logo

పట్టుకునే వేళకు పరార్‌!

పట్టాదారు పాసు పుస్తకం మంజూరు చేయడానికి రూ.50వేలు లంచం తీసుకోవడానికి వచ్చిన దొప్పెర్ల వీఆర్వో పరారవ్వగా, వీఆర్‌ఏను పట్టుకున్నట్లు ఏసీబీ సీఐ రమేష్‌ తెలిపారు. అదనపు ఎస్పీ శ్రావణి ఆధ్వర్యంలో మంగళవారం ఈ దాడి చేశామన్నారు.

Published : 29 Jun 2022 03:42 IST

ఏసీబీ కన్నుగప్పిన దొప్పెర్ల వీఆర్వో
రూ.50వేల లంచంతో దొరికిన వీఆర్‌ఏ


అచ్యుతాపురం తహసీల్దార్‌ కార్యాలయంలో రికార్డులు తనిఖీ చేస్తున్న అదనపు ఏస్పీ శ్రావణి, ఏసీబీ సిబ్బంది

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: పట్టాదారు పాసు పుస్తకం మంజూరు చేయడానికి రూ.50వేలు లంచం తీసుకోవడానికి వచ్చిన దొప్పెర్ల వీఆర్వో పరారవ్వగా, వీఆర్‌ఏను పట్టుకున్నట్లు ఏసీబీ సీఐ రమేష్‌ తెలిపారు. అదనపు ఎస్పీ శ్రావణి ఆధ్వర్యంలో మంగళవారం ఈ దాడి చేశామన్నారు. ఆయన వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.. అచ్యుతాపురం మండలం దొప్పెర్ల గ్రామానికి చెందిన ముచ్చు దుర్గాప్రసాద్‌, అంజలి దంపతులకు సర్వే నం. 212లో 18 సెంట్ల భూమి ఉంది. దీనికి పట్టాదారు పాసు పుస్తకం ఇవ్వాలని ఈ నెల 14న మీ సేవలో దుర్గాప్రసాద్‌ దరఖాస్తు చేశారు. రెవెన్యూ అధికారులు అదే రోజు ఫాం-8  జారీచేశారు. నిబంధనల ప్రకారం పట్టాదారు పాసు పుస్తకం పొందడానికి మరో 15 రోజుల గడువు ఉంటుంది. ఈ లోగా పాసు పుస్తకం మంజూరుకు రూ.50వేలు లంచం ఇవ్వాలని వీఆర్వో కోరడంతో దుర్గాప్రసాద్‌ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. అదనపు ఎస్పీ శ్రావణి ఆధ్వర్యంలో సిబ్బంది వీఆర్వోని పట్టుకోవడానికి ప్లాన్‌ వేశారు. డబ్బులు తీసుకోవడానికి వీఆర్‌ఏని వెంటబెట్టుకొని వచ్చిన వీఆర్వో ఏసీబీ అధికారులను చూసి పరారయ్యాడు. దీంతో వీఆర్‌ఏను అదుపులోకి తీసుకుని, లంచంగా తీసుకున్న రూ.50 వేలు స్వాధీనం చేసుకున్నారు. పరారైన వీఆర్వోని పట్టుకోవడానికి స్థానిక పోలీసుల సాయంతో ప్రయత్నించినా వీలుకాలేదు. అనంతరం వీఆర్‌ఏను తహసీల్దార్‌ కార్యాలయానికి తీసుకొచ్చారు. కార్యాలయంలో ఈ కేసుకు సంబంధించిన రికార్డులు, దరఖాస్తులు, వీఆర్వో అందించిన రిపోర్టు అంశాలను అధికారులు తనిఖీ చేశారు. వీఆర్‌ఏ, తహసీల్దార్‌ల నుంచి అవసరమైన వివరాలను లిఖితపూర్వకంగా తీసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని