కౌలు రైతుల గుర్తింపులోనూ కోతపెడుతున్నారు.


అన్ని విధాల నష్టపోతున్నారు..

కౌలు రైతుల పరిస్థితిపై మేం రైతు స్వరాజ్య వేదిక తరఫున రాష్ట్రవ్యాప్తంగా సర్వే చేపట్టాం. అందులో బుచ్చెయ్యపేట, మునగపాక మండలాల్లో పర్యటించి కౌలు రైతులతో మాట్లాడాం. ఈ చట్టం గురించి చాలామందికి తెలియదు. దీనిపై రెవెన్యూ, వ్యవసాయ శాఖలు అవగాహన కల్పించాల్సి ఉంది. కార్డు లేకపోవడంతో ఫలితంగా కౌలు రైతులకు రైతు భరోసా డబ్బు రావడం లేదు. బీమా చేయకపోవడంతో అతివృష్టి, అనావృష్టి సమయాల్లో పరిహారం అందడం లేదు. బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు. ఈ-క్రాప్‌ నమోదు లేక పంటను అమ్ముకోలేకపోతున్నారు. విత్తనాలు, ఎరువులు అందడం లేదు. ఇలా అన్ని రకాలుగా కౌలు రైతులు నష్టపోతున్నట్లు గుర్తించాం. ఈ సమస్యలను కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లాం

-గాడి బాలు, రైతు స్వరాజ్య వేదిక, సహ సమన్వరకర్త


చైతన్యం చేస్తున్నాం

కొంతమంది భూయజమానులు అపోహల్లో ఉన్నారు. కౌలుకు భూమి ఇచ్చినట్లు వివరాలు ఇవ్వడం వల్ల వారికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అందుకే కౌలు రైతుల చట్టంపై తరచూ అవగాహన కలిగిస్తున్నాం. కొత్త చట్టం వలన కౌలు రైతులకు ఎన్నో ప్రయోజనాలున్నాయి. ప్రభుత్వం రైతులకు అందిస్తున్న అన్ని రకాల సౌకర్యాలు వీరికి అందుతాయి. లక్ష్యం చేరడానికి కృషి చేస్తున్నాం.

- లీలావతి, జిల్లా వ్యవసాయ శాఖాధికారి


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు