logo

బడి..చేసేద్దాం రెడీ

పాఠశాలల సంసిద్ధత కార్యక్రమాలు మంగళవారం నుంచి మొదలయ్యాయి. ఉపాధ్యాయులంతా పాఠశాలలకు చేరుకుని సిబ్బందితో కలిసి ఆవరణను శుభ్రం చేశారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం మంగళవారం పారిశుద్ధ్య కార్యక్రమాలను పురపాలక,

Published : 29 Jun 2022 03:42 IST

బలిఘట్టం హైస్కూల్లో సంసిద్ధత కార్యక్రమాలు వివరిస్తున్న ప్రధానోపాధ్యాయుడు

నర్సీపట్నం అర్బన్‌, చోడవరం, న్యూస్‌టుడే: పాఠశాలల సంసిద్ధత కార్యక్రమాలు మంగళవారం నుంచి మొదలయ్యాయి. ఉపాధ్యాయులంతా పాఠశాలలకు చేరుకుని సిబ్బందితో కలిసి ఆవరణను శుభ్రం చేశారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం మంగళవారం పారిశుద్ధ్య కార్యక్రమాలను పురపాలక, పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బంది సహకారంతో చేపట్టాలి. వీరి సహకారం తీసుకున్న పరిస్థితి ఎక్కడా కనిపించలేదు. ఈ నెల 28న పాఠశాలల్లోని తాగునీటి ట్యాంకులను శుభ్రం చేయించాలి. నీటి నమూనాలను పరీక్షించాలి. నమూనాలను పరీక్షించేందుకు ఎక్కడకు పంపాలన్న దానిపై స్పష్టత లేదు. సచివాలయాల ఇంజినీరింగ్‌ సహాయకుల వద్ద పరీక్షకు అవసరమైన కిట్లు ఉన్నాయన్న విషయం చాలామంది ఉపాధ్యాయులకు తెలియదు. కొందరు మాత్రం బలిఘట్టంలోని తాగునీటి నమూనాల ప్రయోగశాల ప్రతినిధులను సంప్రదించారు. పరీక్షకు నిర్ణీత మొత్తం చెల్లించాల్సి ఉంటుందని సిబ్బంది చెప్పారని పలువురు ఉపాధ్యాయులు ‘న్యూస్‌టుడే’ దృష్టికి తీసుకువచ్చారు.

* 29న విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. పాఠశాల అభివృద్ధి తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. పిల్లల తల్లిదండ్రులంతా హాజరైతే ఎంతో ప్రయోజనంగా ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు.

* 30న బడి బయట పిల్లలను గుర్తించి వారిని బడిలో చేర్చుకునే కార్యక్రమం చేపట్టాలి. జులై ఒకటో తేదీన సైన్స్‌ ల్యాబ్‌లను శుభ్రం చేయించడం, క్రీడా సామగ్రిని సిద్ధం చేయడం తదితర కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది. ప్రయోగశాలలకు అవసరమైన రసాయనాలు, పరికరాల కొనుగోలుకు గడిచిన విద్యా సంవత్సరంలో పాఠశాల అభివృద్ధికి కేటాయించిన మొత్తంలో మిగులు నిధులను ఇందుకు వినియోగించాలని కొందరు భావిస్తున్నారు. నిధులు అందుబాటులో లేనిచోట ఉపాధ్యాయులు ముందుగా తాము ఖర్చు చేయాల్సిన పరిస్థితి.

* జులై 2న పాఠశాలల భద్రత, ప్రథమ చికిత్స కార్యక్రమాలు చేపట్టాలి. శిథిలమైన కట్టడాలు ఉంటే అధికారులు, తల్లిదండ్రుల కమిటీ దృష్టికి తీసుకువెళ్లి వాటి తొలగింపుపై నిర్ణయం తీసుకోవాలి.

* జులై 4లోగా వంట గదులను పరిశుభ్రంగా ఉంచాలి. పాఠశాలలు పునఃప్రారంభమయ్యే ఐదో తేదీన పండగ వాతావరణం కనిపించాలని అధికారులు సూచించారు. విద్యార్థులను తరగతులకు ఆహ్వానం పలుకుతూ ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. పదో తరగతి పరీక్షల్లో ప్రతిభ చూపిన విద్యార్థులను అదే రోజు సత్కరించనున్నారు. జగనన్న విద్యా కానుక కిట్లనూ పంపిణీ చేస్తారు. విద్యా కానుకలకు సంబంధించిన సామగ్రి ఇప్పటికే పాఠశాలల సముదాయాలు, మండల విద్యా శాఖ కార్యాలయాలకు చేరాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని