logo

ఎండల్లో మంట.. అలవెన్స్‌ల్లో కోత

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: మండుటెండల్లో బతకు బండిని లాగే ఉపాధి కూలీల వేతనాలకు కోతపడింది. ఒకపూట పనిచేస్తే అందే కూలీ డబ్బులు ఇప్పుడు రెండుపూటలూ చేస్తే తప్ప అందే పరిస్థితి కనిపించడంలేదని వీరంతా వాపోతున్నారు.

Published : 24 Jun 2022 04:55 IST

చెరువు తవ్వకం పనుల్లో కూలీలు

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: మండుటెండల్లో బతకు బండిని లాగే ఉపాధి కూలీల వేతనాలకు కోతపడింది. ఒకపూట పనిచేస్తే అందే కూలీ డబ్బులు ఇప్పుడు రెండుపూటలూ చేస్తే తప్ప అందే పరిస్థితి కనిపించడంలేదని వీరంతా వాపోతున్నారు.

జిల్లాలో ప్రతిరోజు 1.50లక్షల మంది కూలీలు ఉపాధి పనులు పనిచేస్తున్నారు. అచ్యుతాపురం మండలంలో 1600 మంది, రాంబిల్లిలో మూడు వేల మంది ఉపాధి కూలీలు  ఉన్నారు. వేసవి కావడం, వ్యవసాయ పనులు లేకపోవడంతో ఎక్కువమంది ఉపాధి కూలీ పనులకు వెళ్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రెండు పూటలు పనిచేయాలనే కొత్త నిబంధన తీసుకురావడంతో మండుటెండల్లో వీరంతా ఇబ్బంది పడుతున్నారు. ఉదయం 11 గంటల్లోగా ఒకటి, సాయంత్రం అయిదు గంటల్లోగా మరో ఫొటో తీసి ఉపాధి హామీ పథకం యాప్‌లో అప్‌లోడ్‌ చేసేలా నిబంధనలు సవరించారు. వంద రోజులు పని పూర్తిచేసిన కూలీలకు ఉచితంగా అందించే పలుగు, పారలు ఇవ్వడంలేదు. టెంట్లు ఏర్పాటు చేయకపోవడంతో కూలీలు సేదతీరే అవకాశం లేకుండా పోతోంది. గతంలో 10మంది కలిసి పనిచేసినా వేతనాలు అందించేలా ఉండే నిబంధనలు ఇప్పుడు 50మంది తప్పనిసరిగా ఉండేలా మార్చారు. మార్చి నుంచి జూన్‌ వరకు ఉపాధి కూలీలకు  వేసవి భత్యం అందించేవారు. దీన్ని ఎత్తివేయడంతో  అదనపు వేతనాలు అందక ఇబ్బంది పడుతున్నారు.

ఆడిట్‌ జరగని పనులు పక్కనపెట్టారు...

కొవిడ్‌ వల్ల రెండేళ్లుగా ఉపాధి పనులపై సామాజిక తనిఖీ చేపట్టలేదు. ఆడిట్‌ జరగని పనులు మళ్లీ చేస్తే ఈ ఏడాది జరిగే సామాజిక తనిఖీల్లో ఒకే పని రెండుసార్లు చేసినట్లు కనిపించే అవకాశం ఉంది. ఉపాధి అధికారులు గ్రామాలకు దూరంగా ఉండే పనులను గుర్తించి వాటిని చేపడుతున్నారు. అయిదు కిలోమీటర్లు దాటి ప్రయాణం చేస్తే చెల్లించాల్సిన రవాణా ఛార్జీలు సైతం ఈ ఏడాది నుంచి చెల్లించడంలేదని కూలీలు వాపోతున్నారు.


ఏడాదికి 200 రోజుల పని కల్పించాలి....

కొవిడ్‌ మూలంగా ప్రజలకు అన్నిరకాలైన ఉపాధి దూరమైంది. ఎక్కువమంది పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఏడాదికి 200రోజులు చేస్తే అందరికీ ప్రయోజనం.  గతంలో ఆడిట్‌ జరగని పనులు సైతం ఇప్పుడు పనులు చేపట్టాలి. వేసవి అలవెన్స్‌లు, రవాణా ఛార్జీలు, అందించి  ఆదుకోవాలి.

-రొంగలి రాము, సీఐటీయూ జిల్లా కార్యదర్శి, అచ్యుతాపురం.


 

రెండుపూటల పని కూలీలకే లాభం.....

ఉపాధి హామీ పథకంలో రెండు పూటలు పని వల్ల కూలీలకే అదనపు లాభం. కొవిడ్‌కు ముందు 100 రోజులు పనిచేసిన కూలీలకు పరికరాలు అందించేవారు. రెండేళ్లగా ఎవరికి ఇవి ఇవ్వడంలేదు. తాగునీరు అలవెన్స్‌ కూలీల ఖాతాల్లో రోజుకి రూ.అయిదు చొప్పున వేస్తున్నాం. గతంలో అందించిన టెంట్లు చాలావరకు చిరిగిపోవడంతో కొంత ఇబ్బంది వచ్చింది. సగటున రూ.220వరకు కూలీగిట్టుబాటు అవుతోంది.  

-శ్రీనివాస్‌, ఏపీఓ, జాతీయ ఉపాధిహామీ పథకం పథకం, అచ్యుతాపురం

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని