logo

కొవిడ్‌పై అప్రమత్తం

కొవిడ్‌ కేసులు సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో యంత్రాంగం అప్రమత్తమయింది. ఈనెల మొదటి వారంలో రోజుకు పదిలోపు పాజిటివ్‌ కేసులు నమోదయ్యేవి. ఇప్పుడా సంఖ్య 50 దాటేసింది. ప్రస్తుతం కొవిడ్‌ పరీక్షలు తక్కువ జరుగుతున్నా...పాజిటివిటీ రేటు కలవరపరుస్తోంది.

Published : 30 Jun 2022 05:49 IST

ఎక్కడికక్కడ నమూనాల సేకరణకు  ఏర్పాట్లు

ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం: కొవిడ్‌ కేసులు సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో యంత్రాంగం అప్రమత్తమయింది. ఈనెల మొదటి వారంలో రోజుకు పదిలోపు పాజిటివ్‌ కేసులు నమోదయ్యేవి. ఇప్పుడా సంఖ్య 50 దాటేసింది. ప్రస్తుతం కొవిడ్‌ పరీక్షలు తక్కువ జరుగుతున్నా...పాజిటివిటీ రేటు కలవరపరుస్తోంది. దీంతో వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది. ఇటీవలే కొవిడ్‌పై ఉన్నతాధికారులు సమీక్షించి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని నిర్ణయించారు. ఇప్పుడు నమోదవుతున్న పాజిటివ్‌ కేసులకు ఆస్పత్రుల్లో చేరాల్సినంత పరిస్థితి లేదంటున్నారు. అయినా ముందు జాగ్రత్త చర్యగా కేజీహెచ్‌లో 30 పడకల ఐసీయూ వార్డును సిద్ధం చేసినట్లు డీఎంహెచ్‌వో డా. విజయలక్ష్మి చెప్పారు. ఇకపై రోజువారీ చేస్తున్న కొవిడ్‌ పరీక్షల సంఖ్యను పెంచనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం కేజీహెచ్‌, ఛాతి ఆసుపత్రుల్లో కొవిడ్‌ పరీక్షలు చేస్తున్నారు. గురువారం నుంచి జీవీఎంసీ పరిధిలోని అన్ని అర్బన్‌ పీహెచ్‌సీల్లోను కరోనా పరీక్షలు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడ నమూనాలను సేకరించి కేజీహెచ్‌ ప్రయోగశాలకు తరలించడానికి జీవీఎంసీ నుంచి రెండు వాహనాలను కూడా ఏర్పాటు చేశారు.
ఆందోళనకరంగా పాజిటివిటీ రేటు: ప్రస్తుతం అనుమానిత లక్షణాలున్నవారు.. కొన్ని వైద్యచికిత్సలకు ముందు సాధారణంగా చేసే కొవిడ్‌ పరీక్షల్లో వెలుగు చూసిన కేసులే ఎక్కువ ఉన్నాయి. మంగళవారం 290 మందికి పరీక్షలు చేయగా 51 మందికి పాజిటివ్‌గా తేలింది. బుధవారం 354 మందిని పరీక్షించగా 58 కేసులు వెలుగులోకి వచ్చాయి. పాజిటివిటీ రేటు 15 నుంచి 17 ఉండడంతో పరీక్షలు ఎక్కువ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇదే సమయంలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ చేసుకోకుండా మిగిలిన వారు టీకాలు వెంటనే వేయించుకోవాలని డీఎంహెచ్‌వో విజయలక్ష్మి సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని