logo

పెట్టుబడి సాయం..ఇంకెంత దూరం!

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం కిసాన్‌, రైతు భరోసా పథకాల పేరుతో అన్నదాతలకు ఆర్థిక సాయం అందిస్తూ అండగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. అయితే సాంకేతిక సమస్యల కారణంగా ఏటా వేల మందికి ఈ సాయం దక్కకుండాపోతోంది. చాలామందికి రైతు భరోసా సాయం

Published : 30 Jun 2022 05:56 IST

 సాంకేతిక చిక్కులతో పీఎం కిసాన్‌ లబ్ధి దూరం
 మూడేళ్లలో 70 వేల మంది రైతులకు దరిచేరని పథకం

ఇటీవల రావికమతంలో పీఎం కిసాన్‌ సొమ్ములు రావడం లేదని ఎమ్మెల్యే ధర్మశ్రీకి వివరిస్తున్న దేవర మారమ్మ

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం కిసాన్‌, రైతు భరోసా పథకాల పేరుతో అన్నదాతలకు ఆర్థిక సాయం అందిస్తూ అండగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. అయితే సాంకేతిక సమస్యల కారణంగా ఏటా వేల మందికి ఈ సాయం దక్కకుండాపోతోంది. చాలామందికి రైతు భరోసా సాయం రూ.7,500 ఖాతాల్లో జమవుతోంది.. పీఎం కిసాన్‌ సొమ్ములు రూ.6 వేలు అంద[డం లేదు. ఉమ్మడి జిల్లాలో గతేడాది 30 వేల మంది రైతులకు ఈ ఆర్థిక సాయం వివిధ కారణాలను చూపి నిలిపేశారు. ఈ ఏడాది మొదటి విడతగా రూ.2 వేలు చొప్పున కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యనే విడుదల చేసింది. అనకాపల్లి జిల్లాలో సుమారు 8,500 మందికి పైగా ఖాతాల్లో ఈ సాయం జమ కాలేదు. ఇటీవలే తుమ్మపాల రైతు సంఘ నాయకులు మురళీమోహనరావు అనకాపల్లి జిల్లా వ్యవసాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. సాంకేతిక సమస్యలను పరిష్కరించి అర్హులైన రైతులందరి సాయం అందేలా చూడాలని కోరుతున్నారు.
ఇవీ అడ్డంకులు...
రైతు భరోసా మాదిరిగా కాకుండా కొన్ని అదనపు షరతులతో పీఎం కిసాన్‌ అందిస్తున్నారు. అందువల్లే చాలా మంది ఈ పథకం సాయం అందుకోలేకపోతున్నారు. ఒకే కుటుంబానికి చెందినవారు కావడం, చనిపోయిన రైతు ఖాతాలు, ప్రభుత్వ ఉద్యోగి/ పింఛనుదారు, గ్రామ/వార్డు సచివాలయ కుటుంబ సర్వేలో ప్రభుత్వ ఉద్యోగిగా గుర్తించడం, ప్రజాసాధికార సర్వేలో నమోదుకాకపోవడం, ఆదాయపన్ను చెల్లిస్తుండడం, వెబ్‌ల్యాండ్‌తో వివరాలు సరిపోకపోవడం, ఆన్‌సర్వేలో ఉండడం ఇలా 16 రకాల కారణాలతో పీ‡ఎం కిసాన్‌ను సాయాన్ని తిరస్కరిస్తున్నారు. ఇలాంటి వారిలో చాలామంది అర్హులుంటున్నా వారి సాయాన్ని పునరుద్ధరించుకోలేకపోతున్నారు.
అర్హులైనవారందరికీ సాయం..
పీఎం కిసాన్‌ సాయం అందని వారు మండల ఏవో కార్యాలయాలకు వెళితే ఏ కారణంతో సాయం అందలేదో వివరంగా చెబుతారు. అర్హులైతే ఆయా సమస్యలను సరిదిద్దుకుని వివరాలను అందజేస్తే వారికి పీఎం కిసాన్‌ సొమ్ములు అందుతాయి. ఇదివరకు ఆన్‌సర్వేలో ఉన్న రైతులు సర్వే చేయించుకుని వివరాలిస్తే వారి ఖాతాల్లో సర్కారు సాయం పడింది.
- లీలావతి, జిల్లా వ్యవసాయాధికారి, అనకాపల్లి


* ‘బాబూ రైతుభరోసా సొమ్ములు పడుతున్నాయి.. పీఎం కిసాన్‌ డబ్బులు రూ.6 వేలు మాత్రం పడడం లేదు.. ఇక్కడ అధికారుల్ని ఎన్నిసార్లు అడిగినా ఇదిగో..అదిగో అనడమే తప్ప డబ్బులు వచ్చేటట్లు చేయడం లేదు. మీరైనా ఒకసారి చెప్పండి బాబూ’
-రావికమతం మండలం
కవ్వకుంటలో ఇటీవల జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే ధర్మశ్రీ ఎదుట దేవర మారమ్మ తన ఆవేదనను వెళ్లగక్కింది..
రెండేళ్లుగా నిలిచిపోయాయి..
గతంలో నాలుగు వాయిదాలు పీఎం కిసాన్‌ సాయం మా ఖాతాలో పడింది. గడిచిన రెండేళ్లుగా ఈ సాయం అందడం లేదు. సచివాలయం, వ్యవసాయ శాఖ అధికారులకు దృష్టికి తీసుకువెళ్లినా సమాధానం చెప్పడం లేదు. పీఎం కిసాన్‌ హెల్ప్‌లైన్‌ సెంటర్‌కి ఫోన్‌ చేసి అడిగితే వివరాలన్నీ సక్రమంగా ఉన్నాయని చెబుతున్నారు, డబ్బులు ఎందుకు రావడం లేదో చెప్పడం లేదు.
- పల్లెల రమణమ్మ, వమ్మవరం, ఎస్‌.రాయవరం మండలం
ఈనాడు డిజిటల్‌, అనకాపల్లి


గత మూడేళ్లలో పీఎం కిసాన్‌ అందని వారి వివరాలు
ఏడాది సాయం
దక్కని వారు
2019-20 2,253
2020-21 29,162
2021-22 30,939
2022-23 8,686
తొలివిడత

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని