logo

దేశానికే ఆదర్శంగా అమ్మఒడి

పేదలు తమ బిడ్డలను చదివించడానికి పడుతున్న కష్టాలను పాదయాత్రలో కళ్లారాచూసిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డి వాటిని తీర్చేందుకే అమ్మఒడి పథకానికి శ్రీకారం చుట్టారని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు.

Published : 28 Jun 2022 06:32 IST

మంత్రులు ముత్యాలనాయుడు, అమర్‌

 1,58,772 మంది విద్యార్థులకు రూ. 238.15 కోట్ల లబ్ధి పంపిణీ


అమ్మఒడి నగదు చెక్‌ పంపిణీ చేస్తున్న ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు,

మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ చిత్రంలో ఎంపీ సత్యవతి,

కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి, వైకాపా జిల్లా అధ్యక్షులు కరణం ధర్మశ్రీ

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: పేదలు తమ బిడ్డలను చదివించడానికి పడుతున్న కష్టాలను పాదయాత్రలో కళ్లారాచూసిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డి వాటిని తీర్చేందుకే అమ్మఒడి పథకానికి శ్రీకారం చుట్టారని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. ఈ పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు. మూడోవిడత లబ్ధి కింద 1,58,772 మంది విద్యార్థులకు రూ. 238.15 కోట్లు మంజూరయ్యాయి. సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఈ నగదు చెక్‌ను మంత్రులు పంపిణీ చేశారు. ముత్యాలనాయుడు మాట్లాడుతూ విద్యాదీవెన, వసతి దీవెన పథకాలతో విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోవడానికి సీఎం జగన్‌ అవకాశాలు కల్పిస్తున్నారని వెల్లడించారు. మంత్రి అమర్‌ మాట్లాడుతూ నాడు-నేడు పథకంలో 45 వేలకు పైగా పాఠశాలలను బాగుచేసినట్లు వివరించారు. విద్యార్థులకు అందిస్తున్న సహకారాన్ని వినియోగించుకుని ఉన్నత విద్య అభ్యసించి ప్రయోజకులవ్వాలని ఆకాక్షించారు. మేనమామగా రాష్ట్రంలోని ప్రతి విద్యార్థిని ఆదుకునేలా సీఎం జగన్‌ ప్రత్యేక చొరవ చూపుతున్నారన్నారు. ఎంపీ డాక్టర్‌ బి.వి.సత్యవతి మాట్లాడుతూ అమ్మఒడి పథకంలో కోత విధిస్తున్నారన్న విమర్శల్లో నిజం లేదన్నారు. 75 శాతం హాజరు ఉండాలని పథకం ప్రారంభ సమయంలోనే చెప్పిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు. ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దిన ఘనత జగన్‌దేనని పేర్కొన్నారు. ఈసందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి, డీఈఓ లింగేశ్వరరెడ్డి, డీఆర్‌ఓ వెంకటరమణ, ఆర్‌డీఓ చిన్నికృష్ణ, జీవీఎంసీ జోనల్‌ కమిషనర్‌ కనకమహాలక్ష్మి, జడ్పీ ఉపాధ్యక్షురాలు భీశెట్టి వరహా సత్యవతి, కార్పొరేటర్లు మందపాటి సునీత, జాజుల ప్రసన్నలక్ష్మి, కొణతాల నీలిమ, పీలా లక్ష్మీసౌజన్య, ఎంపీపీ గొర్లి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని