logo

వచ్చే రెండేళ్ల పాలన మీ చేతుల్లోనే..

‘పార్టీలో గుర్తింపు లేదని ఎవరూ బాధపడొద్ధు ఈ రెండేళ్లు పాలనంతా మీ చేతుల మీదుగానే జరుగుతుంది. అందరూ కలిసి పనిచేస్తే గత ఎన్నికల్లో సాధించిన మెజార్టీ కంటే ఎక్కువ ఓట్లతో విజయం సాధిస్తాం. పేటలో మళ్లీ వైకాపా జెండానే ఎగురుతుంద’ని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు,

Published : 25 Jun 2022 05:56 IST

నేతలతో జిల్లా వైకాపా అధ్యక్షుడు ధర్మశ్రీ


ప్లీనరీలో మాట్లాడుతున్న జిల్లా వైకాపా అధ్యక్షుడు ధర్మశ్రీ

కోటవురట్ల, న్యూస్‌టుడే: ‘పార్టీలో గుర్తింపు లేదని ఎవరూ బాధపడొద్ధు ఈ రెండేళ్లు పాలనంతా మీ చేతుల మీదుగానే జరుగుతుంది. అందరూ కలిసి పనిచేస్తే గత ఎన్నికల్లో సాధించిన మెజార్టీ కంటే ఎక్కువ ఓట్లతో విజయం సాధిస్తాం. పేటలో మళ్లీ వైకాపా జెండానే ఎగురుతుంద’ని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ పేర్కొన్నారు. పేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు అధ్యక్షతన నియోజకవర్గ ప్లీనరీ కోటవురట్ల మండలం రామచంద్రాపురం శివారు అల్లుమియ్యపాలెం వెళ్లే దారిలోని శ్రీపతిరాజు మామిడి తోటలో శుక్రవారం జరిగింది. ముఖ్య అతిథిగా ధర్మశ్రీ మాట్లాడుతూ.. కష్టపడి పని చేసే వారికి ఇకపై గుర్తింపు ఉంటుందన్నారు. బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు జమచేయడం ఇక ఉండదని, నాయకుల చేతుల మీదుగానే లబ్ధిదారులకు అందజేస్తారన్నారు. గతంలో ఏ పార్టీ చేయని విధంగా వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతీ నియోజకవర్గానికి రూ.800 కోట్ల విలువైన అభివృద్ధి, సంక్షేమ ఫలాలను అందించడం జరిగిందన్నారు. నాయకులు, కార్యకర్తల మనోభావాలకు విలువిస్తూ వారి సమస్యలను తెలుసుకునేందుకు ప్లీనరీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పార్టీ దృష్టిలో అందరూ సమానమేనని, బేధాభిప్రాయాలు లేకుండా అందరూ పనిచేయాలని సూచించారు. ఎంపీ బీవీ సత్యవతి మాట్లాడుతూ.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుకు నిధుల కోసం పార్లమెంటులో అడుగుతుండటం ప్రతిపక్ష పార్టీలకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. రహదారుల నిర్మాణ పనులు జరుగుతున్నాయని, కొన్నిచోట్ల పూర్తయ్యాయని చెప్పారు. ప్రతి కుటుంబంలో కలహాలుంటాయి. కష్టపడిన వారికి గుర్తింపు ఇవ్వడంతోపాటు నాయకులు, కార్యకర్తలకు అందుబాటులో ఉండి అందర్నీ కలుపుకొనిపోతే అన్నీ సర్దుకుంటాయని ఎస్‌.రాయవరం ఎంపీపీ బొలిశెట్టి శారదాకుమారి సూచించారు. జిల్లా, నియోజకవర్గ పరిశీలకులు వెంకట్రావు, దిలీప్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్సీ డీవీ సూర్యనారాయణరాజు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, ముఖ్యనాయకులు ప్రసంగించారు. అనంతరం శ్రీపతిరాజును సన్మానించారు. వైకాపా రాష్ట్ర అదనపు కార్యదర్శి దత్తుడు సీతబాబురాజు, కోటవురట్ల జడ్పీటీసీ సభ్యురాలు ఉమాదేవి, పైల రమేష్‌, సర్పంచి చిన్న, నక్కపల్లి, ఎస్‌.రాయవరం, పాయకరావుపేట మండలాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.

జెండా మోసిన వారికి గుర్తింపేదీ?

కోటవురట్ల, న్యూస్‌టుడే: ‘పార్టీ ఆవిర్భావం నుంచి జెండాలు మోస్తూనే ఉన్నాం. ప్రతిపక్ష నేతగా జగన్‌ పాదయాత్ర చేపట్టిన నాటి నుంచి ముఖ్యమంత్రి అయ్యేంత వరకు విశ్రమించలేదు. అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో పార్టీ కోసం కష్టపడిన వారికి ఏనాడైనా గుర్తింపు ఇచ్చారా?’ అని పలువురు నాయకులు గళమెత్తారు. వైకాపా ప్లీనరీలో పాయకరావుపేట జడ్పీటీసీ సభ్యుడు సూరిబాబు మాట్లాడుతూ.. 2024లో పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకువచ్చేందుకు కష్టపడి పనిచేయాలని చెబుతున్నారే తప్ఫ. ఒక్కరైనా కార్యకర్తల బాగోగులు గురించి ఆలోచించారా అని ప్రశ్నించారు. గ్రామ వాలంటీర్ల దగ్గరా విలువ లేకపోతే ఎలా అని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలోకి నిన్న, మొన్న వచ్చిన వారికి గుర్తింపు ఇస్తున్నారే తప్ఫ. మొదట్నుంచీ జెండాలు మోసిన వారి సంగతేంటని నక్కపల్లి మండల నాయకుడు వీసం రామకృష్ణ ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని