logo

95 శాతం హామీలను నెరవేర్చాం..

ప్రతిపక్ష నేతగా జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నప్పుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక 95 శాతం నెరవేర్చామని ఉమ్మడి విశాఖ జిల్లా  వైకాపా సమన్వయకర్త, టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అన్నారు.

Published : 30 Jun 2022 06:10 IST

వైకాపా ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి

సభలో మాట్లాడుతున్న వైవీ సుబ్బారెడ్డి, వేదికపై ఉపముఖ్యమంత్రి రాజన్నదొర, మంత్రి అమర్‌నాథ్‌, ఎంపీ సత్యవతి, మేయర్‌ హరి వెంకటకుమారి, జడ్పీ ఛైర్‌పర్సన్‌ సుభద్ర, ఎమ్మెల్యేలు రమణమూర్తిరాజు, ధర్మశ్రీ, ఉమాశంకర్‌ గణేష్‌, అదీప్‌రాజ్‌, బాబూరావు తదితరులు

పెందుర్తి, న్యూస్‌టుడే: ప్రతిపక్ష నేతగా జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నప్పుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక 95 శాతం నెరవేర్చామని ఉమ్మడి విశాఖ జిల్లా  వైకాపా సమన్వయకర్త, టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. వేపగుంట దరి చీమలాపల్లిలోని ఓ కన్వెన్షన్‌ హాలులో అనకాపల్లి జిల్లా వైకాపా ప్లీనరీ సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అధ్యక్షత వహించారు. వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలకు సముచిత స్థానం కల్పించడం కోసం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వచ్చే నెల 8, 9 తేదీల్లో గుంటూరులో జరిగే జాతీయ స్థాయి ప్లీనరీలో ఓ ప్రకటన చేయనున్నారన్నారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను నవరత్నాల ద్వారా తొలగిస్తున్నామన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో రూ.1.52 లక్షల కోట్లు సంక్షేమ పథకాలకు సీఎం జగన్‌ ఖర్చు చేశారన్నారు. దీన్ని జీర్ణించుకోలేక తెదేపా నాయకులు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఎన్ని కుతంత్రాలు పన్నినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. వచ్చే ఎన్నికల్లో వైకాపా 175 స్థానాలు కైవసం చేసుకుంటుందని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండాలని నాయకులకు పిలుపునిచ్చారు.
ప్రలోభాలకు లొంగనందుకు గుర్తింపు
ఉప ముఖ్యమంత్రి రాజన్నదొర మాట్లాడుతూ ఎన్నికలకు ముందు తెదేపాలో చేరాలని ఎన్ని ప్రలోభాలు పెట్టినా తాను లొంగలేదన్నారు. జగన్‌ బాటలో నడవాలనే సంకల్పంతో వైకాపాలోనే ఉండిపోయానన్నారు. నేడు దానికి గుర్తింపుగా ఉపముఖ్యమంత్రి పదవి లభించిందన్నారు. ప్రతి కార్యకర్త, నాయకుడు ఓపికతో ఉంటే తప్పకుండా జగన్‌మోహన్‌రెడ్డి న్యాయం చేస్తారన్నారు.
మంత్రి అమర్‌నాథ్‌ మాట్లాడుతూ కొవిడ్‌ కారణంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైనా అభివృద్ధి, సంక్షేమం విషయంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఎక్కడా రాజీ పడలేదన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా 30 లక్షల కుటుంబాలకు సొంత ఇంటి కలను సాకారం చేశారన్నారు. రాజశేఖరరెడ్డి, జగన్‌ పేర్లు చెబితే ఎన్నో పథకాలు గుర్తుకొస్తాయి.. చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకమైనా గుర్తుకొస్తుందా అని ప్రశ్నించారు.
‘ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై తెదేపా నేత అయ్యన్నపాత్రుడు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఆయన గ్రామాల్లోకి వస్తే తరిమికొట్టండి. మీకు ఏమీ కాకుండా మేము వెన్నంటే ఉంటాం’ అని మంత్రి అమర్‌నాథ్‌ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

అందరికీ న్యాయం జరగడం కష్టమే..
ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌ మాట్లాడుతూ వైకాపా, ముఖ్యమంత్రిపై తప్పుడు ప్రచారాలు చేస్తున్న చంద్రబాబు ఎన్నికల్లో గెలిస్తే నవరత్నాలను తీసేస్తామని ప్రకటించే దమ్ముందా అని ప్రశ్నించారు. రాజకీయాల్లో అందరికీ న్యాయం జరగడం కష్టమేనని దీన్ని ప్రతి కార్యకర్త, నాయకుడు అర్థం చేసుకుని పని చేయాలన్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా వైకాపా ఎమ్మెల్యే ఓడిపోతే అది కార్యకర్తలు, నాయకుల అసంతృప్తి కారణమే తప్ప ప్రతిపక్షం వల్ల కాదన్నారు. జగన్‌ను పత్రికలు, పవన్‌కల్యాణ్‌ ఏమీ చేయలేరన్నారు. ఎంపీ భీశెట్టి సత్యవతి మాట్లాడుతూ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందాయంటే అది జగన్‌ ప్రభుత్వం వల్లేనన్నారు. అనకాపల్లి జిల్లాకు కేంద్రీయ విశ్వవిద్యాలయం అందించారన్నారు. ప్లీనరీలో జడ్పీ ఛైర్‌పర్సన్‌ సుభద్ర, ఎమ్మెల్యేలు కన్నబాబురాజు, గణేశ్‌, జీవీఎంసీ మేయర్‌ హరివెంకటకుమారి, జిల్లా పరిధిలోని 7 నియోజకవర్గాల వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని