logo

ఉప్పుటేరులో మత్స్యసంపదకు ముప్పు

రాష్ట్రంలో అతిపెద్ద మత్స్యకార గ్రామమైన పూడిమడక ఉప్పుటేరులో శుక్రవారం భారీగా చేపలు చనిపోయి తేలాయి. ఈ ఏడాది జనవరి 30న ఉప్పుటేరులో అధిక సంఖ్యలో చేపలు చనిపోయిన సంఘటన మరవకముందే మరోసారి ఇలాగే జరగడంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు.

Published : 25 Jun 2022 05:56 IST

పూడిమడక ఉప్పుటేరులో భారీగా చనిపోయి తేలుతున్న చేపలు

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో అతిపెద్ద మత్స్యకార గ్రామమైన పూడిమడక ఉప్పుటేరులో శుక్రవారం భారీగా చేపలు చనిపోయి తేలాయి. ఈ ఏడాది జనవరి 30న ఉప్పుటేరులో అధిక సంఖ్యలో చేపలు చనిపోయిన సంఘటన మరవకముందే మరోసారి ఇలాగే జరగడంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. 20 వేల జనాభా ఉండే పూడిమడకలో సముద్రంతోపాటు ఉప్పుటేరులో చేపలవేట సాగిస్తూ వందలాది మంది మత్స్యకారులు జీవనోపాధి పొందుతారు. ఉప్పుటేరు నుంచి వచ్చే నీరుతో 300 దళిత కుటుంబాల రైతులు ఉప్పు పండిస్తారు. అధిక సంఖ్యలో చేపలు చనిపోయి తేలిపోవడంతో మత్స్యకారులు, ఉప్పును పండించే రైతులు ఆందోళన చెందుతున్నారు. పరిశ్రమలు విడుదల చేస్తున్న వ్యర్థాల వల్లో లేక ఉప్పుటేరును ఆనుకొని అనధికారంగా నిర్వహిస్తున్న రొయ్యల చెరువుల వ్యర్థాల వల్లో ఈ ఘటన జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. గతంలో చేపలు ఇదేవిధంగా చనిపోయినప్పుడు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు నమూనాలు సేకరించినా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. దీంతో ఇలాగే పునరావృతమైందని గ్రామానికి చెందిన భాజపా నాయకుడు మేరుగు రాజుబాబు ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం స్పందించదా?: తెదేపా

సెజ్‌లోని ఫార్మా, రసాయన కంపెనీల వ్యర్థాలను శుద్ధి చేయకుండా నేరుగా సముద్రంలోకి, ఉప్పుటేరులోకి విడుదల చేస్తున్నారని తెదేపా మత్స్యకార నాయకుడు మేరుగు బాపునాయుడు, టీఎన్‌టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పొన్నమళ్ల కొండబాబు ఆందోళన వ్యక్తంచేశారు. ఉప్పుటేరులో చేపలు అధిక సంఖ్యలో చేపలు చనిపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఉప్పుటేరు వద్ద తెదేపా ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. భారీ సంఖ్యలో చేపలు చనిపోయినా కాలుష్య నియంత్రణ అధికారులు, జిల్లా యంత్రాంగం పట్టించుకోకపోవడం దుర్మార్గమైన చర్య అన్నారు. వైకాపాకు అధికారాన్ని అందించిన మత్స్యకారులకు ఇంత అన్యాయం జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఏమిటని నాయకులు ప్రశ్నించారు. ప్రభుత్వం స్పందించకుంటే న్యాయం కోసం కోర్టుకు వెళ్తామని నాయకులు ప్రకటించారు. తెదేపా మత్స్యకార నాయకులు మేరుగు వెంకటరావు, మేరుగు మహేష్‌, యజ్జల శ్రీరామ్‌, కోదండరావు, తాతాజీ, రమణ, ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని