logo

చెత్త సేకరణ పంచాయితీ

విశాఖ నగరంలో ఇంటింటి నుంచి చెత్తను సేకరించే క్లాప్‌ (క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌) వాహనాల పని తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. నిత్యం వివిధ ప్రాంతాల నుంచి పారిశుద్ధ్య నిర్వహణపై ఫిర్యాదులు వస్తుండడంతో జీవీఎంసీ అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

Updated : 30 Jun 2022 07:03 IST

గుత్తేదారుకు నేరుగా నిధులు వేతనాలందలేదని చోదకుల నిరసన
జీవీఎంసీ పర్యవేక్షణ శూన్యం
న్యూస్‌టుడే, కార్పొరేషన్‌

తూనిక యంత్రంపై చెత్తసేకరణ వాహనం

విశాఖ నగరంలో ఇంటింటి నుంచి చెత్తను సేకరించే క్లాప్‌ (క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌) వాహనాల పని తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. నిత్యం వివిధ ప్రాంతాల నుంచి పారిశుద్ధ్య నిర్వహణపై ఫిర్యాదులు వస్తుండడంతో జీవీఎంసీ అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

గుత్తేదారు చోదకులకు రెండు నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో సోమవారం 120 వాహనాల సేవలను నిలిపివేశారు. చివరికి  చెల్లించడానికి  హామీ ఇవ్వడంతో మంగళవారం యథావిధిగా వాహనాలు నడిచాయి. చెత్త సేకరణ, తరలింపు కోసం మహా విశాఖ నగరపాలక సంస్థ ఎప్పటి నుంచో యూజర్‌ ఛార్జీలు వసూలు చేస్తోంది. అయితే అది తప్పని సరి కాకపోవడంతో గతంలో పారిశుద్ధ్య సిబ్బంది వచ్చినా, రాకపోయినా నగరవాసులు పెద్దగా పట్టించుకునేవారు కాదు.
*ప్రస్తుతం రుసుములు చెల్లించడం  తప్పనిసరి కావడంతో చెత్త సేకరణ ఆగితే నివాసితులు తీవ్ర అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
* నగరంలో కొండవాలు, చిన్న వీధుల్లో 15శాతం నివాసాలు ఉన్నాయి. ఆయా ఇళ్ల వద్దకు క్లాప్‌ వాహనాలు వెళ్లవు. అక్కడి నుంచి పుష్‌కార్టుల ద్వారా సేకరించి బిన్నుల్లో వేస్తున్నారు. తర్వాత కాంపాక్టర్‌ బిన్ను వ్యానులతో దాన్ని డంపింగ్‌యార్డుకు తరలిస్తున్నారు. దీనికి నెలకు రూ.కోటి వరకు వ్యయమవుతోంది.
* మరో పక్క క్లాప్‌ వాహనాలకు నెలకు రూ.4.07కోట్లు చెల్లిస్తున్నారు. గతంలో నగరానికి చెందిన గుత్తేదారులు 412 వాహనాల్లో చెత్తను సేకరించేవారు. ప్రస్తుతం 618 క్లాప్‌ వాహనాలు నడుపుతున్నా చెత్త సేకరణపై ఫిర్యాదులు వస్తూనే ఉండడం గమనార్హం.
ఆ రుసుములు నేరుగా గుత్తేదారుకు..
క్లాప్‌ వాహనాల నిర్వహణపై గుత్తేదారులతో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ ఒప్పందం చేసుకుంది. నగర ప్రజల నుంచి వసూలయ్యే చెత్త సేకరణ రుసుములు ప్రత్యేక ఖాతాలో జమ అవుతున్నాయి. వాటిని ఎప్పటికప్పుడు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ పర్యవేక్షణలో క్లాప్‌ వాహనాల గుత్తేదారులకు ఇస్తారు. జీవీఎంసీలోని ఆడిట అకౌంట్స్ విభాగాల ప్రమేయం లేకుండానే ప్రజల సొమ్ము నేరుగా గుత్తేదారుకు చేరేలా ఏర్పాట్లు చేశారు.
*సేవా రుసుములు సక్రమంగా వసూలు కాకపోతే... సాధారణ నిధుల నుంచి ఇవ్వాలని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ అధికారులు జీవీఎంసీని కోరుతున్నారు. ఇప్పటి వరకు సేవా రుసుముల కింద రూ.8 కోట్లు వసూలైందని, వీటి నుంచే గుత్తేదారుకు వెళతాయని ప్రధాన వైద్యాధికారి కేఎస్‌ఎల్‌జీ శాస్త్రి తెలిపారు.

జీవీఎంసీ డబ్బులు...‘స్వచ్ఛాంధ్ర’ పెత్తనం: రాష్ట్రంలో పారిశుద్ధ్య నిర్వహణకు సంబంధించిన వ్యవహారాలు చూడటానికి ఏర్పాటు చేసిన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ తీరుపై జీవీఎంసీ అధికారులు విస్తుపోతున్నారు. క్లాప్‌ వాహనాలకు ఎంత చెల్లించాలన్న అంశంపై ఆ సంస్థ అధికారులు తమకు నచ్చినట్లు గుత్తేదారుతో ఒప్పందం చేసుకున్నారు. ఒక్కో వాహనానికి నెలకు రూ.65వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. చోదకునికి రూ.10వేల వేతనం, పెట్రోలు ఖర్చు రూ.15వేలుగా చెబుతున్నారు. అయినా దానికి మూడింతల మొత్తం గుత్తేదారుకు ఇస్తుండడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.

పర్యవేక్షణ ఏదీ..
క్లాప్‌ వాహనాల జీపీఎస్‌ను జీవీఎంసీలోని కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రానికి అనుసంధానించారు. ఆయా వాహనాలు ఉదయం 6 నుంచి 9.30 గంటల్లోపే చెత్తను సేకరిస్తాయి. అవి ఎన్ని ట్రిప్పులు, కిలోమీటర్లు తిరిగాయనే అంశాలను జీవీఎంసీలో పరిశీలించకపోవడం లోపమని నిపుణులు చెబుతున్నారు. తద్వారా గుత్తేదారు ఇష్టారాజ్యంగా వ్యవహరించే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ‘క్లాప్‌ వాహనాలకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ బిల్లులు చెల్లిస్తుంది. ఆయా వాహనాల ద్వారా ఇంటింటి నుంచి చెత్త సేకరించేలా చూస్తున్నాం. ఒక్కో వాహనం 1000 ఇళ్ల నుంచి చెత్త తీసుకోవాలి. ట్రిప్పులెన్ని తిరిగాయన్న ప్రాతిపదికన కాకుండా ఇళ్ల నుంచి చెత్త సేకరించారా లేదా అనేది ప్రామాణికంగా తీసుకుంటున్నామ’ని జీవీఎంసీ మెకానికల్‌ విభాగ కార్యనిర్వాహక ఇంజినీరు చిరంజీవి, సహాయ ఇంజినీరు సత్య శ్రీనివాసరావు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని