logo

ప్రమాదరహితమే అభిమతం

జిల్లాలోని రహదారులు కొన్నాళ్లుగా నెత్తురోడుతున్నాయి.. రోజూ ఎక్కడో ఒక చోట ప్రమాదం చోటుచేసుకుంటూనే ఉన్నాయి. వీటిలో ఏటా వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు.. వేల మంది క్షతగాత్రులవుతున్నారు. ఈ ప్రమాదాలను కట్టడి చేయడానికి ఎస్పీ గౌతమి సాలి నేతృత్వంలో పోలీసు శాఖ ప్రత్యేక కసరత్తు చేస్తోంది.

Published : 25 Jun 2022 05:56 IST

ట్రిపుల్‌-ఈతో దుర్ఘటనలకు చెక్‌

ఈనాడు డిజిటల్‌, అనకాపల్లి

జిల్లాలోని రహదారులు కొన్నాళ్లుగా నెత్తురోడుతున్నాయి.. రోజూ ఎక్కడో ఒక చోట ప్రమాదం చోటుచేసుకుంటూనే ఉన్నాయి. వీటిలో ఏటా వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు.. వేల మంది క్షతగాత్రులవుతున్నారు. ఈ ప్రమాదాలను కట్టడి చేయడానికి ఎస్పీ గౌతమి సాలి నేతృత్వంలో పోలీసు శాఖ ప్రత్యేక కసరత్తు చేస్తోంది.

గడిచిన రెండేళ్లలో ఏయే రహదారులపై ఎన్ని ప్రమాదాలు జరిగాయి..వాటిలో తీవ్రమైనవి ఎన్ని.. ప్రమాదాలకు గల కారణాలు..ఆయా చోట్ల ఏంచేస్తే ప్రమాదాలు తగ్గుతాయో వంటి అంశాలపై శాస్త్రీయంగా అధ్యయనం చేశారు. వాటిని ఇటీవల కలెక్టర్‌కు పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కావాల్సిన చర్యలను వెంటనే తీసుకోవాలని కలెక్టర్‌ సూచిస్తూ ఓ కమిటీని నియమించారు. ప్రస్తుతం ఆ కమిటీ ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను పరిశీలించి నష్ట నివారణ చర్యలకు ఉపక్రమిస్తున్నారు.. ఇంజినీరింగ్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌, ఎడ్యుకేషన్‌ అనే ‘ట్రిపుల్‌-ఈ’ నినాదంతో మూడు నెలల గడువు నిర్దేశించుకుని ముందుకు వెళుతున్నారు.

మొదటి విడతగా 37 ప్రాంతాలపై గురి..

గత రెండేళ్లలో ఒకేచోట ఎనిమిది కంటే ఎక్కువ ప్రమాదాలు జరిగిన ప్రాంతాలపై మొదటిగా దృష్టిసారించారు. ఇలాంటివి జిల్లా పరిధిలో 37 ఉన్నాయి. ఆయా చోట్లకు డ్రోన్లను పంపించి ఏరియల్‌ వ్యూ చిత్రాలు తీయించారు. జియో కోర్డినేట్స్‌ నమోదు చేయించి ఆ ప్రాంతాల్లో ప్రమాదాలు జరగడానికి కారణాలేంటో గుర్తించారు. వాటిని అధిగమించడానికి ఏం చర్యలు తీసుకోవాలో సూచిస్తూ ఓ వెబ్‌ లింక్‌ సృష్టించారు. ఆ లింక్‌ తెరిచి బ్లాక్స్‌ ఉన్నచోట క్లిక్‌చేస్తే ఆ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాద చరిత్ర మొత్తం ఆన్‌లైన్‌లోనే తెలుసుకునేలా ఏర్పాటు చేశారు.

పగటి వేళే ఎక్కువ

సాధారణంగా రాత్రి వేళల్లో ఎక్కువ ప్రమాదాలు జరుగుతుంటాయంటారు. జాతీయ రహదారిపై ఏ సమయంలో ఎక్కువ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని 382 కేసులను పోలీసులు విశ్లేషించారు. అందులో ఎక్కువ భాగం పగటి వేళలు, పని కాలం, రద్దీ సమయాల్లోనే చోటుచేసుకుంటున్నట్లు గుర్తించారు. జాతీయ రహదారిని అనుసంధానిస్తూ ఉన్న గ్రామ కూడళ్ల వద్దే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్నిచోట్ల లైట్లు లేకపోవడం.. సిగ్నల్‌ లైట్స్‌ సమస్య.. ఆక్రమణలు.. ఎడమవైపు తిరిగే రోడ్డు సక్రమంగా లేకపోవడం.. అనధికారికంగా డివైడర్ల తొలగింపు.. కూడళ్ల వద్ద స్పీడ్‌బ్రేకర్లు, జీబ్రా లైన్లు లేకపోవడాన్ని గుర్తించారు.

సమన్వయంతో కట్టడి..:

రోడ్డు ప్రమాదాలు నియంత్రించడానికి కసరత్తు మొదలెట్టా. కారణమేంటో తెలుసుకోవడానికి సుమారు రెండు నెలల పాటు అధికారులంతా శ్రమించారు. ఈ రెండేళ్లలో జరిగిన ప్రమాదాల వివరాలన్నీ పరిశీలించి నివేదిక తయారుచేశాం. ఇటీవలే కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లాం. మా సూచనలకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. పోలీసు, ర.భ.శా., జాతీయరహదారులు, రెవెన్యూ, రవాణా శాఖలతో కలిపి కమిటీని నియమించారు. ఈ శాఖలతో సమన్వయం చేసుకుని ప్రమాదరహితంగా మార్చబోతున్నాం. ముందుగా గుర్తించిన 37 ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నాం. రెండో దశలో మిగతా ప్రాంతాలపై దృష్టిసారిస్తాం.. - గౌతమి సాలి, ఎస్పీ, అనకాపల్లి

లంకెలపాలెం కూడలిలో ప్రమాదాలకు గల కారణాలను పరిశీలిస్తున్న రహదారి భద్రతా కమిటీ సభ్యులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని