logo

ఒక సెంటులో గ్రావెల్‌ దందా

‘ఒక సెంటు’ ఇళ్ల పట్టాలకు కేటాయించిన కొన్ని స్థలాలు గ్రావెల్‌ దందాకు కేంద్రంగా మారాయి. కొండ వాలు ప్రాంతాల్లో వేసిన లేఅవుట్లపై అక్రమార్కుల కన్ను పడడంతో ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. కొన్ని చోట్ల లేఅవుట్లు చదును చేసే పేరుతో తవ్వేసి అమ్ముకుంటున్నారు.

Published : 25 Jun 2022 05:56 IST

హద్దు రాళ్లు తొలగించి అక్రమంగా తరలింపు

-ఈనాడు, విశాఖపట్నం, న్యూస్‌టుడే, ఆనందపురం, సబ్బవరం

ఆనందపురం మండలం గండిగుండం లేఅవుట్‌కు సమీపంలో తరలింపునకు సిద్ధం చేసిన గ్రావెల్‌

‘ఒక సెంటు’ ఇళ్ల పట్టాలకు కేటాయించిన కొన్ని స్థలాలు గ్రావెల్‌ దందాకు కేంద్రంగా మారాయి. కొండ వాలు ప్రాంతాల్లో వేసిన లేఅవుట్లపై అక్రమార్కుల కన్ను పడడంతో ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. కొన్ని చోట్ల లేఅవుట్లు చదును చేసే పేరుతో తవ్వేసి అమ్ముకుంటున్నారు.

ఆనందపురం మండలం గండిగుండంలో వీఎంఆర్‌డీఏ (విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ) ఒక సెంటు ప్లాట్లు అభివృద్ధి చేసింది. సుమారు 15 ఎకరాల్లో 400 ప్లాట్లు వేశారు. కొండ వాలు ప్రాంతమైనా చదును చేసి ఒక సెంటు ప్లాట్లుగా విభజించి సరిహద్దు రాళ్లు ఏర్పాటు చేశారు. కొద్ది రోజులుగా ఈ ప్లాట్లు వేసిన కొండ వాలును కొందరు తవ్వేస్తున్నారు. గతంలో అక్కడ వేసిన హద్దు రాళ్లు చాలా వరకు ఇప్పుడు కనిపించడం లేదు. ఆ పరిసరాల్లో ఎక్కడ చూసినా పొక్లెయిన్‌తో తవ్విన ఆనవాళ్లున్నాయి. రోడ్డు నిర్మాణానికి అని చెబుతున్నా అలా లేదక్కడ. రాత్రిళ్లు తరలించేందుకు లేఅవుట్‌కు మరో వైపు గుట్టలుగుట్టలుగా రోడ్డు పక్కనే నిల్వ చేశారు. గ్రామ శివారున ఈ ప్రాంతం ఉండడంతో వాహనాల రాకపోకలకు ఏర్పాట్లు చేసి పట్టుకుపోతున్నారు. సమీపంలోని కొన్ని ప్రైవేటు లేఅవుట్లలోకి తరలిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. మరో చోట గ్రావెల్‌కు అనుమతి తీసుకొని ఇక్కడి నుంచి తీసుకువెళ్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. కేవలం గ్రావెల్‌ కోసమే ఇక్కడ తవ్వకాలు చేపడుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. చదును చేయడానికయితే కొండ వాలును తవ్వి మట్టి కింద వేసి లెవెలింగ్‌ చేయాలి. ఆ పరిస్థితులూ లేవు.

పెందుర్తి మండలం ముదపాకలో కేటాయించిన లేఅవుట్ల వద్దా అదే పరిస్థితి. ఇక్కడి కొండవాలు ప్రాంతం నుంచి అక్రమంగా గ్రావెల్‌ తీసుకువెళ్తున్నారు. అధికారులకు సైతం ఫిర్యాదులు అందాయి. పరవాడ మండలంలోనూ గతంలో మట్టి తరలించారు.

సబ్బవరం మండలం గంగవరం ప్రాంతంలో ఒక సెంటు ఇళ్ల స్థలాలకు కేటాయించిన లేఅవుట్‌ నుంచి కొద్ది రోజులుగా మట్టి అక్రమంగా తరలిపోతుంది. ఇక్కడ అనధికారికంగా సాగుతున్న తవ్వకాలకు అడ్డే లేదు. ఈ లేఅవుట్‌లో 9 వేల ప్లాట్లు ప్రతిపాదించారు. కొన్ని చోట్ల హద్దు రాళ్లు వేయగా మరికొన్ని చోట్ల పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో వచ్చే మట్టిని కొందరు పట్టుకుపోతున్నారు. పలువురు అక్రమంగా తవ్వేస్తుండడంతో కొద్ది రోజుల కిందట పోలీసులు గస్తీ నిర్వహించారు. ఆ తరువాత పరిస్థితి మొదటికి వచ్చేసింది.

నగర శివారు ప్రాంతాల్లో కొన్ని ప్రైవేటు లేఅవుట్లకు చెందిన వ్యక్తులు గ్రావెల్‌ను వాహనాల్లో తరలిస్తుండగా.. మరికొందరు నిల్వ చేస్తున్నారు. అధికారులు చూసీచూడనట్లు వదిలేయడంతో వారి అక్రమాలకు అంతే లేకుండా పోతోందనే విమర్శలొస్తున్నాయి. ఆనందపురం, సబ్బవరం, అనకాపల్లి, పెందుర్తి మండలాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని