logo

బదిలీలకు పైరవీలు

సాధారణ బదిలీలకు గడువు సమీపిస్తుండడంతో ఉద్యోగులు తమకు నచ్చిన చోటకు వెళ్లడానికి అన్నిరకాల ప్రయత్నాలు చేసుకుంటున్నారు. విద్య, వైద్యారోగ్య శాఖలు మినహా మిగతా శాఖలన్నింటా ఈ సందడి కనిపిస్తోంది. ముందు ఈనెల 17లోగా బదిలీలన్నీ పూర్తి చేయాలనుకున్నా ఎప్పటిలాగే మార్పులు,

Published : 25 Jun 2022 05:56 IST

సిఫార్సుల లేఖలతో ప్రయత్నాలు ముమ్మరం

ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం:

సాధారణ బదిలీలకు గడువు సమీపిస్తుండడంతో ఉద్యోగులు తమకు నచ్చిన చోటకు వెళ్లడానికి అన్నిరకాల ప్రయత్నాలు చేసుకుంటున్నారు. విద్య, వైద్యారోగ్య శాఖలు మినహా మిగతా శాఖలన్నింటా ఈ సందడి కనిపిస్తోంది. ముందు ఈనెల 17లోగా బదిలీలన్నీ పూర్తి చేయాలనుకున్నా ఎప్పటిలాగే మార్పులు, చేర్పులు చేస్తూ గడువు తేదీని ఈనెల 30కి పొడిగించారు. దీంతో మొదటిదశలో ప్రయత్నాలు చేయాలని ఉద్యోగులు కూడా ఈసారి తమకు తెలిసిన మార్గాల్లో ఉన్నతాధికారులపై ఒత్తిడి తేవడం మొదలుపెట్టారు. తూర్పుప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్‌)లో ఇప్పటికే ఓ కొలిక్కి వచ్చినా బదిలీల జాబితాను బయటపెట్టడం లేదు. కొద్దిరోజులుగా ఈ సంస్థలో పైరవీలు జోరందుకున్నాయి. విద్యుత్తు అధికారులకు కొన్ని ప్రాంతాల్లో పనులు తక్కువ.. వసూళ్లు ఎక్కువగా ఉంటాయి. ఆ ప్రాంతాలకే ఎక్కువ మంది వెళ్లాలని కోరుకుంటారు. దీనికోసం ఓ సంఘ నాయకుడు కొంతమంది దగ్గర వసూళ్లకు పాల్పడినట్లు సమాచారం. కీలక ప్రాంతాలకు వెళ్లడానికి కొందరు ఉవ్విళ్లూరుతుంటే, మరికొందరు ఇతరత్రా కారణాలు చూపి ఉన్న స్థానం నుంచి కదలకుండా చూసుకుంటున్నారు. మిగతా శాఖల్లో మొదటి విడత తయారు చేసిన బదిలీల జాబితాల్లో గడువు ముగిసే నాటికి మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ‘ఆర్డర్‌ టు సర్వ్‌’ పేరుతో కొత్త జిల్లాలకు వెళ్లిన ఉద్యోగులకు కూడా బదిలీలకు అవకాశం ఇచ్చారు. ఉమ్మడి జిల్లా ప్రాతిపదికనే బదిలీలు చేయాలన్నారు. ఉద్యోగ సంఘాల నేతలకు తొమ్మిదేళ్ల వరకు ఉన్నచోటనే కదలకుండా ఉండే అవకాశం కల్పించడం గమనార్హం. జాబితాల్లో మార్పుచేర్పులు జరగడంపై ఉద్యోగుల్లో కాసింత ఉత్కంఠ నెలకొంది.

జడ్పీలో జోరు..

ఎంపీడీవోలు మొదలుకొని ఆఫీస్‌ సబార్డినేట్‌ వరకు బదిలీల కోసం నేతలతో సిఫార్సులు చేయించుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో అయిదేళ్లు సర్వీసు పూర్తయిన ఎంపీడీవోలు ఒక్కరూ లేరు. కాకపోతే రిక్వెస్ట్‌ బదిలీలకు అవకాశం ఉండడంతో తమకు తెలిసిన నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలతో కొందరు మండలాలు మారడానికి ప్రయత్నిస్తున్నారు. అలాగే జడ్పీ కార్యాలయం నుంచి ఎంపీడీవో కార్యాలయాలు, హైస్కూళ్ల వరకు పరిపాలనాధికారులు (ఏవో) 21 మంది, సీనియర్‌ అసిస్టెంట్లు 38, జూనియర్‌ అసిస్టెంట్లు 70 మంది, టైపిస్టులు 18 మంది.. మిగతా సిబ్బంది అంతా కలిపి 277 మంది అయిదేళ్ల సర్వీసు పూర్తయిన వాళ్లున్నారు. వీరిలో కొంతమంది ఇప్పటికే ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలతో, మరికొందరేమో సంఘ నేతలతో సొమ్ములు ముట్టజెప్పడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. జడ్పీ సీఈవో విజయ్‌కుమార్‌ వద్ద ప్రస్తావించగా పైరవీలకు ఆస్కారం లేకుండా బదిలీలు చేపట్టనున్నామని, సొమ్ములు వసూలు చేసినట్లు తమ దృష్టికి రాలేదన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని