logo

జగన్నాథుని రథోత్సవానికి వేళాయే..

విశాఖ పాతనగరం మెయిన్‌రోడ్డులోని శ్రీ జగన్నాథస్వామి దేవస్థానంలో స్వామి కల్యాణ, రథయాత్ర ఉత్సవాలకు రంగం సిద్ధమైంది. గురువారం కల్యాణోత్సవం, జులై 1న తొలి రథయాత్ర నిర్వహిస్తారు. 158 ఏళ్ల నుంచి ఇక్కడ రథయాత్రను నిర్వహిస్తున్నారు.

Updated : 30 Jun 2022 07:06 IST

స్వామి వారి యాత్రకు సిద్దమైన రధం 

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: విశాఖ పాతనగరం మెయిన్‌రోడ్డులోని శ్రీ జగన్నాథస్వామి దేవస్థానంలో స్వామి కల్యాణ, రథయాత్ర ఉత్సవాలకు రంగం సిద్ధమైంది. గురువారం కల్యాణోత్సవం, జులై 1న తొలి రథయాత్ర నిర్వహిస్తారు. 158 ఏళ్ల నుంచి ఇక్కడ రథయాత్రను నిర్వహిస్తున్నారు. పూరి ఆచారాన్ని అనుసరిస్తున్నాన్నారు. 1862లో జగన్నాథస్వామి ఆలయం ఏర్పడింది. 1864 నుంచి రథయాత్ర నిర్వహిస్తూ పదిరోజుల పాటు ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. జ్యేష్ఠ బహుళ అమావాస్య రోజున ఉత్సవాల ప్రతిష్ఠాపన మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి ఆలయంలో భిన్న రకాల పూజలు నిర్వహిస్తున్నారు. గురువారం సాయంత్రం 6.30 గంటలకు అంగరంగ వైభవంగా సుభద్రాదేవి కల్యాణం నిర్వహిస్తారు.
 రోజుకో అవతారంలో దర్శనం
జులై 2 నుంచి స్వామివారు రోజుకో అవతారంలో దర్శనమివ్వనున్నారు. మత్స్యావతారం, కూర్మావతారం, వరాహవతారం, నృసింహావతారం, వామనావతారం, పరశురామావతారం, రామావతారం, బలరామ, కృష్ణావతారం, శేషపాన్పు అవతారాల్లో దర్శనమివ్వనున్నారు. జులై 11న తిరుగు రథయాత్ర నిర్వహిస్తామని ఆలయ ప్రధాన అర్చకులు పాగింగపల్లి జగన్నాథ ఆచార్యులు తెలిపారు. శ్రీరంగనాథస్వామి మూల విరాట్టుగా, ఉత్సవ మూర్తులుగా రుక్మిణి, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయంలో కొలువై ఉన్నారు. జగన్నాథస్వామి, సుభద్రాదేవి, బలభద్రస్వామి, సుదర్శనస్వామి వార్లను అలంకరించి రథంపై టర్నర్‌ చౌల్ట్రీకి తీసుకెళ్లి దశావతారాల్లో అలంకరిస్తామని పేర్కొన్నారు.
 శీల విరుపు ఉత్సవానికి ప్రత్యేకత
శీలవిరుపు మహోత్సవం జులై 5న నిర్వహిస్తామని జగన్నాథ ఆచార్యులు తెలిపారు. తోటకూర అమ్మే వ్యాపారి వేషంలో లక్ష్మీదేవి స్వామివారిని వెతుక్కుంటూ వెళ్లి ఆచూకీ తెలుసుకుంటారన్నారు. ఈ సందర్భంలో అలిగి, తిరిగి ఎలా వస్తావో చూస్తానని స్వామి వారి రథం శీలను తొలగిస్తారని, దీనినే శీల మహోత్సవం అంటారన్నారు. ఈ ఉత్సవాన్ని చౌల్ట్రీ ఆవరణలో వైభవంగా నిర్వహిస్తామన్నారు.
భక్తులకు సకల ఏర్పాట్లు
టర్నర్‌ చౌల్ట్రీ ఆవరణలోని కల్యాణమండపంలో దశావతారాలు నిర్వహించేందుకు ఈఓ ప్రసన్నలక్ష్మి ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. స్వామివారి దర్శనానికి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. దీనికి తగ్గట్టుగా క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రసాదాలు సిద్ధం చేస్తున్నారు. ఉచిత దర్శనాలతో పాటు ప్రత్యేక దర్శనానికి రూ.20, శీఘ్ర దర్శనానికి రూ.50, విశిష్ట దర్శనానికి రూ.200, అష్టోతర పూజకు రూ.20 టికెట్‌ ధర నిర్ణయించారు. దశావతరాలు జరిగే 9 రోజులూ గోత్ర నామాలతో పూజలు చేయించుకోవాలంటే రూ.500 చెల్లించి వివరాలు నమోదు చేసుకోవాలని ఈవో తెలిపారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని