logo

పల్లెల దశ తిరిగేలా స్వచ్చతలో మెరిసేలా ..

ఒక్కో అడుగు వేస్తుంటేనే చేరాల్సిన గమ్యం క్రమేపీ దగ్గరవుతుంది. కూర్చున్న చోటే ఉండిపోతే ఎన్నటికీ లక్ష్యాన్ని చేరుకోలేం.  ఈ స్ఫూర్తిని అనకాపల్లి జిల్లా కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి  పల్లెలకు వర్తింజేస్తున్నారు. స్వచ్ఛతలో జిల్లాను  రాష్ట్రస్థాయిలో అగ్రగామిగా నిలిపేందుకు  కార్యాచరణ రూపొందించారు.

Published : 24 Jun 2022 04:55 IST

కలెక్టర్‌ చొరవతో కార్యాచరణ ప్రారంభం

నర్సీపట్నం గ్రామీణం, నక్కపల్లి, న్యూస్‌టుడే

ధర్మసాగరంలో చెత్తనుంచి సంపద తయారీ కేంద్రం

ఒక్కో అడుగు వేస్తుంటేనే చేరాల్సిన గమ్యం క్రమేపీ దగ్గరవుతుంది. కూర్చున్న చోటే ఉండిపోతే ఎన్నటికీ లక్ష్యాన్ని చేరుకోలేం.  ఈ స్ఫూర్తిని అనకాపల్లి జిల్లా కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి  పల్లెలకు వర్తింజేస్తున్నారు. స్వచ్ఛతలో జిల్లాను  రాష్ట్రస్థాయిలో అగ్రగామిగా నిలిపేందుకు  కార్యాచరణ రూపొందించారు. క్షేత్రస్థాయిలో  వినూత్నంగా అమలుకు శ్రీకారం చుట్టారు.

జిల్లాలో 646 పంచాయతీలున్నాయి. 479 గ్రామాల్లో సంపద తయారీ కేంద్రాలు ఉన్నాయి. మిగతా చోట్ల వివిధ స్థాయిల్లో నిర్మాణంలో ఉన్నాయి. చెత్త సేకరణకు, నిర్వహణకు అవసరమైన సిబ్బంది, వాహనాలు ఉండటంతో తొలి విడతలో మండలానికో పంచాయతీని ఎంపిక చేసి ‘మన అనకాపల్లి - స్వచ్ఛ అనకాపల్లి’ పేరిట వారం రోజులుగా నుంచి స్వచ్ఛత పనులను ప్రారంభించారు. వారానికి 24 పంచాయతీలను ఎంపిక చేసి మార్గదర్శకాలకు అనుగుణంగా శుభ్రత కార్యక్రమాలను కొనసాగించనున్నారు.

పరిశుభ్రంగా ధర్మసాగరం గ్రామంలోని ఓ వీధి

 మొన్నటి వరకు వీధుల్లోని ఖాళీ స్థలాల్లో చెత్త గుట్టలు కనిపించేవి. వీటిని ఇప్పుడు దాదాపుగా తొలగించేశారు. కాలువల్లో ప్లాస్టిక్‌, గాజు సీసాలు విసిరేసే వారు. వీటినీ తొలగించారు. గతంలో నర్సీపట్నం మండలం ధర్మసాగరం, మాడుగుల మండలం పొంగలిపాక స్వచ్ఛతలో జాతీయ, రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందాయి. మధ్యలో కొంతకాలం కార్యక్రమాలు పడకేశాయి. మళ్లీ ఇప్పుడు పల్లెలను అందôగా ఉంచేలా, పచ్చదనం నింపేలా దృష్టిసారించారు. ఎంపికైన గ్రామాల్లో స్వచ్ఛత కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తున్నారో పరిశీలించేందుకు జాయింట్‌ కలెక్టర్‌, జిల్లా వైద్యఆరోగ్య అధికారి, జిల్లా పంచాయతీ అధికారిణి, నాతవరం ఎంపీడీవోలతో కమిటీ ఏర్పాటైంది. వీరు పరిశీలించి ర్యాంకులు ఇస్తారు. కలెక్టర్‌ స్ఫూర్తితో చాలా పంచాయతీల్లో స్వచ్ఛందంగానూ కార్యక్రమాలు మొదలయ్యాయి.

ఏం జరుగుతోందంటే..

 ప్రత్యేకంగా వాహనాలను సమకూర్చుకుని వీధుల్లో చెత్త గుట్టలన్నీ తొలగించి సంపద తయారీ కేంద్రాలకు తరలించారు. ఇక్కడ ప్లాస్టిక్‌, గాజు సీసాలు, పాలిథిన్‌ కవర్లను  వేరు చేశారు. వ్యర్థాలతో వానపాముల ఎరువు తయారీ చేపట్టారు. ఈ ఎరువు నాణ్యత ఉండేలా చూస్తున్నారు. కేజీ రూ.10 చొప్పున విక్రయానికి సిద్ధం చేశారు. పూలు, కూరగాయల పెంపకందారులు ఈ ఎరువును కొనుగోలు చేసి తీసుకువెళుతున్నారు. ఇంకుడు గుంతలను వినియోగంలోకి తీసుకువస్తున్నారు.

తొలి విడతలో ఎంపికైన ఇవే...

కోడూరు, హరిపాలెం, ఆర్‌.భీమవరం, జి.కోటపల్లి, గోవాడ, ఎం.అలమండ, చీడిగుమ్మల, వారాడ, అడ్డాం, అన్నవరం, పొంగలిపాక, గిడుతూరు, వెంకటాపురం, డీఎల్‌పురం, చెట్టుపల్లి, ఏపీపురం, పరవాడ, ఎస్‌.నరసాపురం, మూలజంప, గర్నికం, జేపీ అగ్రహారం వేమగిరి, ఆరిపాక, పురుషోత్తపురం.


అందరూ సహకరించాలి

స్వచ్ఛతలో రాష్ట్రస్థాయిలో అనకాపల్లిని మొదటిస్థానంలో నిలపాలన్నది ఆశయం. కలెక్టర్‌ ఆదేశాలకు అనుగుణంగా దశలవారీగా పంచాయతీలను అందంగా, శుభ్రంగా తీర్చిదిద్దుతాం. ఇప్పటికే 24 పంచాయతీల్లో ఈ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మిగతా వారు ఈ స్ఫూర్తిని అందిపుచ్చుకుని శ్రీకారం చుట్టారు. ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమానికి పౌరులు సహకరించాలి. వీధుల్లో, కాలువల్లో చెత్త వేయవద్దు.

- శిరీషారాణి, జిల్లా పంచాయతీ అధికారి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని