logo

అందుబాటులోకి అమృత్ సరోవరాలు

స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తిచేసుకుంటున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ను నిర్వహిస్తోంది. అందులో భాగంగా అన్నిశాఖల పరిధిలోనూ ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతున్నారు. తాజాగా పల్లెసీమలకు, పాడిపంటలకు జీవనాధారమైన సాగునీటి చెరువులను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.

Published : 28 Jun 2022 06:32 IST

సాగునీటి వనరుల అభివృద్ధి 

ఉపాధిహామీ నిధులతో తటాకాలకు కొత్తరూపు

ఈనాడు డిజిటల్‌, అనకాపల్లి, న్యూస్‌టుడే, చోడవరం

చెరువు పనులపై క్షేత్రస్థాయి పరిశీలన చేస్తున్న డ్వామా పీడీ సందీప్‌, ఇతర అధికారులు (పాత చిత్రం)

స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తిచేసుకుంటున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ను నిర్వహిస్తోంది. అందులో భాగంగా అన్నిశాఖల పరిధిలోనూ ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతున్నారు. తాజాగా పల్లెసీమలకు, పాడిపంటలకు జీవనాధారమైన సాగునీటి చెరువులను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.

అమృత్‌ సరోవర్‌ నిర్మాణ్‌ పేరుతో ఒక్కో జిల్లాకు 75 చెరువులు చొప్పున గుర్తించారు. ఉపాధిహామీ పథకంలోనే వీటిని చక్కదిద్దనున్నారు. ఈ మేరకు ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలోని సాగునీటి వనరుల్లో చేయాల్సిన పనులకు సంబంధించి అంచనాలు సిద్ధం చేస్తున్నారు.

జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో ఇప్పటికే సాగునీటి చెరువులు, వనరుల మట్టి పనులు చేపడుతున్నారు. వీటికి అదనంగా అమృత్‌ సరోవర్‌లో మరికొన్ని కొత్త చెరువులు తవ్వుతారు. కొన్ని పాతవాటిని పునరుద్ధరిస్తారు. జలవనరుల శాఖ, స్థానిక నేతలు సిఫార్సు చేసిన సాగునీటి వనరులనే పరిగణనలోకి తీసుకున్నారు. అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో 75 చెరువులు చొప్పున గుర్తించారు. విశాఖ జిల్లాలో నాలుగు మండలాలే ఉండడంతో ఒక్కో మండలంలో నాలుగైదు చెరువులనే గుర్తించగలిగారు. ఒక్కో చెరువుపై రూ.10 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు ఖర్చు చేయనున్నారు. అనకాపల్లి జిల్లాలో రూ.40 లక్షలు అంచనా విలువ దాటిన పనులు 10 వరకు ఉన్నాయి. మిగతా చెరువులన్నీ ఇదివరకు పనిచేసినవే కావడంతో రూ.10 లక్షల లోపే ఖర్చవుతుందని అంచనా వేశారు. ఈ పనుల వల్ల పాత ఆయకట్టు స్థిరీకరణతో పాటు కొత్త ఆయకట్టును సృష్టించనున్నారు.

ఎలా చేస్తారంటే..?

కనీసం ఎకరం విస్తీర్ణం ఉండాలి.

చెరువులో 10 వేల క్యూబిక్‌ మీటర్లకు పైగా మట్టి పనిచేసే విధంగా ఉండాలి.

పాత చెరువైతే తుప్పలు, పొదలు తొలగిస్తారు.. చెరువు గర్భంలో పూడిక తీస్తారు.. గట్లు పటిష్ఠపరుస్తారు.

అమృత్‌ సరోవర్‌ నిర్మాణ్‌లో నిధులన్నీ ఉపాధిహామీ పథకం నుంచి ఖర్చుచేస్తారు. అయితే కేవలం వేతనాల రూపంలోనే చెల్లిస్తారు. మెటీరియల్‌ పనులు చేయరు.

కొత్తవాటికే ప్రాధాన్యం

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా చేపడుతున్న చెరువుల కావడంతో వీటిపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నారు. ఇప్పటికే ఉన్నవాటిలో పనులు చేయడం కంటే కొత్త చెరువులు తవ్వడానికి ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి జలవనరులు, డ్వామా అధికారులకు, తహసీల్దార్లకు సూచించారు. క్షేత్రస్థాయిలో కొన్ని స్థలాలను తహసీల్దార్లు పరిశీలించి స్థానికులకు అన్నివిధాలా ఉపయోగం ఉన్నవాటినే అమృత్‌ సరోవర్‌లోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఉపాధిహామీ చేపడుతున్న పనులకు భిన్నంగా ఈ చెరువులను అభివృద్ధి చేయనున్నారు. ఉపాధి పనులను పరిశీలించడానికి ఏటా కేంద్ర బృందాలు జిల్లాకు వస్తుంటాయి. ఇకపై వచ్చే బృందాలు ఈ చెరువులను పరిశీలించడానికే ప్రాధాన్యం ఇవ్వనున్నాయి. అందుకే ఈ సాగునీటి వనరులను బాగా తీర్చిదిద్దనున్నారు. అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో చెరువులన్నింటికీ అంచనాలు పూర్తయ్యాయని డ్వామా పీడీ సందీప్‌ వెల్లడించారు. వచ్చే నెలలో వీటిని కార్యరూపంలోకి తీసుకురానున్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని