logo

అంతే .. అక్కడితో సరి

నగరంలో మహిళల భద్రతకు వీలుగా ప్రవేశపెట్టిన పలు సౌకర్యాలను పూర్తిస్థాయిలో విస్తరించటం లేదు. బస్‌స్టాండు, రైల్వేస్టేషన్‌, విమానాశ్రయాలకు నిత్యం వచ్చే వారిలో మహిళలు, వృద్ధులు సురక్షితంగా గృహాలకు చేరుకోవటానికి తీసుకుంటున్న చర్యలు పకడ్బందీగా లేవు.

Published : 25 Jun 2022 05:56 IST

రైల్వేస్టేషన్లోనే  ‘ప్రీపెయిడ్‌ ఆటోలు’

అమలుకాని విస్తరణ ఆలోచనలు

ఈనాడు, విశాఖపట్నం, రైల్వేస్టేషన్‌, న్యూస్‌టుడే

విశాఖ రైల్వేస్టేషన్లో ప్రీపెయిడ్‌ ఆటోస్టాండ్‌

నగరంలో మహిళల భద్రతకు వీలుగా ప్రవేశపెట్టిన పలు సౌకర్యాలను పూర్తిస్థాయిలో విస్తరించటం లేదు. బస్‌స్టాండు, రైల్వేస్టేషన్‌, విమానాశ్రయాలకు నిత్యం వచ్చే వారిలో మహిళలు, వృద్ధులు సురక్షితంగా గృహాలకు చేరుకోవటానికి తీసుకుంటున్న చర్యలు పకడ్బందీగా లేవు.

రైల్వేస్టేషన్లోనే పోలీసులు ‘ప్రీపెయిడ్‌ ఆటో స్టాండ్‌’ను ఏర్పాటు చేశారు. అక్కడికి వచ్చే ప్రయాణికులు ఎక్కడికి వెళ్లాలో చెబితే ఆటో కేటాయించి.. ఎంత చెల్లించాలన్నది రాసిస్తారు. తమ దగ్గరున్న రికార్డులో ప్రయాణికులకు కేటాయించిన ఆటో నెంబరు, డ్రైవర్‌పేరు నమోదు చేసుకుంటారు. ఈ విధానం మహిళలకు అత్యంత ఉపయుక్తంగా మారింది. నిత్యం దాదాపు వెయ్యి మంది ఈ సేవలను ఉపయోగించుకుంటున్నట్లు అంచనా.

 ప్రయాణికులు ఆట్లో ఏమైనా వస్తువులు మరచిపోతే డ్రైవర్లు ‘ప్రీపెయిడ్‌ ఆటోస్టాండ్‌’లో ఇస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. నాలుగోపట్టణ ట్రాఫిక్‌ పోలీసుస్టేషన్‌ నుంచి షిఫ్టుకు ఇద్దరు చొప్పున విధులు నిర్వహిస్తూ.. 24 గంటలూ ఈ సేవలు అందిస్తున్నారు. రాత్రి పది దాటిన తరువాత నగరానికి వచ్చే మహిళలకు ‘ప్రీపెయిడ్‌ ఆటో స్టాండ్‌’ ఎంతగానో ఉపయోగపడుతోందని చెబుతున్నారు.

ఈ తరహా సేవలు మరిన్ని ప్రాంతాలకు విస్తరించాలని అధికారులు భావించారు. ఏళ్లు గడుస్తున్నా ఆ ప్రతిపాదనలు మాత్రం సాకారం కావడంలేదు. రైల్వేస్టేషన్‌లో కూడా జ్ఞానాపురం వైపు ఈ సౌకర్యం లేదు.

ఇక్కడ మూతపడ్డాయి: 

గతంలో ద్వారకా బస్‌కాంప్లెక్స్‌లో పోలీసులే ఆటోల్లో ప్రయాణికుల్ని పంపే విధానం అమలు చేశారు. కాలక్రమంలో దాన్ని నిలిపివేశారు. మళ్లీ పునరుద్ధరించలేదు. ప్రీపెయిడ్‌ ఆటోస్టాండు విశాఖ విమానాశ్రయంలోనూ కొంతకాలం కొనసాగింది. కొవిడ్‌ సమయంలో దాన్ని ఆపారు. పునరుద్ధరించాలనే సూచనలూ వస్తున్నాయి. ప్రయాణికుల భద్రత నిమిత్తం పోలీసులు ‘అభయం’ పేరిట ఒక ఉపకరణాన్ని ఆటోల్లో అమరుస్తున్నారు. ప్రయాణికులు ఆటోల్లో ఉన్నప్పుడు.. ఆపదలో ఉన్నామని భావిస్తే ఉపకరణంలోని బటన్‌ను నొక్కితే చాలు ...క్షణాల్లో సమాచారం అంది సత్వరం పోలీసులు వస్తారు. ఒక్కసారి మీటనొక్కితే మళ్లీ పోలీసులు అనుమతిస్తేనే ఆటో ఇంజిన్‌ పని చేస్తుంది. నగరంలో 30వేలకు పైగా ఆటోలుండగా ఇప్పటివరకు కేవలం 6,800 ఆటోల్లోనే ‘అభయం’ ఏర్పాటు చేశారు.

దిశా పెట్రోలింగ్‌: 

మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకుని 9 అధునాతన జీపులు, 23 ద్విచక్రవాహనాలను పోలీసులు సమకూర్చారు. వీటిపై నగరవ్యాప్తంగా తిరుగుతూ పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నారు. కంట్రోల్‌ రూమ్‌ నుంచి వచ్చే ఆదేశాల మేరకు ఘటనా స్థలాలకు వెళ్తున్నారు. రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజాము ఐదు గంటల వరకు ‘పహారా’ పేరిట నగరంలోని 16చోట్ల ఇద్దరు చొప్పున కానిస్టేబుళ్లను అందుబాటులో ఉంచుతున్నా వారెక్కడుంటారనే అంశంపై మాత్రం సరైన ప్రచారం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని