logo

వడ్డాది కూడలిలో తీరనున్న కష్టాలు

వడ్డాది నాలుగు రోడ్ల కూడలిలో ముంపు కష్టాలు తీరనున్నాయి. వర్షపు నీరు నిలిచిపోకుండా రోడ్డును ఎత్తు చేస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాలకు ఇది ప్రధానమైన కూడలి. విశాఖపట్నం, అనకాపల్లి, చోడవరం, నర్సీపట్నం వంటి ప్రధాన

Published : 24 Jun 2022 04:55 IST

చురుగ్గా రోడ్డు అభివృద్ధి పనులు

కూడలిలో రోడ్డును ఎత్తు చేసే పనులు

బుచ్చెయ్యపేట, న్యూస్‌టుడే: వడ్డాది నాలుగు రోడ్ల కూడలిలో ముంపు కష్టాలు తీరనున్నాయి. వర్షపు నీరు నిలిచిపోకుండా రోడ్డును ఎత్తు చేస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాలకు ఇది ప్రధానమైన కూడలి. విశాఖపట్నం, అనకాపల్లి, చోడవరం, నర్సీపట్నం వంటి ప్రధాన పట్టణాలకు వెళ్లే బస్సులు, ఇతర వాహనాలన్నీ వడ్డాది కూడలి మీద నుంచే తిరుగుతాయి. రాష్ట్ర రహదారి (ఎస్‌హెచ్‌-38)గా గుర్తింపు పొందిన బీఎన్‌ రోడ్డు ఈ కూడలి మీద నుంచే వెళ్తుంది. ఇంతటి ముఖ్యమైన కూడలిని దాటాలంటే ఇంతకాలం ప్రయాణికులందరూ ఎన్నో ఇబ్బందులు పడ్డారు. మాడుగుల వైపు రోడ్డు లోతట్టులో ఉంది. కాలువల సదుపాయం లేదు. రోడ్లపైనే మురుగు ప్రవహిస్తూ దుర్గంధం వెదజల్లుతోంది. వర్షం పడితే కూడలి అంతా పెద్ద తటాకాన్ని తలపిస్తుంది. వాహనచోదకులు, ప్రయాణికులందరూ నీటిలో నుంచి రాకపోకలు సాగించడానికి అవస్థలు పడుతున్నారు. నీరు నిలిచిపోవడంతో పెద్ద గుంతలు పడి రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. గుంతల్లో పడి వాహనచోదకులు ప్రమాదాలకు గురవుతున్నారు. రెండు వారాల కిందట రోడ్డు మధ్యలో ఉన్న పెద్ద గుంతలో పడి లారీ ఇరుక్కుపోయింది. కూడలిలో సమస్యలపై పత్రికల్లో కథనాలు రావడం, స్థానికుల ఆందోళనతో అధికారులు స్పందించారు. నీరు నిలిచిపోకుండా మాడుగుల వైపు రోడ్డును ఎత్తు చేస్తున్నారు. గుంతలను పూడ్పించి రోడ్డును పటిష్ఠం చేస్తున్నారు. రెండు, మూడు లేయర్లు వెట్‌మిక్స్‌ వేసి చదును చేస్తున్నారు. దీనిపై తారురోడ్డు వేయనున్నారు. రహదారికి ఇరువైపులా కాలువలు నిర్మించడానికి ఆక్రమణలు తొలగించడానికి చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే ఆర్‌అండ్‌బీ స్థలం సరిహద్దులను గుర్తించి ఆక్రమణదారులందరికీ నోటీసులు జారీ చేశారు. గురువారం నుంచి ఆక్రమణల తొలగింపు పనులు ప్రారంభించారు. అనకాపల్లి ఆర్డీఓ చిన్నికృష్ణ ఆక్రమణల తొలగింపు పనులను పరిశీలించారు. అధికారులకు అవసరమైన సూచనలు చేశారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని