logo

కళ్లు చెదిరే వ్యాపారం.. తేడా వస్తే నిర్బంధం!

చీకటి వ్యాపారంలో కళ్లు చెదిరే నిజాలివి.. గంజాయి స్మగ్లింగ్‌లో మాఫియా కోణం.. పెద్ద క్రైమ్‌ సినిమాకు సరిపడా కథ.. స్థానికంగా గంజాయి తరలిస్తూ పట్టుబడి జైలుకు వెళ్లాడొక గిరిజనుడు.. జైల్లో మహారాష్ట్ర డాన్‌తో పరిచయం కావడంతో అంతర రాష్ట్ర స్మగ్లర్‌ అయ్యాడు

Published : 30 Jun 2022 05:49 IST

స్మగ్లర్‌ చెరలో రెండేళ్లుగా ఆరుగురు గిరిజనులు
విడిపించి తీసుకువచ్చిన ‘అల్లూరి’ జిల్లా పోలీసులు

గంజాయి స్మగ్లింగ్‌లో రూ. లక్షల్లో లావాదేవీలు  

గంజాయి స్మగ్లర్‌ చెర నుంచి రక్షించిన గిరిజనులతో ఏఎస్పీ తుషార్‌డూడి, గూడెంకొత్తవీధి సీఐ అశోక్‌కుమార్‌

చింతపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: చీకటి వ్యాపారంలో కళ్లు చెదిరే నిజాలివి.. గంజాయి స్మగ్లింగ్‌లో మాఫియా కోణం.. పెద్ద క్రైమ్‌ సినిమాకు సరిపడా కథ.. స్థానికంగా గంజాయి తరలిస్తూ పట్టుబడి జైలుకు వెళ్లాడొక గిరిజనుడు.. జైల్లో మహారాష్ట్ర డాన్‌తో పరిచయం కావడంతో అంతర రాష్ట్ర స్మగ్లర్‌ అయ్యాడు.. లావాదేవీలు లక్షల్లోకి చేరాయి.. చిన్న తేడా రావడంతో రెండేళ్లుగా ఆ డాన్‌ చెరలో చిక్కుకున్నాడు.. విడిపించడానికి వెళ్లిన భార్య, పిల్లలను కూడా అతడు నిర్బంధించగా.. చివరకు పోలీసులు వారిని విడిపించడంతో కథ సుఖాంతమైంది.. దీంతోపాటు లక్షల రూపాయల్లో సాగుతున్న గంజాయి లావాదేవీలు బయటపడ్డాయి.  బీ చింతపల్లి ఏఎస్పీ తుషార్‌డూడి బుధవారం వెల్లడించిన వివరాల ప్రకారం.. అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెంకొత్తవీధి మండలం ఏబులంకు చెందిన పాంగి గోవర్ధన్‌ 2020లో గంజాయి తరలిస్తూ కాకినాడ జిల్లా కోటనందూరులో పోలీసులకు పట్టుబడి రాజమండ్రి జైలుకు చేరాడు. మహారాష్ట్రలోని ఉస్మానాబాద్‌కు చెందిన గంజాయి స్మగ్లర్‌ సుభాష్‌ అన్నా పవార్‌తో అక్కడ పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లకు బెయిల్‌పై విడుదలైన గోవర్ధన్‌ స్వగ్రామానికి వచ్చేశాడు. సుభాష్‌ జైలు నుంచి విడుదలయ్యాక ఏబులం గ్రామానికి వచ్చాడు. స్థానికుడు గొల్లోరి హరిబాబు సాయంతో గోవర్ధన్‌ను కలిసి తనకు గంజాయి కావాలంటూ రూ.8 లక్షలు ఇచ్చాడు. దీంతో గోవర్ధన్‌, హరిబాబు కలిసి 1700 కిలోల గంజాయిని మహారాష్ట్రకు తరలించడానికి సిద్ధపడ్డారు.
* ఈ క్రమంలో కిర్లంపూడి చెక్‌పోస్టు వద్ద హరిబాబు పోలీసులకు పట్టుబడగా గోవర్ధన్‌ తప్పించుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న గంజాయి డాన్‌ సుభాష్‌ ఏబులం వచ్చి గోవర్ధన్‌ను బలవంతంగా మహారాష్ట్రకు తీసుకెళ్లి తన ఇంట్లో నిర్బంధించాడు. అతడిని విడిపించేందుకు భార్య ధనలక్ష్మి, ఇద్దరు పిల్లలను తీసుకుని తన మరిది కేశవ్‌, అతడి భార్యతో కలిసి 2021 డిసెంబరులో మహారాష్ట్ర వెళ్లింది. స్మగ్లర్‌ వీరిని కూడా బంధించాడు. రూ. 20 లక్షల విలువైన గంజాయి తీసుకొచ్చి ఇస్తే అందరినీ వదిలిపెడతానని చెప్పి కేశవ్‌ను పంపేశాడు. ఇక్కడకు వచ్చిన కేశవ్‌ గూడెంకొత్తవీధి పోలీసులను ఆశ్రయించి తన అన్న, వదిన, పిల్లలు, భార్యను నిర్బంధించిన విషయాన్ని చెప్పాడు. వారు ఈ విషయాన్ని ఎస్పీ సతీష్‌కుమార్‌ దృష్టికి తీసుకెళ్లగా ఆయన ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ఈనెల 25న మహారాష్ట్రకు పంపించారు. అక్కడి పోలీసుల సహకారంతో గంజాయి డాన్‌ను అదుపులోకి తీసుకుని గిరిజనులకు విడిపించారు.
* వీరితో పాటు రెండేళ్లుగా ఇదే స్మగ్లర్‌ చెరలో ఉన్న చింతపల్లి మండలం లోతుగెడ్డకు చెందిన గిరిజనుడు నాగేంద్రబాబుకు కూడా విముక్తి కల్పించారు. అతడి తమ్ముడు స్మగ్లర్‌ దగ్గర రూ. 7 లక్షలు తీసుకుని గంజాయి సరఫరా చేయకపోవడంతో రెండేళ్ల నుంచి అతడిని నిర్బంధించాడు. సుభాష్‌ను అరెస్టు చేసి కోర్టుకు తరలించామని ఏఎస్పీ పేర్కొన్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని