logo

‘లాభాల బాటలో కాకినాడ టౌన్‌ బ్యాంకు’

ఖాతాదారుల డిపాజిట్లకు సంబంధించి సురక్షితమైన వ్యవస్థతో.. 42 సంవత్సరాలుగా వారి నమ్మకాన్ని చూరగొంటున్న ది కాకినాడ కోఆపరేటివ్‌ టౌన్‌ బ్యాంకు లాభాల బాటలో పయనిస్తోందని ఆ సంస్థ అధ్యక్షుడు చిట్టూరి రవీంద్ర పేర్కొన్నారు.

Published : 29 Jun 2022 03:42 IST

మాట్లాడుతున్న చిట్టూరి రవీంద్ర..పాల్గొన్న పాలక మండలి సభ్యులు, సీఈవో

కాకినాడ(గాంధీనగర్‌), న్యూస్‌టుడే: ఖాతాదారుల డిపాజిట్లకు సంబంధించి సురక్షితమైన వ్యవస్థతో.. 42 సంవత్సరాలుగా వారి నమ్మకాన్ని చూరగొంటున్న ది కాకినాడ కోఆపరేటివ్‌ టౌన్‌ బ్యాంకు లాభాల బాటలో పయనిస్తోందని ఆ సంస్థ అధ్యక్షుడు చిట్టూరి రవీంద్ర పేర్కొన్నారు. మంగళవారం కాకినాడ నగరంలోని ఓ హోటల్‌లో బ్యాంకు 43వ వార్షిక నివేదికను ఆయన వెల్లడించారు. ఈ ఏడాది మార్చి 31 నాటికి తమ బ్యాంకు సభ్యుల సంఖ్య 52,205, ఖాతాదారులు 54,218 మందికి పెరిగారన్నారు. బ్యాంకు సొంత నిధులు రూ.154.67 కోట్లకు పెరగ్గా, వ్యాపార ధనం రూ.1147.58 కోట్లకు చేరిందన్నారు. బ్యాంకులో డిపాజిట్లు రూ.1,032.43 కోట్లు ఉండగా, బ్యాంకు రుణాలు రూ.716.29 కోట్లు, పెట్టుబడులు రూ.387.91 కోట్లుగా తెలిపారు. దీంతో బ్యాంకు నికర లాభం రూ.10.11 కోట్లకు చేరిందని వెల్లడించారు. రిజర్వుబ్యాంకు నిబంధనలు పూర్తిగా పాటిస్తున్నామని, డిపాజిట్లలో 18 శాతం ఎస్‌ఎల్‌ఆర్‌, ఎన్‌డీటీఎల్‌పై సీఆర్‌ఆర్‌ నాలుగు శాతం తగ్గకుండా చూస్తున్నామని వివరించారు. మొత్తం పెట్టుబడులు రూ.387.91 కోట్లలో ప్రభుత్వ సెక్యూరిటీల్లో రూ.248 కోట్లు, షెడ్యూల్డ్‌ బ్యాంకుల్లో రూ.112.62 కోట్లు, ఇతరాల్లో రూ.27.29కోట్లు పెట్టామని పేర్కొన్నారు. ఈ ఏడాది సైతం ఆడిట్‌లో ఏ గ్రేడ్‌ సాధించినట్లు ఆయన చెప్పారు. బ్యాంకు రుణ గ్రహీతలు, వారి కుటుంబ సభ్యుల సంక్షేమానికి శ్రీరామ్‌ లైఫ్‌ ఇన్స్యూరెన్‌్్స కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. పాలక మండలి ఎన్నికలను రాబోయే ఆగష్టులో నిర్వహించే అవకాశం ఉందని ప్రకటించారు. ఈ సమావేశంలో బ్యాంకు ఉపాధ్యక్షుడు తోట మెహర్‌ సీతారామ సుధీర్‌, డైరెక్టర్లు కంటిపూడి సత్యనారాయణ, గొల్లపూడి కృష్ణమూర్తి, సత్తి రామారెడ్డి, బ్యాంకు సీఈవో సుగుణారావు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని